ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Devotional - Sep 14, 2020 , 04:59:43

చిదానంద రూపమే శివోహం!

చిదానంద రూపమే శివోహం!

అంతవంత ఇమే దేహో నిత్యా స్యోక్తాః శరీరిణః 

అనాశినో ప్రమేయస్య తస్మాదుధ్యస్వ భారతః ॥

- భగవద్గీత (2-18)

ప్రతి మానవుడు తెలుసుకోవలసిన విషయాలు ‘భగవద్గీత’లో చాలా ఉన్నాయి. అందులో ‘ఆత్మజ్ఞానం’ ప్రధానమైంది. అది తెలుసుకోవడమే నిజమైన జ్ఞానం. ఈ విషయాన్నే నరునికి నారాయణుడు బోధిస్తూ, ‘ఓ అర్జునా! ఆత్మను ‘శరీరి’ అంటాం. అది నిత్యమైంది, నాశరహితమైంది. శరీరాలు నశిస్తాయి. అవి అశాశ్వతాలు. అప్రమేయుడు, నిత్య స్వరూపి అయిన ‘శరీరి’ని గురించి తెలుసుకొని యుద్ధానికి సిద్ధం కమ్ము’ అని చెప్పాడు. ఇలా, అర్జునునికి ఆత్మతత్తాన్ని గురించి బోధించడం మానవ సమాజానికి బోధించడంగానే భావించాలి. ప్రతి జీవిలో పరమాత్మ ఉన్నాడన్నది ‘భగవద్గీత’ బోధిస్తున్న శాశ్వత సత్యం. జీవుల శరీరాలు కేవలం ఉపాధులు మాత్రమే. వాటికి బాల్యం, కౌమారం, యౌవనం, వృద్ధా ప్యం మరణం వంటివి. సహజ ధర్మాలు విధిగా ఉం టాయి. ఆ శరీరాన్ని వదలి, అందులోని పరమాత్మ మరో శరీరాన్ని పొందుతుంది. ఈ కారణంగా ‘శరీరమే నశిస్తుంది తప్ప, అందులోని ‘శరీరి’ నశించడు. వానిని తెలుసుకొన్నప్పుడు మనం దుఃఖం నుంచి దూరమయ్యే అవకాశం ఉంటుంది. దేహమే నశిస్తుంది కానీ, ‘దేహి’ కాదు అనే సత్యమే మనిషికి ఆత్మజ్ఞానాన్ని తెలుపుతున్నది. అందుకని, నాశనమైపోయే గుణం కలిగిన శరీరాలపై భ్రమలు పెట్టుకోవడం వివేకవంతుల లక్షణం కాదు. ఎప్పుడైనా శరీరంలోని ‘శరీరి’నే నమ్ముకొని జీవితాన్ని ఫలవంతం చేసుకోవాలి తప్ప, మరొక మార్గంలోకి పోయి దుఃఖాన్ని తెచ్చుకోకూడదు. దానినే ‘చిదానంద రూపం శివోహం’ అన్న మాటతో పెద్దలు బోధించారు.

ఇక్కడ భగవంతుడు ఒక విషయాన్ని సమస్త మానవాళికి బోధించాలని సంకల్పించాడు. అదే కర్తవ్య నిర్వహణ, బాధ్యతను విస్మరించకపోవడాన్ని గురించి చెప్పడమే ప్రధానం. మనిషికి తన శరీరం మీద, శరీర బాంధవ్యాల మీద ఉన్న మమకారం తాను నిర్వహించవలసిన కర్తవ్యాల నుంచి అతడిని దూరం చేస్తుంది. ఒకవేళ కర్తవ్యమనేది ధర్మ నిర్వహణకు సంబంధించినదైతే ఆ కర్తవ్యాన్ని విస్మరించడం అధర్మ వ్యాప్తికి కారణమవుతుంది. దానివల్ల లోకం ప్రమాదంలో పడిపోయే అవకాశం ఉంది. దుష్టశిక్షణకు విఘాతం కలుగుతుంది. జాతి ప్రగతి కుంటుపడుతుంది. వీటన్నిటికీ కారణం ‘శరీరం శాశ్వతమనుకొనే భ్రమ’. ఈ భ్రమలో నుంచి బయటకు తీసుకొనిపోవడమే శ్రీకృష్ణ పరమాత్ముడు మన పట్ల చూపిన కరుణామయ దృక్పథం. దాని కారణంగానే సత్యమేదో తెలుసుకొని, లోకం సత్యపథ గామియై మానవులు నిత్య సత్కర్మ నిష్ఠులై ప్రవర్తించడం సులువవుతుంది. అర్జునుని మానసిక స్థితి డోలాయమానమైంది. ‘తమ గురుజనులు, బంధుజనులను సంహరించడానికి తన శక్తిని ఉపయోగించాలా?’ అన్న భావనతో దాని గురించి వెనుకంజ వేశాడు.

‘అధర్మ యుద్ధానికి పాల్పడిన కౌరవాదులను ఉపేక్షిస్తే అది మరింత అధర్మాన్ని వ్యాపింపజేసినట్లవుతుంది. అందుకే, భగవానుడు స్వయంగా పూనుకొని తన సఖునికి కనువిప్పు కలిగించే రీతిలో బోధించాడు. ‘నువ్వు ఆత్మలను ఏ నాటికీ సంహరించలేవు. ఆత్మ నిత్యం. శరీరం మాత్రమే అనిత్యం. నువ్వు కేవలం దృశ్యమానమవుతున్న శరీరాల్ని మాత్రమే యుద్ధంలో పడగొట్టగలవు తప్ప, వాటిలోని ఆత్మలను నువ్వేమీ చెయ్యలేవు’ అని స్పష్టంగా బోధించాడు. అందుకే, ‘నువు చంపడం వల్ల యుద్ధంలో నీ గురుజనులు, బంధువులు, సోదరులు, ఆత్మీయులు మరణిస్తున్నారన్న భ్రమలు తొలగించుకొమ్ము’ అని ఎంతో విపులంగా వివరించాడు శ్రీకృష్ణుడు. ‘ైక్లెబ్యం మాస్మ గమః పార్థ...’ అంటూ అర్జునునికి కనువిప్పు కలిగించి, ధర్మ కర్మ నిర్వహణకు సిద్ధం చేశాడు స్వామి. ఏ నాటికైనా మనం తెలుసుకోవలసిన ప్రధాన విషయం ధర్మాచరణ, కర్తవ్య నిబద్ధతలను కలిగి ఉం డటం. ఇవే మనం ఆచరించవలసిన కర్మలు.


logo