బుధవారం 23 సెప్టెంబర్ 2020
Devotional - Sep 07, 2020 , 00:02:59

నిరంతర ఆనందానికి

నిరంతర ఆనందానికి

‘ఆనందమానంద వనే వసంతం 

ఆనంద సంపూర్ణ మనోవిలాసం

ఆనంద రూపేణ సదాచరంతం 

రాధారవిందే సతతం వసంతం’

మోదం, సంతోషం, ప్రీతి, హర్షం, తృప్తి, సుఖం, ఆనందం మొదలైనవి సమానార్థకాలు. శరీరానికి, మనసుకు కూడా తృప్తి కలిగే స్థితి ఎప్పటికీ ఉండాలి. ఎప్పుడూ సంతోషంగా, సంతృప్తిగా మనసు, శరీరాలు ఉంటుంటే మనలోని శక్తి పెరుగుతూ ఉంటుంది. అందుకే, ఎప్పటికీ సంతోషంగా గడపాలి. ఆహారం, యోగద్వారా అన్నమయ కోశాన్ని మనం శుద్ధి చేసుకునే ప్రయత్నం చేస్తుంటాం. ప్రాణాయామంతో ప్రాణమయ కోశాన్ని శుద్ధి చేసుకుంటాం. కానీ, ఆలోచనలు నిరంతరం వస్తూ ఉండటం వల్ల లోపల మలినాలు చేరుతూనే ఉంటాయి. వీటిని తొలగించుకోవాలంటే మన చుట్టూ ఉండే పరిస్థితులపై దృష్టిని బాగా తగ్గించుకోవాలి. శరీరం, కుటుంబం, ఉద్యోగం, సమాజాలకు సంబంధించిన ఆలోచనలే మనలను ఇబ్బంది పెడుతుంటాయి. వాటిని గురించిన ఆలోచనలు పెరుగుతున్న కొద్దీ మనసు కలుషితమవుతుంది. ఇది అనారోగ్య కారకం. మనసు, శరీరాలు నిరంతరం ఆనందంగా ఉండాలంటే ‘ఆనంద గోవింద స్వరూపుని’ చింతన తప్పనిసరి. 

ఇంద్రియాలు సంతోషంగా ఉండటమే గోవింద శబ్దార్థం (గాం విందంతీతి గోవిందః). ఆ గోవిందుని నిరంతరం హృదయంలో నిలుపుకునే ప్రయత్నం చేసిన వారికి ఎటువంటి ఇబ్బందులూ ఉండవు. చిద్విలాసుడైన, సంతోష ప్రతిరూపుడైన, ఇంద్రియాలను అధిగమించిన వాడైన ఆ ఆనంద గోవిందుని నామస్మరణం రోజూ కనీసం ఒక గంటసేపు చేస్తుండటం ద్వారా మనమూ ఆనంద స్వరూపులమవుతాం. ఆనంద స్వరూపులు కావడం అంటే శారీరక, మానసిక తృప్తిని నిరంతరం అనుభవించడమే. అప్పుడు అన్ని కార్యాలనూ అవలీలగా నిర్వహించగలుగుతూ, విజయం సాధిస్తాం. అందుకే ‘అమందానంద కందళిత హృదయారవింద గోవింద’ అంటూ ఆ ఆనంద గోవిందుని నామ స్మరణ నిరంతరం చేద్దాం. ఎడతెగని సంతోషాన్ని, ధైర్యాన్ని, సంతృప్తినీ పొందుదాం.logo