ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Devotional - Sep 07, 2020 , 00:08:11

అనుగ్రహ సాధన మన చేతుల్లోనే!

అనుగ్రహ సాధన మన చేతుల్లోనే!

అనుగ్రహం అనేది ఒకప్పుడు ఉండి మరొకప్పుడు లేకపోవడం లాంటిది కాదు. నిజానికి అది ఎప్పుడూ మీ వెంటే ఉంటుంది. కాకపోతే, దానిని గ్రహించడానికి మిమ్మల్ని మీరు సుముఖులు చేసుకోవడమే తరువాయి. నేను దీనిగురించి ఏం చెప్పినా దానిని మీరు అపార్థమే చేసుకుంటారు. ఎందుకంటే, తార్కిక, భౌతిక పరిమితుల్లో లేనిదానిని వాస్తవానికి మాటల్లో చెప్పలేం. మీలో ప్రధానంగా రెండురకాల ‘ఆకాంక్షలు’ ఉంటాయి. ఒకటి: ‘ఆత్మసంరక్షణ’, రెండు: ‘వ్యాప్తి చెందడం’. మీలోని ‘ఆత్మ సంరక్షణ’ స్వభావం, మీ చుట్టూరా గోడలు కట్టుకుని మిమ్మల్ని రక్షించుకోమని చెబుతూ ఉంటుంది. ఇక, మీలోని మరో భాగమైన ‘వ్యాప్తి చెందడం’ అనేది ఎల్లప్పుడూ వ్యాప్తి చెందాలని (ఎదుగుదల) ఆకాంక్షిస్తూనే ఉంటుంది. నిజానికి ఈ రెండూ కూడా ఒక దానికి ఒకటి వ్యతిరేకమైన శక్తులు కూడా కావు. ఒక ఉదాహరణగా  చెప్పాలంటే వీటిని ‘గురుత్వాకర్షణ, అనుగ్రహం’తో పోల్చి చెప్పవచ్చు. ఐతే, ఇది కేవలం ఒక ఉపమానం మాత్రమే!

అనుగ్రహం, వ్యాప్తి చెందడం అనే ఈ రెండు లక్షణాలు మీ జీవితంలోని రెండు అంశాలకు చెందినవిగా మీరు తెలుసుకోండి. ‘అనుగ్రహ సాధన’కు ఏం చేయాలి?’ ఇది చాలా ప్రధానమైన ప్రశ్న. చాలామందికి తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటుంది. కానీ, దానికి తగిన ‘ఆచరణ తప్పనిసరి’ అని మరిచిపోకూడదు. ‘అనుగ్రహ సాధన’ వాస్తవానికి మన చేతుల్లోనే ఉందన్న విషయాన్ని ముందు మనం తెలుసుకొందాం. అందుకోసం ఏం చేయాలి? అంటే, ముందు మీరు ఈ అస్తిత్వానికి చెందిన భౌతికశక్తుల నుంచి విముక్తులు కావాలి. అప్పుడు మీ జీవితంలో ‘అనుగ్రహం’ దానంతటదే వెల్లివిరుస్తుంది. అంత సహజసిద్ధంగా అది లభిస్తుంది కూడా. ‘ఆత్మ సంరక్షణ’ అన్నది కేవలం శరీరానికి పరిమితమై ఉండాలి. మీ శరీరానికి మాత్రమే సంరక్షణ అవసరం. ఇది తెలుసుకోం డి. మిగతావన్నీ కూడా మనం ఎలా మార్చేసినా, ఎలా కూలదోసినా, మరుసటిరోజు అవసరమైతే వాటిని పునః నిర్మించుకోవచ్చు. కావాలనుకుంటే మీరు లేచిన తర్వాత ప్రతి రోజూ ఉదయాన్నే మీరొక ‘కొత్త వ్యక్తిత్వాన్ని’ నిర్మించుకోనూ వచ్చు.

‘ఆత్మ సంరక్షణ’ (గురుత్వాకర్షణ) అన్నది మిమ్మల్ని కిందికి లాగుతుంటుంది. ‘అనుగ్రహం’ (ఎదుగుదల) అన్నది మిమ్మల్ని పైకి లేవనెత్తాలని చూస్తుంటుంది. మీరు ఈ అస్థిత్వపు భౌతికశక్తుల నుంచి విముక్తులయ్యారనుకోండి, అప్పుడు మీ జీవితానికి ‘అనుగ్రహం’ సిద్ధిస్తుంది. నిజానికి ‘అనుగ్రహం’ అన్నది ఎక్కడి నుంచో వచ్చేది కాదు. మీరు మీ క్యాలెండరులో చూసినట్లు, అందులోని ఫొటోలో ఉన్నట్లుగానే.. ‘అనుగ్రహం అలా ఒక కాంతి పుంజంలోని కిరణాల్లాగా ఒక మనిషి వైపు రావడం, జాలు వారడం’ చూస్తారు. కానీ, నిజానికి ఇది అలాంటిది కాదు. గురుత్వాకర్షణ ఎప్పుడూ ఎలాగైతే మన చుట్టూ పనిచేస్తూనే ఉంటుందో, అనుగ్రహం కూడా ఎల్లవేళలా పనిచేస్తూనే ఉంటుంది. మిమ్మల్ని మీరు, అందుకు పాత్రులుగా చేసుకోవడమే తరువాయి. అంతే! అయితే, గురుత్వాకర్షణలో మీవైన సొంత ఇష్టాయిష్టాలు లేవు, ఉండవు. ఎలా అయినా సరే, మీరు దానికి పాత్రులే! కానీ, అనుగ్రహంతో అలా కాదు మరి. మీరు అందుకు సుముఖులుగా, అది గ్రహించేందుకు అనువుగా సిద్ధం కావాలి. కనుక, అది మీ చేతుల్లోనే ఉందన్న సంగతి ఇప్పుడు అర్థమైందనుకొంటాను. ఇంకెందుకు ఆలస్యం? ప్రయత్నించండి మరి. ప్రేమాశీస్సులతో..logo