సోమవారం 28 సెప్టెంబర్ 2020
Devotional - Sep 07, 2020 , 00:07:33

బతుకమ్మ పండుగ ఎప్పుడు?

బతుకమ్మ పండుగ ఎప్పుడు?

తీరొక్క పూల పండక్కి తిప్పలొచ్చి పడ్డాయ్‌! పెద్దలమాస సందెకాడ సద్దు చేసే బతుకమ్మ ఈసారి నెల్లాళ్లు ఆగమంటున్నది. శరత్కాలం చల్లగాలి మొదలవుతున్నా తెలంగాణలో పూలసందడికి వేళ కాలేదంటున్నది. అధికమాసం ఈసారి ఆశ్వీయుజం రావడంతో వచ్చిన ‘చిక్కు’ ఇది. బతుకమ్మ పండుగపై ఏర్పడిన ఈ సందిగ్ధాన్ని మన వేద పండితులు తొలగించారు. ‘ఈసారి బతుకమ్మ పండుగను ఎప్పుడు మొదలుపెట్టి, ఎలా కొనసాగించాలి?’ అన్న దానిపై వారు శాస్ర్తోక్త సమాచారం ఇచ్చారు.

  • నిజ మాసంలోనే బతుకమ్మ
  • బొడ్డెమ్మ వేడుక యథాతథం

మన తెలంగాణ సంస్కృతికి ప్రతీక అయిన బతుకమ్మ పండుగ ఆటపాటల సందడి ప్రతీ ఏటా ఇంతా అంతా కాదు. యావత్‌ రాష్ర్టానికే ఒక నిండుదనాన్ని తెస్తుంది. దసరా శరన్నవరాత్రుల వేళ ఆధ్యాత్మిక శోభ ఆలయాల్లో కనిపిస్తే, బంగారు బతుకమ్మల వైభవం ఊరూరా, ఇంటింటా నెలకొంటుంది. భాద్రపద మాసం బహుళ అమావాస్య (మహాలయ అమావాస్య) నుంచి ఆశ్వీయుజ మాసం శుద్ధ అష్టమి (దుర్గాష్టమి) వరకు రోజుకొక్క రూపు కట్టి, వినసొంపైన ఆటపాటలతో బతుకమ్మను కొలువడం ఆనవాయితీ. అయితే, ఈసారి ఆశ్వీయుజ మాసం అధికంగా రావడంతో బతుకమ్మ ఉత్సవాలు ఎప్పుడు, ఎలా జరపాలన్న దానిపై చాలామందిలో సందిగ్ధత నెలకొన్నది. 

అక్టోబర్‌లోనే బతుకమ్మ ఆటలు

ఈ ఏడాది ఆశ్వీయుజం అధికంగా వచ్చింది. అధికమాసంలో ఎలాంటి శుభకార్యాలూ చేయకూడదని సనాతన శాస్ర్తాలు ఘోషిస్తున్నాయి. కాకపోతే, ఆధ్యాత్మిక సాధనలకు ఎలాంటి అభ్యంతరమూ చెప్పలేదు. ‘అధికస్య అధికం ఫలం’ అన్నారు పెద్దలు. ఈ నెలలో జపాలు, పూజలు, దానాలు ఎంత ఎక్కువ చేస్తే అంత ఎక్కువ ఫలితం వస్తుందనీ చెప్తారు. కానీ, పండుగలు, శుభకార్యాలు చేయడంపై మాత్రం నిషేధం విధించారు. ఈ కారణంగానే అధికమాసంలో పెండ్లిండ్లు, గృహ ప్రవేశాలు లాంటి శుభకార్యాలు జరగవు. అంతేకాదు, అధికమాసంలో వచ్చే పండుగలనుకూడా ఆ తర్వాత వచ్చే నిజ మాసంలోనే చేసుకోవాలన్నది పెద్దల నిర్ణయం. శ్రాద్ధాది విధులను సైతం నిజ మాసంలోనే ఆచరించాలి. ఒక్కరోజు పండుగైతే నిజమాసంలో చేసుకునే వీలుంది. బతుకమ్మ పండుగ రెండు నెలలతో ముడిపడి ఉంది. అందుకే, పంచాంగ కర్తలు, వేద పండితులు దీనిపై ఇటీవల ఒక స్పష్టత నిచ్చారు. ‘బాధ్రపద బహుళ అమావాస్య (సెప్టెంబర్‌ 17)నుంచి కాకుండా అధిక ఆశ్వీయుజ బహుళ అమావాస్య (అక్టోబర్‌ 16) నుంచి (నిజ మాసంలోనే) బతుకమ్మ ఉత్సవాలు చేసుకోవాలని’ వారు సూచించారు. అయితే, కొన్ని ప్రాంతాలలో పెద్దల అమావాస్య రోజున ఎంగిలి పూల బతుకమ్మను పేర్చి, నెల తర్వాత నిజ ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి (అక్టోబర్‌ 17) నుంచి పండుగ కొనసాగించనున్నారు. 

బొడ్డెమ్మ వేడుక ఎప్పటిలానే!

బతుకమ్మ పండుగకు ముందు వచ్చే బొడ్డెమ్మ వేడుక మాత్రం యథావిథిగా భాద్రపదంలోనే జరుపుకోవచ్చునని వేద పండితులు తేల్చారు. బొడ్డెమ్మను గౌరమ్మగా భావించి వారం రోజుల పండుగ నిర్వహిస్తారు. ‘భాద్రపద బహుళ సప్తమి నుంచి అమావాస్య వరకు (సెప్టెంబర్‌ 9 -17) బొడ్డెమ్మ పండుగ చేసుకోవచ్చునని వారన్నారు. పుట్టమన్నుతో బొడ్డెమ్మలను చేసి, పూలతో అలంకరించి, వాటిని ఒక్కచోట పేర్చి చుట్టూ తిరుగుతూ, పాటలు పాడుతూ, రాబోయే బతుకమ్మ పండుగకు ముత్తయిదువలు శ్రీకారం చుడతారు. భాద్రపద బహుళ అమావాస్య నాడు బొడ్డెమ్మను సాగనంపి, మర్నాటి నుంచి ఎంగిలిపూల ఆటతో బతుకమ్మకు స్వాగతం పలుకుతారు. కానీ, ఈసారి ఎంగిలిపూల ఆటను నెలరోజులు వాయిదా వేసి, అధిక ఆశ్వీయుజ బహుళ అమావాస్య నుంచి మొదలుపెట్టాలన్నది వారి నిర్ణయం. 

విద్వత్సభ నిర్ణయం మేరకే!

“భాద్రపద బహుళ అమావాస్య నాడు బతుకమ్మను పేర్చితే, అధికమాసం కారణంగా ఉత్సవాన్ని కొనసాగించలేం. మళ్లీ నిజ ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి వరకు బతుకమ్మను పేర్చకుండా ఉండటం సరికాదు. అందుకే, పెద్దల అమావాస్య నాడు బతుకమ్మను పేర్చకుండా, అధిక ఆశ్వీయుజ బహుళ అమావాస్య (అక్టోబరు 16) నుంచి ‘ఎంగిలిపూల బతుకమ్మ’ను పేర్చాలని ఇటీవల జరిగిన వేద పండితులు, సిద్ధాంతులతో కూడిన ‘విద్వత్సభ’ నిర్ణయించింది. అనాటి నుంచి నిజ ఆశ్వీయుజ శుద్ధ అష్టమి (అక్టోబర్‌ 24: దుర్గాష్టమి) వరకు బతుకమ్మ ఉత్సవాలు కొనసాగించుకోవచ్చు” అని ప్రసిద్ధ పంచాంగకర్త యాయవరం చంద్రశేఖరశర్మ సిద్ధాంతి తెలియజేశారు.


logo