శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Devotional - Sep 15, 2020 , 00:07:15

ఆనందో బ్రహ్మ!

ఆనందో బ్రహ్మ!

ఈ చరాచర సృష్టి అంతటికీ పరమ కారణం పరమాత్మ. అతనినే మనం ‘భగవంతుడు’, ‘పరబ్రహ్మం’, ‘సర్వేశ్వరుడు’ అని అనేక విధాలుగా పిలుస్తున్నాం. ‘ఐశ్వర్యస్య సమగ్రస్య వీర్యస్య యశసః శ్రియః/ జ్ఞాన వైరాగ్య యోశ్చైవ షణ్ణాం భగ ఇతీరణా॥’. సమగ్రమైన ‘ఐశ్వర్యం (అధికారం), శక్తి, యశస్సు (కీర్తి), సంపద, జ్ఞానం, వైరాగ్యం.. అనే ఆరింటిని ‘భగం’ అంటారు. ‘భగం’ కలవాడు కనుక ‘భగవంతుడు’ అని పేరు. ‘ఉత్పత్తించ వినాశంచ భూతానా మాగతిం గతిం/ వేత్తి విద్యామ విద్యాంచ సవాచ్యో భగవానితి॥’. భూతాల ఉత్పత్తి, వినాశం, రాకడ, పోకడ, విద్య, అవిద్య.. అన్నీ తెలిసినవాడే ‘భగవానుడు’. సృష్టి (పుట్టించడం), స్థితి (పోషించడం, శాసించడం), లయం (నాశం చేయడం), తిరోధానం (తనలోకి తీసుకోవడం), అనుగ్రహం (మరల ఉనికిని కలిగించడం) ఈ పనులను భగవంతుడే తన మాయా శక్తితో చేస్తాడు. అందువల్లే, పరమాత్మ ‘పంచకృత్య పరాయణుడు’. పరబ్రహ్మానికి ‘ఓం, తత్‌, సత్‌' అని మూడు పేర్లు ఉన్నాయి. ‘ఓం తత్స దితి. నిర్దేశో బ్రహ్మణః త్రివిధః’ అని ‘భగవద్గీత’ వాక్యం. ‘అవతి భూతాని ఇతి ఓం’. సర్వభూతాలను రక్షించేది కనుక ‘ఓం’. ఈ ‘ఓంకారం’ అత్యంత పవిత్రమైంది. అన్ని మంత్రాలకూ మూలం. అన్ని కర్మలకూ ముందుగా ‘ఓం’ చెప్తాం. దీనినే ‘ప్రణవం’ (మిక్కిలి స్తోత్రించదగింది) అనీ అంటాం.

సర్వకారణ కారణత్వాన్ని ‘తత్‌' అనే పదం చెబుతుంది. ‘యత్తద్య తస్తతో హేతౌ’. ‘యత్‌' (ఏది), ‘తత్‌' (అది), ‘యతః’ (ఎక్కడి నుంచి), ‘తతః’ (అక్కడి నుంచి) ఈ నాలుగు పదాలు కారణాన్ని చెప్తాయి. పరమాత్మ నుంచే ‘సర్వం’ (అంతా) ఏర్పడిందని ‘తత్‌' శబ్దం సూచిస్తున్నది. ఎల్లప్పుడూ ఉండే తత్తాన్ని (శాశ్వతత్తాన్ని) ‘సత్‌' శబ్దం చెబుతున్నది. ‘అస్తి ఇతి సత్‌'. ఉన్నది (ఉండేది) అనికూడా ‘సత్‌' శబ్దానికి అర్థం. ‘ఈ సృష్టికి పూర్వం నేనొక్కడినే ఉన్నాను. సత్తుకాని, అసత్తుకాని, వాటికి కారణాలు గాని ఏవీ లేవు. ఇవన్నీ నశించిపోయినా ‘మిగిలి ఉండేవాడను నేనే’ అని ‘భాగవత’ ప్రమాణం. పరమాత్మ ఒక్కడే ఎల్లప్పుడూ ఉండేవాడు. 

ఇది అతని శాశ్వతత్త్వాన్ని తెలియజేస్తున్నది. ‘సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ’ అని ఉపనిషత్తు వాక్యం. సత్పురుషులకు వర్తించేది సత్యం. శ్రీరామ, శ్రీకృష్ణావతారాలలో పరమాత్మ ‘తన సత్యసంధత’ను నిరూపించాడు. జ్ఙాయతే ఇతి జ్ఞానమ్‌. తెలిసేది కనుక జ్ఞానం. పరమాత్మకు సంబంధించిన జ్ఞానమే నిజమైన జ్ఞానం. ఇది వేదాల ద్వారానే తెలుస్తుంది. పరమాత్మ మాత్రమే సర్వజ్ఞుడు. ‘అన్తం న విద్యతే ఇతి అనన్తం’. దేనికి అంతం (చివర) లేదో, తెలియదో అది అనంతం. పరమాత్మకు మొదలుకాని, చివరకాని లేవు. అందువల్లే పరమాత్మ అనాది, అనంతం. పరమాత్మ స్థితి ఆనందం. ‘ఆనందో బ్రహ్మ’ అని పెద్దల మాట. ఆనందమంటే ‘సంతోషం’. కానీ, వాస్తవానికి ‘ఏ వికారాలూ లేని స్థితి’ ఆనందం.

ప్రతి వస్తువుకు ఉత్పత్తి (పుట్టడం), సత్త (ఉండటం, బలం కలిగి ఉండటం), వృద్ధి (పెరుగుదల), పరిణామం (మార్పు చెందడం), అపక్షయం (క్షీణించడం), నాశం (నశించిపోవడం) అనే ఆరు గుణాలుంటాయి. అలాగే, సంతోషం, దుఃఖం మొదలైనవి కూడా వికారాలే. ఇవేవీ లేనివాడు కనుక, పరమాత్మ ‘ఆనంద స్వరూపుడు’. పరమాత్మే సర్వవ్యాపకుడు, సర్వశాసకుడు. కర్త, కర్మ, క్రియ అంతా పరమాత్మనే. కాలాతీతుడు, గుణాతీతుడు అయిన పరమాత్మ అన్ని వస్తువులలో చైతన్యరూపమై ఉండి, అన్ని పనులూ నిర్వహిస్తాడు. అన్నీ తానే అయి కూడా దేనితో సంబంధం లేని వాని వలె ఉదాసీనంగానూ ఉంటాడు. కర్తృత్వ భావాన్ని పొందడు. ఎల్లప్పుడూ ఆనందంతోనే ఉండటం పరమాత్మ ప్రత్యేక లక్షణం. ఈ జగత్తంతా పరమాత్మ అధీనంలో ఉన్నది. కనుక, అందరికీ, అన్నిటికీ సర్వాశ్రయుడు, అనన్య శరణ్యుడు పరమాత్మనే.


logo