శనివారం 26 సెప్టెంబర్ 2020
Devotional - Sep 14, 2020 , 04:59:37

కేశవ ధృత కల్కి శరీర జయ జగదీశ హరే!

కేశవ ధృత కల్కి శరీర జయ జగదీశ హరే!

దశావతారాలలో చివరిది ‘కల్కి అవతారం’. మిగిలిన అన్ని అవతారాలూ ఇప్పటికే ప్రకటిత మయ్యాయి. కేవలం, ఈ కల్కి అవతారమే ఇక మిగిలింది. ఇది ‘కలియుగం, సత్యయుగారంభాల’ సంధికాలంలో రానున్నది. అద్భుతమైన ఈ అవతార విశేషాలను ‘శ్రీమద్భాగవతం’ చాలా స్పష్టంగా పేర్కొన్నది. కలియుగం ప్రారంభమై ఇప్పటికి 5,120 సంవత్సరాలు పూర్తవుతు న్నాయి. రేపు (15వ తేది) కలియుగాది సందర్భంగా ‘కల్కి భగవానుని’ స్మరణతో పునీతులమవుదాం.

మ్లేచ్ఛ నివహ నిధనే కలయసి కరవాలం

ధూమ కేతుమివ కిమపి కరాళం

కేశవ ధృత కల్కి శరీర జయ జగదీశ హరే॥

కల్కి భగవంతుని అవతారం గురించి ‘దశావతార స్తోత్రం’లో పేర్కొన్న సుప్రసిద్ధ కీర్తన ఇది. శ్రీ జయదేవ గోస్వామి విరచితమైన ఈ స్తోత్రంలో భవిష్యత్‌ అవతారమైన కల్కి దేవుని స్తుతిస్తూ “ఓ కేశవా! ఓ జగదీశా! కల్కి రూపాన్ని ధరించే ఓ హరీ! నీకు జయము జయము. కలి యుగాంతంలో మ్లేచ్ఛుల వంటి జనులను నశింపజేయడానికి నువు భయంకరమైన ఖడ్గాన్ని చేపట్టి, తోకచుక్కలాగా ప్రకటితమవుతావు” అని వర్ణించారు. 

‘మ్లేచ్ఛాన్‌ మూర్ఛయతే దశా కృతికృతే కృష్ణాయ తుభ్యం నమః’. శ్రీ జయదేవ గోస్వామి 12వ శతాబ్దంలో శ్రీవ్యాస విరచితమైన ‘శ్రీ మద్భాగవతం’ ఆధారంగానే ‘మ్లేచ్ఛులను మూర్ఛిల్ల జేసేవాడవైన ఓ స్వామీ! దశావతారాలను స్వీకరించిన ఓ శ్రీకృష్ణా! నీకు వందనములు” అంటూ స్తుతించారు.

సత్యయుగ స్థాపనే లక్ష్యంగా..

మన శాస్ర్తాలు కాలచక్రాన్ని నాలుగు భాగాలుగా విభజించి, వాటిని యుగాలుగా పేర్కొన్నాయి. అవి: సత్య (కృత), త్రేత, ద్వాపర, కలి యుగాలు. ఇవి నిరంతరం వస్తూనే ఉంటాయి. ప్రస్తుతం జరుగుతున్నది కలియుగం. దీని తర్వాత వచ్చేది సత్యయుగం. ఈ కలియుగాన్ని పరిసమాప్తి చేసి, సత్యయుగాన్ని ఆరంభింపజేయడానికే ‘కల్కి అవతారం’ ఆవిర్భవిస్తుందని ‘శ్రీ మద్భాగవతం’ పేర్కొన్నది.

అథాసౌ యుగ సంధ్యాయాం దస్యుప్రాయేషు రాజసు

జనితా విష్ణుయశసో నామ్నా కల్కిర్జగత్పతిః ॥

- శ్రీ మద్భాగవతం, మొదటి స్కంధం, 

3వ అధ్యాయం, 25వ శ్లోకం

‘యుగసంధి సమయంలో జగన్నాథుడైన భగవానుడు కల్కి అవతారాన్ని ధరించి విష్ణుయశుడనే బ్రాహ్మణునికి పుత్రునిగా జన్మించగలడు. ఆ సమయంలో భూపాలకులందరు చోరులుగా, పతితులై ఉంటారు’.

దశావతారాలలో చివరి అవతారంగా ‘కల్కి అవతారం’ సుప్రసిద్ధమైంది. ‘శ్రీమద్భాగవతం’ దీనిని 22వ అవతారంగా పేర్కొన్నది. ‘శ్రీమద్భాగవతం’లో చెప్పిన అవతారాలన్నీ ఇప్పటికే ప్రకటితమయ్యాయి. కేవలం, ఈ కల్కి అవతారమే ఇక మిగిలింది. ఇది కలియుగం, సత్యయుగారంభాల యుగసంధి సమయంలో ప్రకటితం కానున్నది. ఈ అద్భుతమైన అవతారం ఏ సమయంలో, ఏ గ్రామంలో, ఏ పుణ్యాత్ముని ఇంట, ఏ ప్రయోజనం కోసం ఆవిర్భవించనున్నదో కూడా చాలా స్పష్టంగా అందులో వివరించి ఉంది.

మానవ దేహాలూ ‘చిన్న’బోతాయి!

కలియుగ లక్షణాలు ‘శ్రీమద్భాగవతం’లోని 12వ స్కంధంలో విస్తారంగా వర్ణితమైనాయి. కలియుగ ప్రభావం వల్ల ధర్మం, సత్యం, శౌచం, ఓర్పు, దయ, ఆయువు, బలం, స్మృతి రోజురోజుకూ తగ్గిపోతాయి. కలియుగంలో ధనమే మానవుని ఉత్తమజన్మకు, ఆచారానికి, గుణాలకు సూచనగా నిలుస్తుంది. మనిషి బలాన్నిబట్టే న్యాయధర్మాలు అన్వయితమవుతాయి. కేవలం బాహ్య ఆకర్షణ కారణంగానే స్త్రీ పురుషులు దాంపత్యం కొనసాగిస్తారు. వ్యాపార జయం వంచనపై ఆధార పడుతుంది. యజ్ఞోపవీత ధారణతోనే మనిషి బ్రాహ్మణునిగా తెలియబడతాడు. 

మనిషి ఆధ్యాత్మిక స్థితి కేవలం బాహ్యచిహ్నాలనుబట్టి నిర్ణయితమవుతుంది. మనిషి మంచి జీవికను సంపాదించ లేకపోతే అతని ఔచిత్యం తీవ్రంగా సందేహాస్పదమవుతుంది. ‘కపటత్వం’ సద్గుణంగా అంగీకారం పొందుతుంది. వివాహం కేవలం వాక్కుల సమ్మతితో ఏర్పాటవుతుంది. కడుపు నింపుకోవడమే జీవితలక్ష్యంగా మారుతుంది. ‘ధర్మపాలన’ కేవలం పేరు ప్రఖ్యాతులు పొందడానికే అన్నట్టుగా సాగుతుంది. ధరణి దుష్టజనులతో నిండిపోగా, అన్ని వర్ణాలలో ఎవరైతే తనను బలవంతునిగా ప్రదర్శించుకొంటారో వారే రాజ్యాధికారాన్ని పొందుతారు.

కలియుగం పరిసమాప్తమయ్యే వేళకు సకల జీవుల దేహాలు పరిమాణంలో అత్యంత చిన్నగా అయిపోతాయి. వర్ణాశ్రమ ధర్మాలు నశించిపోతాయి. వేద మార్గాన్ని మానవులు పూర్తిగా మరిచిపోతారు. ధర్మం దాదాపు నాస్తికత్వమే అయి ఉంటుంది. రాజులు దాదాపుగా చోరులవుతారు. దొంగతనం, అసత్య భాషణం, అనవసరమైన హింస జనులకు వృత్తులుగా అవుతాయి. గృహాలు పుణ్యరహితాలుగా మారుతాయి. మానవులందరూ గాడిదల స్వభావాన్ని (ఖరధర్మిషు) పొందుతారు. ఆ సమయంలోనే భగవంతుడు ధరిత్రిపై కల్కిగా అవతరిస్తాడు. విశుద్ధ సత్తగుణ బలంతో వర్తిస్తూ, ఆ దేవదేవుడు ధర్మాన్ని పరిరక్షిస్తాడని శాస్ర్తాలు చెప్పాయి.

అవతారం ఎప్పుడు? ఎలా?

‘శంభల గ్రామ ముఖ్యస్య బ్రాహ్మణస్య మహాత్మనః 

భవనే విష్ణువశసః కల్కిః ప్రాదుర్భ విష్యతి’. 

‘శంభల అనే గ్రామంలో మహోన్నత బ్రాహ్మణుడు, మహాత్ముడు అయిన విష్ణుయశుని ఇంట్లో కల్కి భగవానుడు అవతరిస్తాడు’ అని శాస్త్ర వచనం. ‘కల్కి భగవానుడు’ వెంటనే అసాధారణ వేగంతో ప్రయాణించే ‘దేవదత్తమనే’ అశ్వాన్ని అధిరోహించి, ఖడ్గాన్ని చేతపట్టి భూమి అంతటా ‘దుష్టశిక్షణ’ కోసం బయల్దేరుతాడు. స్వామి అష్టయిశ్వర్యాలను, అష్ట విశిష్ట గుణాలను ప్రదర్శిస్తాడు. సాటి లేని తేజాన్ని ప్రకటిస్తూ, అనూహ్య వేగంతో ప్రయాణిస్తుంటాడు. ఆ దేవదేవుడు రాజ వేషంలోని కోట్లాది దానవులను సంహరిస్తాడు. ఈ అవతారంలో కల్కి భగవానుడు కేవలం తన కరవాలంతో దుష్టులను తుద ముట్టించడమే ఏకైక కార్యంగా అవతరిస్తాడు. ధూర్తులైన రాజులందరు వధింపబడిన తర్వాత వాసుదేవుని చందనాది అంగరాగాల పవిత్ర సౌరభంతో కూడిన వాయుస్పర్శను జనులు ఆస్వాదిస్తారు. 

ఇలా అప్పటికి భూమిమీద మిగిలిన పుణ్యాత్ములందరి మనసులు నిర్మలమవుతాయి. ఆ జనుల హృదయాలలో దేవదేవుడైన వాసుదేవుడు దివ్యమైన సత్తగుణ రూపంలో ప్రకటితమవుతాడు. వారే ధరణిని తిరిగి ప్రజలతో నింపుతారు. దేవదేవుడు ధర్మపతియైన కల్కిగా అవతరించినప్పుడే ‘సత్యయుగం’ ప్రారంభమవుతుంది. అప్పుడు మానవులు సత్తగుణయుత సంతానాన్ని పొందుతారు. చంద్రుడు, సూర్యుడు, బృహస్పతి కలిసి కర్కాటక రాశిలో వుండగా, ఈ ముగ్గురూ ఏకకాలంలో పుష్యమి నక్షత్రంలోకి ప్రవేశించిన క్షణంలో ‘సత్యయుగం’ (కృతయుగం) ప్రారంభమవుతుంది. ఈ రకంగా కలియుగం పూర్తయి, సత్యయుగం ప్రారంభమయ్యే సమయం కూడా జ్యోతిష్గణనం ప్రకారమేనని ‘భాగవతం’ పేర్కొన్నది.

ఇంకా.. ప్రథమ పాదమే

కలియుగమంటే కలహయుగం, కపటయుగం, కలుషాల యుగం, కలతల యుగం, కష్టాల యుగం. అందుకే, ‘శ్రీ మద్భాగవతం’ కలియుగం గురించి వర్ణిస్తూ, ‘కలేర్దోష నిధే రాజన్‌' అన్నది. అంటే, కలియుగం దోషసాగరం వంటిది. ద్వాపర యుగాంతంలో కలి ప్రవేశించినా శ్రీ కృష్ణుని సన్నిధి కారణంగా తన ప్రభావాన్ని చూపలేకపోయాడు. ఏ రోజునైతే శ్రీకృష్ణ భగవానుడు స్వధామ గమనం చేశాడో అదే రోజున కలియుగ ప్రభావం ప్రారంభమైందని పురాతత్త వేత్తలు చెబుతారు. ఆ విధంగా ప్రారంభమైన కలియుగం కల్కి భగవానుని అవతరణతో ముగుస్తుంది. 

ఈ కలియుగ పరిమితి 4,32,000 సంవత్సరాలుగా శాస్ర్తాలు చెప్పాయి. ఈ కాలపరిమితిలో ఇంతవరకు 5,120 సంవత్సరాలు మాత్రమే గడిచాయి. ఇప్పుడు మనం కలియుగంలోని మొదటి పాదంలో ఉన్నాం. ‘కలియుగే ప్రథమపాదే’ అని మంత్రశాస్త్రం చెబుతున్నది. కలియుగ ప్రథమ పాదంలోనే మానవ జీవితం ఇంతటి అష్టకష్టాలతో నడుస్తుంటే, ఇక రాబోయే కాలం మరెంత కష్టంగా ఉంటుందో ఊహించగలం. ఐతే, కలియుగాంతంలో ఇంకెంతటి పరిస్థితులు ఎదురు కానున్నాయో కూడా శాస్ర్తాలు సవివరంగా చెప్పాయి. 


వారికే సత్యయుగ ప్రవేశం!

దుర్భరమైన కలి ప్రభావం నుండి తప్పించుకోవడానికి కూడా ‘శ్రీ మద్భాగవతమే’ అత్యంత సరళమైన మార్గోపాయం సూచించింది. అదే ‘హరినామ’ సంకీర్తనం. ‘కలౌ తత్‌ హరి కీర్తనాత్‌'. సత్యయుగంలో విష్ణుధ్యానం వల్ల, త్రేతాయుగంలో యజ్ఙాచరణ వల్ల, ద్వాపరయుగంలో భగవత్పాద పద్మ పరిచర్యవల్ల ఏ ఫలమైతే కలిగిందో అదే ఫలం ఈ కలియుగంలో కేవలం ‘హరినామ కీర్తన’తోనే లభిస్తుంది. అలా సర్వకార్యాలు జయప్రదమవుతాయి. ‘యత్ర సంకీర్త నేనైవ సర్వస్వార్థో భిలభ్యతే’ (హరినామ సంకీర్తనతో సమస్త కోర్కెలు నెరవేరుతాయి). అందుకే, ‘హరేకృష్ణ హరేకృష్ణ, కృష్ణకృష్ణ హరేహరే/ హరేరామ హరేరామ రామరామ హరేహరే’ అనే సంకీర్తనే మనకు శరణ్యం. దీనితో ఈ జన్మలో సమస్త విజయాలను సాధించి, చివరకు ముక్తిని, భగవత్‌ ప్రాప్తిని పొందగలం. ‘ఆ విధంగా చేయని వారికోసమే’ కల్కి భగవానుడు కలి యుగాంతంలో అవతరించి, మృత్యురూపంలో దర్శనమిస్తాడని శాస్ర్తాలు చెప్తున్నాయి. అప్పుడు పుణ్యాత్ములు మాత్రమే కల్కి అవతార దర్శనంతో పునీతులై సత్యయుగంలోకి ప్రవేశిస్తారు. 

డాక్టర్‌ వైష్ణవాంఘ్రి సేవక దాస్‌

98219 14642


logo