సోమవారం 21 సెప్టెంబర్ 2020
Devotional - Sep 13, 2020 , 00:34:02

‘మోక్షం’ అంటే ఏమిటి?

‘మోక్షం’ అంటే ఏమిటి?

జన్మ కర్మ చ మే దివ్యమేవం యో వేత్తి తత్త్వతః

త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సో ర్జున॥

- భగవద్గీత (4.9)

‘ఓ అర్జునా! నా జన్మ, కర్మల దివ్యత్వాన్ని ఎరిగిన వారు తమ దేహం విడిచిన తర్వాత తిరిగి ఈ భౌతిక ప్రపంచంలో జన్మించరు. నా శాశ్వత ధామాన్ని చేరుతారు’. సాధారణంగా మోక్షాన్ని పొందటమనేది అంత సులభం కాదు. ఎంతో కఠోర తపస్సు, కఠినమైన జీవన విధానాన్ని అనుసరించేవారికి మాత్రమే అది సాధ్యమని అంటారు. అంతేగాక, కొన్ని కొన్నిసార్లు ఎన్నో జన్మల అనంతరం గానీ మోక్షానికి అర్హత సాధించలేమని కూడా అంటారు. కానీ, ‘భగవద్గీత’లో మాత్రం అందుకు అత్యంత సరళమైన మార్గాన్ని బోధించి ‘మోక్షాన్ని పొందటం సులభతరం’ చేశాడు శ్రీకృష్ణుడు. పై శ్లోకంలో ఆ మార్గాన్నే ఉపదేశిస్తూ, ‘ఎవరైతే తన జన్మ, కర్మల దివ్యత్వాన్ని తెలుసుకుంటారో వారు తిరిగి ఈ లోకంలో జన్మించవలసిన అవసరం ఉండదని’ ప్రకటించాడు. ‘మోక్షం’ అంటే అదే మరి.

‘కేవలం శ్రీకృష్ణుని జననం, లీలల్లోని దివ్యత్వాన్ని తెలుసుకున్నవారు సైతం దానిని సంతరించుకోగలరన్నది’ పై శ్లోకార్థం. ‘దివ్యత్వం’ అంటే ‘భౌతిక ప్రకృతి నియమాలకు అతీతమైంది’. శ్రీకృష్ణుడు ఈ లోకంలో అవతరించినా లేదా లీలలను ప్రదర్శించినా అవి భౌతిక ప్రకృతి నియమాలకు లోబడి నిర్వర్తించబడేవి కావు. భౌతిక ప్రకృతి నియమ, నిబంధనలకు శ్రీకృష్ణుడు ఎన్నడూ బద్ధుడు కాడు. తన అభీష్టం మేరకు మాత్రమే లోకంలో అవతరించి, దివ్యలీలలతో జగతిని తరింప జేస్తాడు. అదే, ఆ దేవదేవుని సర్వస్వతంత్రతకు నిదర్శనం. లోక కళ్యాణార్థం అవతరించే శ్రీకృష్ణుడు కాలక్రమంలో దుష్టశక్తులను అంతమొందించి, లోకహితాన్ని కాంక్షించే శిష్టులను రక్షించి ముందుకు నడిపిస్తాడు. కేవలం, తన ఆంతరంగిక శక్తి ద్వారా మాత్రమే అవతరించే శ్రీకృష్ణుడు భౌతిక ప్రకృతిపై ఎన్నడూ ఆధారపడడు. 

‘నారాయణః పరం అవ్యక్తాత్‌'. ‘నారాయణుడు ఈ సృష్టికి అతీతుడని’ శ్రీపాద శంకరాచార్యులు సైతం తమ భాష్యంలో అంగీకరించారు. మథురలోని కంసుని కారాగారంలో కృష్ణుడు జన్మించగానే శంఖ, చక్ర, గదా, పద్మాలతో చతుర్భుజ స్వరూపుడై దేవకీ వసుదేవులకు దర్శనమిచ్చాడు. వెంటనే, చతుర్భుజాలు కలిగిన చిన్న పిల్లవాడిలా రూపాంతరం చెందాడు. అలా, జన్మించిన బాలుని గురించి ‘శ్రీమద్భాగవతం’ (10.3.9-10)లోని వర్ణన అద్భుతం. ‘పంకజాల వంటి అద్భుత నేత్రాలను కలిగిన ఆ బాలుడు చతుర్భుజ రూపుడై, శంఖ, చక్ర, గదా, పద్మధారుడై ఉన్నాడు. వక్షస్థలంలో శ్రీ వత్సాన్ని, మెడలో కౌస్తుభాన్ని కలిగి ఉన్నాడు. పీతాంబరం ధరించి నీలమేఘశ్యాముడై ప్రకాశిస్తున్నాడు. పొడుగాటి కురులను కలిగినవాడై, వజ్ర వైడూర్యాలను పొదిగిన కిరీట కుండలాలతో మహాద్భుతంగా వెలుగొందుతున్నాడు. నడుముకు వడ్డానం, కరాలకు కంకణాది ఆభరణాలు అలంకరింపబడి, దేదీప్యమానంగా విరాజిల్లుతున్న ఆ బాలుడిని వసుదేవుడు దర్శించాడు’. హరేకృష్ణ ఉద్యమ సంస్థాపకాచార్యులైన శ్రీల ప్రభుపాదుల వారి ఈ భగవత్‌ వర్ణన అద్భుతం.

భగవంతుని అవతరణ, లీలలన్నీ దివ్యమని అర్థం చేసుకున్నవాడు ఈ లోకానికి తిరిగిరాడు. అటువంటి వారంతా తన దివ్యధామమైన గోలోక బృందావనం లేదా వైకుంఠధామాలను చేరతారని శ్రీకృష్ణుడే స్వయంగా మాటిస్తున్నాడు. మన నిజ నివాసమైన గోలోకం లేదా వైకుంఠధామాలకు తిరిగి వెళ్ళి శ్రీకృష్ణుని సాంగత్యంలో అంతులేని ఆనందానుభూతిని పొందుతూ, ప్రేమానురాగాలతో ఆ దేవదేవుడిని సేవించటమే నిజమైన మోక్షం. మానవజన్మకుగల ఏకైక లక్ష్యమూ ఇదే. ‘ముక్తి ప్రదాతా సర్వేషాం విష్ణురేవ న సంశయః’ (హరివంశం, భవిష్యపర్వం, అధ్యాయం 80). ఘంటకర్ణుడికి పరమశివుడు బోధించిన ఉపదేశం ఇది. కనుక, ‘ముక్తిని అనుగ్రహించగలిగింది విష్ణువొక్కడే’ అనడంలో ఎలాంటి సందేహం లేదు. హరే కృష్ణ!


శ్రీమాన్‌ సత్యగౌర

చంద్రదాస ప్రభూజీ

93969 56984


logo