ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Devotional - Sep 07, 2020 , 00:09:23

శ్రీ కృష్ణార్పణమస్తు!

శ్రీ కృష్ణార్పణమస్తు!


‘యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్ధో ధనుర్ధ రహః!

తత్ర శ్రీ ర్విజయో భూతి:ర్రర్థువా నీతిర్మతిర్మమ!‘

‘రాజా! యోగీశ్వరుడైన శ్రీ కృష్ణుడు, ధనుర్ధారి అయిన అర్జునుడు ఎక్కడ ఉంటారో.. అక్కడ జయము, సిరిసంపదలు, శాశ్వతమైన నీతి నెలకొని ఉంటాయి.’ అని విదురుడు గీతలోని పరమార్థాన్ని ధృతరాష్ర్టుడికి వినిపిస్తాడు. శ్రీ మద్భగవద్గీత’లోని ప్రతీ శ్లోకం ఉదాత్తమైందే. రోజుకొక శ్లోకం మననం చేసుకుంటే, శ్రీ కృష్ణుని అనుగ్రహం పొందినట్టే. ‘అత్యంత భక్తి ప్రపత్తులతో నాకు ఏది అందించినా స్వీకరిస్తాను. ఆడంబర పటాటోపాలు నా దృష్టికి రావు. నిర్మలత్వం, చిత్తశుద్ధి, పవిత్రత, పారదర్శకత.. ఇవే నన్ను కట్టి పడేస్తాయి. నా నామస్మరణం ఒక్కటే ఈ లోకానికి హితకరం. పశుపక్ష్యాదులు నా పిల్లనగ్రోవి మాధుర్యానికి మైమరచి, నా చుట్టూ చేరి నన్ను పులకింపచేశాయి. నాకు అత్యంత నమ్మకస్తులు కావాలంటే అకుంఠిత చిత్తంతో నా పట్లనే దృష్టి నిలపండి’ అని శ్రీకృష్ణుడు ఉద్బోధించాడు. 

కురుక్షేత్రంలో కిరీటికూడా అదేలా శ్రీకృష్ణునిపైనే తన మనసును పరిపూర్ణంగా నిలిపాడు. ఆయన ముందు మోకాళ్లపై కూర్చొని, చేతులెత్తి తనను తాను సమర్పించుకొన్నాడు. ‘నీ దివ్య దర్శనంతో, నీ ఉద్బోధతో నాలోని మాయ తొలిగింది. నేను నీలోనే విశ్వాసం ఉంచి, నీపైనే మనసు నిలిపాను. నా సందేహాలన్నీ తీరాయి. ఇక, ఈ మహా సమరాన్ని సాగిస్తాను’ అని రథమెక్కి శత్రువులపై శరపరంపరను కురిపించాడు. ఆ విధంగా శ్రీకృష్ణుని గీతోపదేశం వల్ల విజయం పాండవుల పరమైంది. అందుకే, శ్రీ మహావిష్ణువు అవతారమైన శ్రీకృష్ణునికి ఏది సమర్పించినా నిశ్చలమైన భక్తి ఉండాలి. చివరలో ‘శ్రీ కృష్ణార్పణమస్తు’ అన్న ఒక్కమాట చాలు, అదంతా ఆయనకే చెందుతుంది. ఇదే సూత్రాన్ని పాండవులూ పాటించారు. 
logo