శనివారం 19 సెప్టెంబర్ 2020
Devotional - Sep 07, 2020 , 00:08:51

సర్వాద్భుత జననం!

సర్వాద్భుత జననం!

శ్రీకృష్ణుడు తన ఆంతరంగిక శక్తిద్వారా తన నిజ స్వయం రూపంలో అవతరిస్తాడేగాని, భౌతిక శక్తి ప్రేరేపణతో కాదు. సాధారణంగా, లోకంలోని ప్రతి జీవీ ప్రకృతి నియమానుసారంగా, ఈ భౌతిక జగత్తులో జన్మిస్తాడు. కానీ, శ్రీకృష్ణుని అలౌకికమైన, దివ్యమైన జననం భౌతికాతీతమైంది. అందుకే, స్వామి జననం సర్వాద్భుతం.

అజో పి సన్నవ్యయాత్మా భూతానామీశ్వరో పి సన్‌పకృతిం స్వామధిష్ఠాయ సంభవామ్యాత్మమాయయా॥‘నేను పుట్టుక లేని వాడినైనా, సమస్త ప్రాణులకు ప్రభువునైనా, నాశనం లేని వాడినైనా, ఈ లోకంలో నా ఆంతరంగిక దివ్య శక్తియైన యోగమాయతోఆవిర్భవిస్తాను’ (భ.గీ. 4.6). శ్రీకృష్ణుడు తనఆవిర్భావాన్ని గురించి ‘భగవద్గీత’లో స్వయంగా చెప్పిన మాటలివి. ‘అజః’ అంటే ‘జన్మంటూ లేనివాడని’ అర్థం. ఆయన జన్మంటూ లేనివాడైనా ఈ లోకంలో జన్మిస్తుంటాడు. పుట్టుకనే లేనివాడు దేవకీ పుత్రుడిగా పిలువబడ్డాడు! అయితే, ఇవి పరస్పర విరుద్ధమైనవి కావు.

శ్రీకృష్ణుని చేతిలోనే తనకు మరణం సంభవిస్తుందని అశరీర వాణిద్వారా తెలుసుకున్నాడు కంసుడు. శ్రీకృష్ణుని తల్లిదండ్రులైన దేవకీ వసుదేవులను కారాగారంలో బంధించాడు. ఆ విధంగా తాను మరణాన్ని జయించగలనని భావించాడు. అయితే, సర్వస్వతంత్రుడైన భగవంతుడు  తాను ఎక్కడ, ఎలా అవతరించాలన్నది మాత్రం తాను ఎలా సంకల్పిస్తే అలాగే జరుగుతుంది. సకల లోకాలను పాలించే దేవాదిదేవుడైన ఆ పరంధాముడు ఈ భువిపై అవతరించే శుభ ఘడియలు ఆసన్నమైన మరుక్షణం లోకమంతా ఆనందం, శాంతి నెలకొన్నాయి. ఆ సందర్భాన్ని ‘శ్రీమద్భాగవతం’ అద్భుతంగా వివరించింది. ‘పరమ మంగళకరమైన సకల గుణాలతో కూడిన ఉత్తమకాలంలో, బహ్మ పుట్టిన నక్షత్రంలో (రోహిణీ), సకల నక్షత్రాలూ, గ్రహాలూ శాంతంగా ఉన్న కాలంలో దిక్కులన్నీ ప్రసన్నమయ్యాయి. ఆకాశం రాత్రంతా నక్షత్రాలతో, పగలంతా మబ్బులతో కూడి వుంది. భూమండలమంతా శుభసూచకాలు కనిపించాయి. ప్రకృతిలో ఇంతటి శుభవాతావరణం సంతరించుకొన్న వేళ దేవదేవుడు దేవకీ హృదయంలో ఆవిర్భవించాడు. సకల జీవరాశుల హృదయాలలో అంతర్యామిగా వున్న పరమాత్మ, దేవరూపిణియైన దేవకిలోను గాఢాంధకార అర్థరాత్రి సమయంలో తూర్పుదిక్కున ఉదయించే చంద్రునివలె ఆవిర్భవించాడు’ అని ‘శ్రీమద్భాగవతం’ పేర్కొన్నది.

భగవంతుని అవతరణ సామాన్య బాలుని జన్మ వంటిది కాదు. ‘శ్రీకృష్ణుడు ఒక సాధారణ బాలుని వలె తన తల్లియైన దేవకీ గర్భంలో జీవించలేదని ప్రతి ఒక్కరూ గ్రహించాలి. అంతేగాక, ఒక సాధారణ బాలుని వలె తాను జన్మించక పోయినా, కంసుని వంటి అసురులను మోహింపజేసేందుకు ఆ విధంగా జన్మించినట్టు అగుపించాడు’ అని ‘హరేకృష్ణ ఉద్యమ’ సంస్థాపకాచార్యులైన శ్రీల ప్రభుపాదులవారు అంటారు. మరి, బాలుని రూపంలోవున్న భగవంతుడు ఏ విధంగా అగుపించాడు? ‘పంకజాల వంటి అద్భుత నేత్రాలతో ఆ బాలుడు చతుర్భుజ రూపుడై, శంఖ, చక్ర, గదా, పద్మధారుడై వున్నాడు. వక్షస్థలంలో శ్రీవత్సాన్ని, మెడలో కౌస్తుభాన్ని కలిగివున్నాడు. పీతాంబరం ధరించి నీలమేఘ శ్యాముడై ప్రకాశిస్తున్నాడు. పొడుగాటి కురులను కలిగిన వాడై, వజ్ర వైడూర్యాలను పొదిగిన కిరీట కుండలాలతో మహాద్భుతంగా వెలుగొందుతున్నాడు. నడుముకు వడ్డానం, కరాలకు కంకణాది ఆభరణాలతో దేదీప్యమానంగా వెలుగొందుతున్న ఆ పిల్లవాడిని వసుదేవుడు దర్శించాడు’ (శ్రీమద్భాగవతం 10.3.9-10).

‘బర్హావతాంస మసితాంబుధ సుందరాంగమ్‌' (బ్రహ్మసంహిత: 5.38). ఆ దేవదేవుని సుమనోహరమైన రూపం, వర్ణం నల్లటి మేఘాలను పోలివుంది. సాధారణ బాలుడెవ్వడూ చతుర్భుజాలతో జన్మించడం చరిత్రలో ఎన్నడూ జరుగలేదు. నిండైన కురులను కలిగిన బాలుడెక్కడైనా లోకంలో జన్మించాడా? లేదు. భగవంతుడు అవతరించిన తీరు సాధారణ బాలుని జననానికి పూర్తిగా భిన్నమైందని శ్రీల ప్రభుపాదులవారు వివరించారు. గౌడీయ వైష్ణవ సాంప్రదాయంలోని మకుటాయమానమైన ఆచార్యులలో ఒకరైన శ్రీల విశ్వనాథ చకవర్తి ఠాకూరుల వారు శ్రీకృష్ణుని తండియైన వసుదేవుడు తన పిల్లాడిని చూసి ఆశ్చర్యపోయిన వైనాన్ని ఎంతో గొప్పగా వివరించారు. దేవకీ వసుదేవులు బంధీలై వున్న కంసుని కారాగారంలో జన్మించిన బాలునిలో ఏ మాత్రం భయం తాలూకు ముఖకవలికలు కనిపించపోవటం మొట్టమొదటి ఆశ్చర్యం. 

రెండవది: సర్వమూ వ్యాపించి వున్న ఆ దేవాదిదేవుడు దేవకీ గర్భంలో పుత్రుడై జన్మించడం. మూడవ ఆశ్చర్యం: పుట్టిన పిల్లవాడు సర్వాలంకరణ భూషితుడై ఉండటం. నాల్గవది: వసుదేవుని ఆరాధ్య దైవమే తన పుత్రుడై జన్మించడం. 

దుష్ట శిక్షణ, శిష్ట రక్షణార్థం అవతరించిన శ్రీకృష్ణుడు అద్భుతమైన లీలలెన్నో గావించాడు. అనంతమైన తన వైభవాన్ని ప్రదర్శించాడు. మధురాతి మధురమైన తన వ్యక్తిత్వంతో జీవులను ఆకర్షించాడు. కురుక్షేత్ర సంగ్రామాన్ని రచించి భూమిపై దుష్టుల భారాన్ని తగ్గించాడు. సమస్త మానవాళికీ మార్గదర్శకమైన ‘భగవద్గీత’ను లోకానికి అందించాడు. ఇంకా ఎన్నో విధాలుగా సమస్త జీవులను అనుగ్రహించాడు. శ్రీపాద శంకరాచార్యులు ‘గీతా మహాత్మ్యం’లో ‘భగవద్గీత’ విశిష్ఠతను ఎంతో గొప్పగా వివరించారు.

ఏకం శాస్త్రం దేవకీ పుత గీతం ఏకోదేవో దేవకీ పుతయేవ

ఏకో మంతస్తస్య నామాని యాని,కర్మాప్యేకం తస్సదేవస్యసేవ

దేవకీపుత్రుని నోటినుంచి వెలువడిన గీత ఒక్కటే శాస్త్రం. దేవకీ పుత్రుడే ఏకైక దేవాదిదేవుడు. శ్రీకృష్ణుని మంత్రమే మహామంత్రం. శ్రీకృష్ణుని సేవించడమే ఉత్తమమైన కర్మ. దేవాదిదేవుడైన శ్రీకృష్ణుని ఈ శుభ తిరునక్షత్రాన గీతా సందేశాన్ని స్మరిస్తూ వేడుకగా ఉత్సవాన్ని నిర్వహించుకుందాం. భగవన్నామ సంకీర్తనలతోనే ఆ దేవదేవుడు మిక్కిలి ప్రసన్నుడవుతాడని శాస్త్రం వివరిస్తున్నది.

కలేర్దోషనిధే రాజన్నస్తి హ్యేకో మహాన్గుణః

కీర్తనాదేవ కృష్ణస్య ముక్తసఙ్గః పరం వజేత్‌

‘కలియుగం దోషసాగరమే అయినా దీనిలో ఇంకా ఉన్న ఒక మహాగుణమేమిటంటే, కేవలం హరే కృష్ణ మహా మంత్రాన్ని కీర్తించడంతోనే మనుషులు భవబంధ విముక్తులై పరంధామాన్ని చేరగలుగుతారు  (శ్రీమద్భాగవతము: 12.3.51). కాబట్టి, ప్రతి నిత్యం ‘హరే కృష్ణ’ మహామంత్రాన్ని జపిద్దాం. ఆనందంగా జీవిద్దాం.
logo