సోమవారం 28 సెప్టెంబర్ 2020
Devotional - Sep 08, 2020 , 00:11:01

భూతదయే మానవ ధర్మం!

భూతదయే మానవ ధర్మం!

పరీక్షిత్తు కుమారుడైన జనమేజయుడు ఒక మహాయజ్ఞం చేశాడు. అప్పుడు దేవతల శునకమైన ‘సరమ’కుమారుడు ‘సారమేయుడు’ ఆ యజ్ఞవాటికలో ఆడుకుంటూ ఉన్నాడు. అప్పుడు జనమేజయుని కుమారులు ఆ కుక్కపిల్లను కొట్టి తరిమేస్తారు. దాంతో సారమేయుడు ఏడుస్తూ తల్లితో జరిగింది చెప్తాడు. సరమ బాధపడి జనమేజయుడి దగ్గరకు వచ్చి ‘రాజా! యుక్తాయుక్త విచక్షణ లేకుండా మంచివారికి గాని, సాధువులకు గాని అపకారం చేస్తే అనుకోని ఆపదలు వచ్చి పడతాయి’ అని బుద్ధి చెప్పి వెళ్లింది. ‘మహాభారతం’ ఆదిపర్వంలో మానవధర్మం గురించి లోతైన అర్థాన్ని ఇచ్చే కథ ఇది. ‘మహా పస్థానిక పర్వం’లోనూ ధర్మరాజు, ‘తన వెంట వచ్చిన శునకానికి ఇవ్వని స్వర్గ ప్రవేశం తనకూ వద్దంటాడు’. ఇలా భారతీయ సనాతన ధర్మంలో ‘ప్రతి జీవికీ మానవుడు తనతో సమానమైన గౌరవం ఇవ్వాలని, చెట్టూ, చేమా, పామూ, పరిగా అన్నిటి పట్లా జీవ కారుణ్యం, ప్రేమ, ఓర్పు, సహనంతో మెలగాలని’ వేదకాలం నాటి బోధనలు చాలా స్పష్టంగా చెబుతున్నాయి. 

‘ఈశావాస్య మిదగ్‌ం సర్వమ్‌' అని యాజ్ఞవల్క్యుని బోధ ఇక్కడ గొప్ప సందర్భోచితం. ‘సమస్త చరాచర వస్తుజాలమంతా భగవంతునిగా పిలిచే ఆత్మతోనే పరివ్యాప్తమై ఉన్నది. కాబట్టి, త్యాగభావంతో ఈశ్వరమయమైన ఈ ప్రపంచాన్ని అనుభవించు. ఎవరి ధనాన్నీ ఆశించకు’ అన్నది దాని సారాంశం. నూరేండ్లు జీవించాలని కోరుకునే మానవుడు కర్మ అంటకుండా జీవించలేడు. ఆ కర్మ ఫలాలను మాత్రం మనసుకు అంటించుకోకూడదు. మోక్షస్థితిని ఎవరైతే కోరుకుంటారో వారు సర్వభూతాలను తమతో సమానంగానే చూడాలి, చూస్తారు కూడా. తమకూ, తోటి జీవికీ, ఆత్మకూ భేదం లేదని అలాంటి వారు మాత్రమే గ్రహిస్తారు. సర్వభూతాలలో ఆయా రూపాల్లో దర్శనం ఇస్తున్న ఆత్మను జ్ఞాని మాత్రమే దర్శించగలడు. కాబట్టి, ‘ఇతర జీవులను చూసి అసహ్య పడరాదు’ అని మానవాళికి దివ్యమైన జ్ఞానబోధ చేశాడు యాజ్ఞవల్క్యుడు. ఇది సమస్త మానవజాతికీ ఆచరణీయం. మనకు తెలిసినంత వరకూ విశ్వంలో భూమి మాత్రమే జీవిని కనగలిగింది. భూమి వేదికగా పంచభూతాలు కలవాల్సిన మోతాదులో కలవడం వల్లే ఈ లోకంలో జీవం ఉద్భవించింది. కొన్ని లక్షల సంవత్సరాలుగా ఒక్కో జీవినుండి మరో జీవి పరిణామ వైవిధ్యాలను పొందుతూ ఆవిర్భవిస్తున్న బృహత్‌ దృశ్యాన్ని మనం చూస్తున్నాం. అలా అన్నింటికీ ఆధారమై వెలుగొందుతున్న భూమి నాటి మన ఋషుల మార్గదర్శనంతో ఆరాధనా భావాన్ని అందుకొంటున్నది. 

ప్రతి జీవిలోని ధాతువులు, జీవ పదార్థాలు అన్నీ మౌలికంగా ఒకటే. అవన్నీ పంచభూతాల నుండే పుడుతున్నాయి. జీవి చర్మం, కండరాల పదార్థం, అలాగే మొక్క కాండం, కొమ్మల పదార్థం కర్బనమే. అన్ని జీవులలోని ఎముక ‘క్యాల్షియమ్‌' అనే మూలకం నుండే తయారైంది. ‘వాయురనిల మమృత మథేదం భస్మాన్తగ్‌ం శరీరం’ అన్నట్లుగా ప్రతి జీవీ చనిపోయిన తర్వాత చూర్ణాతి చూర్ణమై పంచభూతాలలో లయమైపోతుంది. ఈ విధంగా తరచి చూస్తే సూర్యుని మొదలుకొని మానవుని వరకూ అన్నింటా అంతర్లీనంగా నెలకొని, అన్ని రూపాలలో కనిపించేది ‘ఆత్మ’ ఒక్కటే. అందుకే, మన సనాతనం ‘ప్రతీ జీవికీ నీతో సమాన గౌరవం ఇవ్వమని’ ఆదేశిస్తున్నది. చరాచర జీవులన్నీ చల్లగా ఉంటేనే మానవ జీవితమూ నందన వనంలా వికసిస్తుంది. ఇదే కులమతాలకు అతీతమైన మానవ ధర్మం. అందరం దీనినే శిరసావహిద్దాం.

-రావుల నిరంజనాచారి


logo