సోమవారం 28 సెప్టెంబర్ 2020
Devotional - Sep 16, 2020 , 00:09:57

రామ లక్ష్మణుల అనుబంధం!

రామ లక్ష్మణుల అనుబంధం!

విడదీయరాని అన్నాదమ్ముల అనుబంధానికి ప్రతీక రామ లక్ష్మణులు. ఒకే తల్లి కడుపులో పుట్టకపోయినా అంతకన్నా ఎక్కువ మమకారాన్నే పెనవేసుకున్న రెండు ఆత్మలు వారివి. భారతీయ సంస్కృతిలో ఎవరికైనా కవల పిల్లలు పుడితే రామ లక్ష్మణులను తలచుకుంటారు. యుగయుగాలుగా అన్నాదమ్ములకు వారితోపాటు లవకుశులు, బల రామకృష్ణుల పేర్లు పెట్టడమూ సహజమైంది. రామాయణంలోనే ‘భరత శత్రుఘ్నులూ’ చెక్కుచెదరని సోదర ప్రేమకు గొప్ప ఉదాహరణలు. ఈ కలికాలంలో అన్నాదమ్ములకు పెండ్లిళ్లు కాగానే వేరు కాపురాలు పెట్టడం, తల్లిదండ్రులను ఇబ్బందుల పాలుచేయటం వంటి అనారోగ్యకర ధోరణులు ప్రబలుతున్నాయి. ఈ నేపథ్యంలో పరస్పర త్యాగాలతో విలసిల్లిన రామ లక్ష్మణులు వంటి పౌరాణిక ఆదర్శమూర్తుల జీవిత కథలు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ‘నీ సోదరులు నీకు అండగా ఉండటం నీ విజయానికి ఒక కారణం’ అని రావణుడే అసువులు బాసేముందు రామునితో అన్నాడంటే, ఆ అన్నాదమ్ముల అవ్యాజమైన ప్రేమ ఎంతటిదో అర్థం చేసుకోవచ్చు.

రాముడు పద్నాలుగేండ్లు అరణ్యవాసం చేయటానికి సిద్ధమైన వేళ, లక్ష్మణుడు ‘తానూ వెంట వస్తా’నన్నాడు. ‘తండ్రిది తొందరపాటు నిర్ణయం’ అని నిందిస్తాడు కూడా. దానికి రాముడు, ‘లక్ష్మణా! ధర్మం, అర్థం, కామం.. మూడు పురుషార్థాలలో ‘ధర్మం భార్య వంటిది’. దానితోనే అర్థకామాలకు విలువ. అందుకే, భార్య ‘ధర్మపత్ని’. సీత మాత్రమే నాతో వస్తుంది. నువు నీ భార్య దగ్గరే ఉండు’ అన్నాడు. లక్ష్మణుడు తృప్తి చెందక, ‘వెంట వస్తానని’ పట్టుబడుతాడు. ‘మూడు పురుషార్థాలు, అన్నాదమ్ములు అనుభవించలేనివి ఏవీ నేను అనుభవించను’ అని కూడా రాముడు త్యాగనిరతిని వ్యక్తం చేశాడు. అయినా, వినకుండా లక్ష్మణుడు రామునితో వెళతాడు. ‘భరతుడు పట్టాభిషేకం చేసుకుంటే మన అమ్మల (కౌసల్య, సుమిత్ర)కు ఆదరణ తగ్గుతుంది. కనుక, వారిని రక్షించటానికి నువు ఇప్పటికైనా అయోధ్యకు వెళ్లు’ అని రాముడు మరో ప్రయత్నంగా లక్ష్మణుని ఆదేశిస్తాడు. అది విన్న సౌమిత్రి, బాణం వంటి మాట అంటాడు. ‘అన్నా! సీతమ్మకు ఇలాగే చెప్పి పంపగలవా?’. రాముడు ఆశ్చర్యపోతాడు. అక్కడితో ఊరుకోకుండా, ‘నీళ్లను విడచి చేప ఒడ్డున పడవేస్తే తడి ఆరేదాక మాత్రమే బతుకుతుంది. నేనూ అంతే!’ అని అన్నపై అవ్యాజమైన ప్రేమను చూపిస్తాడు. భరతుడు కూడా గుహుని ఆశ్రమంలో సీతారాములు నిద్రించిన గడ్డిపైనే పడుకొని, తన సోదర ప్రేమను ప్రకటిస్తాడు. అంతేకాదు, పద్నాలుగేండ్లపాటు తానూ నారవస్ర్తాలే ధరించాడు. పెద్దన్న (రామ) పాదుకలను సింహాసనంపై ఉంచి ‘రాముని పేరు’పైనే రాజ్యపాలన చేస్తాడు. 

యుద్ధంలో లక్ష్మణుడు మూర్ఛిల్లిన వేళ అయితే, రాముడు తమ్ముడి కోసం విలవిల లాడుతాడు. ఒక దశలో హనుమంతునితో సీతమ్మ ‘రామునికి నాకన్నా లక్ష్మణుడే ఎక్కువ’ అంటుంది. అదే నిజమన్నట్టుగా రాముడు, ‘తమ్ముడు (లక్ష్మణుడు) శాశ్వతంగా దూరమైతే నా ప్రాణాలు పోతాయి’ అనీ అంటాడు. ఎంత భావోద్వేగమో చూడండి. లక్ష్మణుని వలె శత్రుఘ్నుడు కూడా భావగుణ సంపన్నుడు. రాముని కోసం మంథరపై కోపం ప్రకటించి ‘వధిస్తా’నన్నాడు. దానికి భరతుడు తమ్ముని ఓదార్చి చెప్పటంతో శాంతిస్తాడు. పట్టాభిషేక సమయంలో కూడా ‘లక్ష్మణా! నీవే రాజ్యమేల వలసి ఉంటుంది’ అని తమ్మునిపై వాత్సల్యం కురిపించాడు రాముడు. ఇలా, రామాయణంలో ‘అన్నాదమ్ముల ప్రేమ’ యుగయుగాలకూ ఆదర్శమైంది. ప్రేమ, పేగుబంధం, ఆప్యాయత అనురాగాలకు మాత్రమే విలువ ఇవ్వాలని, ఆడంబరాలు, ఆస్తిపాస్తులకు కాదని రామాయణంలోని ఈ నలుగురి అన్నాదమ్ముల అనుబంధం మనకు ప్రబోధిస్తున్నది. తాత్కాలిక సుఖాల కోసం మల్లెతీగలా అల్లుకున్న అనుబంధాలను నాశనం చేసుకోకుండా సర్దుబాటు, సంయమనం, సహనం, విచక్షణలతో అన్నాదమ్ములు కలిసిమెలిసి జీవించాలన్నదే ఇందులోని సందేశం.

మాడుగుల 

నారాయణమూర్తి

94411 39106


logo