బుధవారం 23 సెప్టెంబర్ 2020
Devotional - Sep 13, 2020 , 00:33:59

కలియుగ రహస్యం

కలియుగ రహస్యం

భగవంతుని పట్ల ఆసక్తి, ఆకర్షణే భక్తి. భక్తికి ‘ఇతి’ (సమాప్తి) గాని ‘మితి’ (పరిమితి) గాని లేవు. అది ఎప్పుడూ అపూర్ణమే. భక్తికి ఆచార్యుడైన నారద మహర్షి తన భక్తి సూత్రాలలో భక్తిని విశ్లేషిస్తూ ‘ప్రతిక్షణ వర్ధమానం’ అన్నాడు. అనగా ఉత్తరోత్తర- ఇతోధికంగా వృద్ధి చెందుతూ వర్ధిల్లడమే భక్తి లక్షణం. భక్తిలో క్రోధ లోభాలకి, అసూయకి, అశుభ బుద్ధికి ఆస్కారమే- అవకాశమే లేదు. ఉంటే అసలు భక్తుడే కాదు. కాని, భక్తికి దుఃఖానికి కావలసినంత పొత్తు. భక్తుడు భగవద్‌, భాగవత (భక్త) వియోగంలో తపిస్తాడు. ‘విపద్విస్మరణం విష్ణోః’- భగవంతుని విస్మరించటమే భక్తునికి విపత్తు. విస్మరణం విషమరణం అన్నారు విద్వాంసులు.

ద్వారక నుంచి తిరిగి వచ్చిన అర్జునుడు, కృష్ణుని ఉపకారాలను స్మరిస్తూ ధర్మరాజు ఎదుట దీనంగా విలపిస్తున్నాడు- మత్స్యయంత్రాన్ని ఛేదించి పాంచాలిని పరిణయమాడినా, ఖాండవ వనం దహించి గాండీవం గైకొన్నా, మయసభను పొంది రాజసూయ యాగం నిర్వహించినా, పశుపతిని మెప్పించి పాశుపతం పొందినా, అమరేంద్రుని ఆర్ధసింహాసనం అధిష్ఠించినా, కాలకేయ నివాత కవచాది రక్కసుల ఉక్కడగించినా, ఉత్తర గోగ్రహణంలో కౌరవ సేనావాహినిని అవలీలగా దాటగల్గినా- ఆ దామోదరుని దయాదాక్షిణ వీక్షణం వల్లనే గదా! ద్రౌపదీ మాన సంరక్షణం కూడా ఆ చక్రధరుని చలవేగా! ‘మనుజ వల్లభ మాధవు మఱపు రాదు’- అలాంటి మన ముద్దుల బావ మాధవుని మఱవగలమా మహారాజా! నేడు నా సేవలన్నీ నిరర్ధకమైనాయి. పూర్వజన్మలో ఎన్ని పాపాలు చేశానో నేను చావక ఇంకా నిలిచి ఉన్నా. ఆ ఆదిదేవుడు అస్తమించిన అనంతరం ఆయన ఆజ్ఞమేరకు పదహారు వేలమంది అంతఃపురకాంతలను వెంటబెట్టుకొని హస్తినకు వస్తూ ఉండగా అరణ్యమధ్యంలో కిరాతులు (బోయవారు) చుట్టుముట్టి పట్టుకొని వారిని దోచుకొన్నారు. నేను అడ్డుపడలేక ఆడుదానివలె అసహాయుడనై ఉండిపోయాను, అగ్రజా!

ఐతే, ఆ కాంతలందరూ శ్రీకాంతుని భోగినులైన యోగినులు, సాక్షాత్‌ లక్ష్మీస్వరూపలు. అట్టివారిని కిరాతులు స్పృశించగలరా? విష్ణు, బ్రహ్మపురాణాల్లో ఈ విధంగా వ్యాస మహర్షి విజయు (అర్జును)నితో అన్నమాట- అర్జునా! గతంలో ఈ అతివలందరూ అష్టావక్ర మహర్షిని ఆరాధించి ‘అచ్యుతుడే మాకు ఆత్మేశ్వరుడు (భర్త) కావాలని’ అర్థించారు. ఆయన ‘తథాస్తు’ అన్న తరువాత వారు ఆయన శరీరంలోని అష్టవంకరలు చూచి నవ్వారట. మహర్షి క్రుద్దుడై వారిని బోయలబారిన పడునట్లు శపించాడట. పిమ్మట పశ్చాత్తాపంతో ప్రాథేయపడగా ‘శ్రీకృష్ణుడే ఆ రూపంలో మిమ్ము దోచుకొంటాడు పొండి’ అని అన్నాడట. ఇలా చెప్పి- ఇది శౌరి సంకల్పమే కాన నీవు శోకించ పనిలేదని పారాశరుడు పార్థుని ఓదార్చాడు.

శా. “ఆ తేరా రథికుండు నా హయము లా యస్ర్తాసనం బాశర వ్రాతం బన్యుల దొల్లి జంపును దుదిన్‌ వ్యర్థంబులై పోయె మచ్చేతో ధీశుడు చక్రిలేమి భసతిక్షిప్తాజ్య మాయావి మాయా తంత్రోషర భూమి బీజముల మర్యాదన్‌ నిమేషంబునన్‌.”

అర్జునుడు అన్నగారి వద్ద ఇలా ఆక్రోశిస్తాడు-

అన్నా! ఇప్పుడు అదే రథం, అవే గుఱ్ఱాలు, ఆ గాండీవమే, ఆ బాణాలే, అన్నీ అవే, అప్పటివే. రథికుణ్ణి నేనూ ఉన్నాను. గతంలో ఇవన్నీ శత్రుసమూహాలను చీల్చిచెండాడినవే! కాని, నా హృదయేశ్వరుడైన ఆ హృషీకేశుడు, ఆ చక్రధారి లేనందున ఇవన్నీ ఉండీ లేనివైపోయాయి. నా సర్వశక్తులూ బూడిదలో చేసిన హోమాలైపోయాయి. మంత్రగాడిచ్చిన మాయదారి (ఉనికిలేని) వస్తువులై పోయాయి. చవిటినేలలో విత్తిన విత్తనాలైపోయాయి. వాసుదేవుడు లేని ఆ ఒక్క క్షణంలో సర్వం వ్యర్థమైపోయింది. అన్నీ ఉన్నా అచ్యుతుడు లేని కారణాన అవన్నీ అంకెలేని సున్నాలైపోయాయి! మనిషికి అంగబలం, అర్థబలం, అధికారబలం ఎంత ఉన్నా దైవబలం లేకున్న అంతా సున్న కాక మిన్న ఎలా అవుతుంది? ‘జీవనం సర్వభూతేషు’- సకల భూతాలలో జీవనం వాడే.

‘భూతానా మస్మి చేతనా’- సర్వప్రాణులలో ప్రాణశక్తి ఆ భగవంతుడే! బలవంతులలో బలం, తేజోవంతులలో తేజస్సు, విజేతలలోని విజయ రహస్యం, స్థిర చిత్తులలోని దృఢ నిశ్చయం- ఇవన్నీ ఆ పురుషోత్తముడే అని గీత బోధిస్తోంది. దేవాలయాలలో దాదాపు సంవత్సర కాలం పాటు రథం ఎవ్వరి దృష్టిని ఆకర్షించకుండా ప్రాంగణంలో ఒక మూల పడి ఉంటుంది. రథోత్సవం రోజున దానిని బయటకు తీసి బాగుచేసి అలంకరిస్తారు. రథానికి అకస్మాత్తుగా అంత అలంకరణ- ఆకర్షణ, అంత భోగం-భాగ్యం ఎలా వచ్చినై? రథంలో స్వామి కొలువై ఊరేగుతాడు కనుక. స్వామి వలన రథానికి పురస్కారం! స్వామి లేని రథానికి తిరస్కారం! ‘తద్వై ధనుస్త ఇషవః స రథో హయూస్తే..’ అన్న మూల శ్లోకానికి పై పద్యం పోతనగారి అందమైన ఆంధ్రానువాదం.

ధర్మరాజు తన మనుమడైన పరీక్షిత్తును హస్తినాపురానికి, అనిరుద్ధపుత్రుడైన వజ్రుని (శ్రీకృష్ణుని మునిమనుమడు) మధురా రాజ్యానికి అధిపతులుగా అభిషేకించి ఆశీర్వదించాడు. కుంతి కృష్ణ నిర్యాణవార్త విని పరమాత్మ యందలి ఏకాంత భక్తితో ప్రశాంతంగా సంసారం నుండి విరమించింది. పాండవులు పురుషోత్తముని పొందారు. ద్రౌపది ఏ ఆపేక్ష లేని భర్తలచే ఉపేక్షింపబడి అనన్య ఏకాంత భక్తితో అచ్యుతుని పొందింది. అచ్యుతుడు ఏనాడు అవతారం చాలించాడో ఆనాడే అమంగళమయమైన కలియుగం ఆరంభమయింది.

పరీక్షిన్మహారాజు తన ఏలికలో అధర్మమిత్రుడైన కలిపురుషుని సంహరించక నిగ్రహించాడు- అణచివేశాడు. ధర్మదేవతకు అభయమిచ్చి నాలుగు పాదాలతో (తపస్సు, శౌచం, దయ, సత్యం) ధర్మాన్ని నడిపించాడు. కలి బహు దుర్గుణాలకు నిలయమైనా ఒకటి, రెండు గొప్ప సుగుణాలు కూడా ఉన్నాయి. సారగ్రాహి ఐన పరీక్షిద్రాజ చంద్రుడు చేతికి చిక్కినా కలిని చంపక విడిచిపెట్టాడు. కలిలో సత్కర్మలు శీఘ్రంగా ఫలిస్తాయి. దుష్కర్మలు అంత శీఘ్రంగా ఫలించవు. మానసికంగా చేసే పాపాలు ఫలించవు. సాక్షాత్తుగా ఆచరిస్తేనే దుష్ఫలితాలు కల్గుతాయి. కాని, పుణ్యకార్యాలు చెయ్యలేకపోయినా చేస్తానన్న సంకల్పమాత్రంతోనే ఫలిస్తాయి. వీటిని మించిన సుగుణం- ‘కీర్తనాదేవ కృష్ణస్యముక్తసంగః పరం వ్రజేత్‌'- కలిలో కీర్తన భక్తి ముక్తికి సులభసాధనం. సూతముని అట్లు పలుకగా శౌనకాది మహర్షులు అతనిని అభినందించి, ఆశీర్వదించి శ్రీహరి గుణ కీర్తనను కీర్తిస్తూ ఇలా అన్నారు-

క. “శ్రీపంబులు ఖండిత సంతాపంబులు గల్మషాంధ తమస మహోద్య ద్దీపంబులు పాషండ దురాపంబులు విష్ణువందనాలాపంబుల్‌”క. “పావనములు దురిత లతాలావనములు నిత్యమంగళ ప్రాభవ సంజీవనములు లక్ష్మీ సంభావనములు వాసుదేవ పదసేవనముల్‌.”

‘సూతా! నందనందనుని కథా కీర్తన వందన ఆలాపాలు (సంభాషణలు) సమస్త సంపదలు ప్రసాదించి పరిరక్షించేవి. దైహిక, మానసిక తాపాలను తొలగించేవి. పాపాలనే కారుచీకట్లను పోకార్చే మహోజ్జల దీపాలు. నాస్తికులు పొందలేనివి నాస్తిక ప్రవృత్తులకు పాతర వేసేవి.’ ‘పద్మనాభుని పద పద్మ పూజలు పవిత్రతను ప్రసాదిస్తాయి. కల్మషా(పాపా)లనే తీగలను ఖండించివేస్తాయి. భక్త లోకానికి నిత్యమంగళాలు, నిఖిల ఐశ్వర్యాలు ఉజ్జీవింపచేస్తాయి. కమలాలయ (లక్ష్మి) కృపా కటాక్షాలు కురిపిస్తాయి.’ ఈ కందాలు రెండూ అమూలకాలు. పోతన మానస మాకందాలు. భక్తి మందార మరంద నిష్యందాలు. విష్ణువందనాలాపాలు, కృష్ణు పద పూజా కలాపాలు ఎంత స్వార్థ పరమార్థ ఫలప్రదాలో ప్రకటించే పద్యాలివి. శ్రవణ సుభగాలు, నిత్యమనన శుభదాలు. 

తంగిరాల రాజేంద్రప్రసాద శర్మ

98668 36006 


logo