గురువారం 24 సెప్టెంబర్ 2020
Devotional - Sep 10, 2020 , 00:04:23

గడ్డిపోచల గొప్పతనం!

గడ్డిపోచల గొప్పతనం!

‘లోకంలో అన్నిటికన్నా చులకనైంది, తేలికైంది, ఎందుకూ కొరగానిది’ అనే అర్థంలో ‘గడ్డిపోచ’ను ఉదహరిస్తుంటాం. నిజంగానే గడ్డిపోచ బరువులో తేలికైంది, సునాయాసంగా లభించేదే అయినా.. ఆలోచిస్తే దాని విలువ ఎంతో ఘనమైంది. ఒంటరిగా ఒక గడ్డిపోచ ఏమీ చేయలేకపోవచ్చు. కానీ, గడ్డిపోచలన్నీ కలిపితే ఏనుగునైనా బంధించగలవు. నేలపై సులభంగా మొలిచి, ఎదిగే గడ్డిపోచలను తిని పశువులు అమృత తుల్యమైన పాలను ఇస్తాయి కదా! అనంతా మాత్యుడు అనే కవి రచించిన ‘భోజ రాజీయం’ కావ్యంలో ‘అన్నిటికంటే చులకనైనవేవో’ ఎంతో చక్కగా చెప్పాడు. ‘తామర తూడు, గడ్డిపోచ, దూది, దుమ్మూ ధూళి.. ఒకదానికంటే ఒకటి చులకన. తల్లి లేని తనయుడినీ అందరూ చులకనగా చూస్తారు’ అని అంటాడు. చులకనగా చూడబడే వాటిలో గడ్డిపోచకూడా ఒకటి. కానీ, మన పురాణేతిహాసాలు, నీతిశాస్ర్తాలు గడ్డిపోచకు ఇచ్చిన విలువ ఎంతో ఘనం. ప్రవాహ వేగానికి తలవంచి నిలుచున్న గఱిక, వరద ఉధృతి తగ్గాక తలెత్తి నిలబడుతుంది. పెద్ద వృక్షాల్ని సైతం కూల్చగలిగే పెనుతుపాను చిన్న గడ్డిమొక్కను కదల్చలేదు. మనకన్నా బలవంతుని ముందు మన ప్రవర్తన ఎలా ఉండాలో గడ్డిపరక నీతిపాఠం చెప్తుంది. 

ప్రకృతి స్వరూపుడైన గణపతి ‘దూర్వాయుగ్మం సమర్పయామి’ అని రెండేసి లేత గరికలను సమర్పిస్తే చాలు పొంగిపోతాడు. శివపార్వతుల మరొక తనయుడు కుమారస్వామి పుట్టింది రెల్లు పొదలలోనే కదా! అందుకే, శరవణభవుడయ్యాడు. మూడడుగుల నేలను అడిగిన వామనునికి బలి చక్రవర్తి సమర్పిస్తున్న దానధారకు అడ్డుపడిన రాక్షసగురువు శుక్రాచార్యుని ఏకాక్షి (ఒంటి కన్ను)ని చేసింది కుశాగ్రమే కదా! ‘కుశ’ అంటే గడ్డిజాతిలో విశిష్ఠమైన ‘దర్భ’. వైదిక సంప్రదాయంలో దర్భది విశిష్ఠమైన స్థానం. యజ్ఞయాగాది కర్మలకు, నిత్య నైమిత్తిక కార్యక్రమాలకు, ముఖ్యంగా పితృకార్యాలకు దర్భను విధిగా వాడుతాం. కర్మకాండలలో దర్భలతో అల్లిన కూర్చకు, పవిత్రలకు, వివాహ తంతులో వధువు నడుముకు కట్టే యోక్త్రాని(దర్భ తాడు)కి విశేషమైన ప్రాధాన్యం ఉంటుంది. గ్రహణవేళ దర్భలను వస్తువులపై వేసి వాటి శుచిత్వాన్ని కాపాడటం తెలిసిందే. అర్చనలకూ, జపతపాలకూ యోగ్యమైంది దర్భాసనమే. గరుత్మంతుడు స్వర్గం నుంచి అమృత భాండాన్ని భూమిపైకి తెచ్చి జ్ఞాతులైన పాములకు ఇచ్చి, తన తల్లిని దాస్యబంధనాల నుంచి విముక్తురాలిని చేస్తాడు. ఆ అమృత భాండాన్ని దర్భపొదలలో దాచి, స్నానం చేసి రావడానికి వెళతాయి పాములు. ఈలోగా ఇంద్రుడు ఆ అమృత కలశాన్ని మాయోపాయంతో తిరిగి తీసుకెళతాడు. అమృతం దక్కక నాగులు నిరాశ పడతాయి. ‘అమృతం ఒలికిందేమో’ అనే ఆశతో అక్కడి దర్భలను నాకడం వల్ల వాటి అంచుల పదునుకు నాగుల నాలుకలు చీలిపోయి ‘ద్విజిహ్ను’(రెండుగా చీలడం)లవుతాయి.

‘శ్రీ మద్రామాయణం’లో వనవాసంలో చిత్రకూట పర్వతప్రాంతంలో నివసించే సమయంలో సీతమ్మ ఒడిలో నిదురిస్తున్నాడు రాముడు. అప్పుడు కాకాసురుడు సీతమ్మను పొడిచి రక్తం కారేలా బాధిస్తే శ్రీరాముడు ఉగ్రుడై ఒక గడ్డిపోచనే బ్రహ్మాస్త్రంగా మలచి సంధిస్తాడు. అది వెంటాడితే తట్టుకోలేని కాకాసురుడు శ్రీరామునికి శరణాగతుడౌతాడు. ఎక్కుపెట్టిన బాణం వృథా కాకూడదు కనుక కాకాసురుని ఒక కన్ను మాత్రం తొలగించి రక్షిస్తాడు శ్రీరాముడు. రాముని చేతిలో బ్రహ్మాస్త్రమైన గడ్డిపోచయే రావణుడు అశోకవనంలో సీతమ్మను వేధించే వేళ ఆమెకు రక్షణ కవచం అవుతుంది. ఒక్క గడ్డిపోచను అడ్డం పెట్టుకొని దుష్ట రావణుడిని సీతమ్మ ఎదిరించిన తీరు అద్భుతం. పర పురుషునితో సూటిగా మాట్లాడకుండా ఆమె గఱికను అడ్డంగా పెట్టుకొని బదులిచ్చింది. ఇలా, ఒక్క గడ్డిపోచతో పతివ్రతా శిరోమణి సీతమ్మ అనేక విధాలుగా రావణుని దర్పాన్ని హరించింది. తృణమో పణమో సమర్పించకుండా ఏ పనీ జరగని కాలం ఇది. కనుక, దేన్నీ చులకనగా చూడటం తగదు


logo