శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Devotional - Sep 02, 2020 , 23:55:56

ఏకో దేవః సర్వ భూతేశు!

ఏకో దేవః సర్వ భూతేశు!

త్రయీ వేద్యం హృద్యం 

త్రిపురహర మాద్యం త్రినయనం

జటాభారోదారం చలదురగహారం మృగధరం

మహాదేవం దేవం మయి సదయభావం పశుపతిం

చిదాలంబం సాంబం శివ మతి విడంబం హృదిభజే!

- శివానందలహరి (3) 

‘నేను ధ్యానిస్తూ ఉన్నాను’ అంటాడు శంకరాచార్యులు. ‘ఎవరిని?’.. ‘వేదాలతో తెలుసుకొనదగిన వానిని, మనోహరుని, త్రిపురాలను హరించిన వానిని, ఆదిపురుషుని, ముక్కంటిని, జటాభారంతో గంభీరమైన వానిని, కదిలే సర్పాలను ఆభరణాలుగా కలవానిని, లేడిని ధరించిన వానిని, నా పట్లే దయ గలవాడైన పశుపతిని, జ్ఞానానికి ఆలంబనమైన వానిని, అమ్మతోకూడిన ఆనందమయుడు, విస్తారంగా ప్రకటింపబడిన వాడు అయిన శివుడిని’ మనసులో ధ్యానిస్తున్నాడు. ధ్యానించే సమయంలో భగవంతుడు మనపట్ల అనురక్తుడై తాపత్రయాలను తొలగిస్తున్నాడన్న భావనతో ధ్యానించాలి. మనమెలా భావిస్తే భగవంతుడలా స్పందిస్తాడు.

మహర్షులతో దర్శనీయమైన వేదంతో ప్రతిపాదితమైనవాడు లేదా తెలుసుకోదగిన వాడు, హృదయంలో చిత్‌జ్యోతిగా ప్రకాశిస్తూ, హృదయాన్ని తనవైపు లాక్కొనేవాడు, హృదయంతో మాత్రమే తెలియబడేవాడు. ‘త్రిపురహర పురం’ అంటే శరీరం. ‘స్థూల, సూక్ష్మ, కారణ’ శరీరాలు మూడు పురాలు. సత్వరజస్తమో గుణాలతో బంధితమై వుండటం వల్ల శరీరానికి ‘జాగ్రత్‌, స్వప్న, సుషుప్తి’ అనే మూడు అవస్థలు కలుగతాయి. శరీరాలను, అవస్థలను హరించిన వాడు శివుడు. అన్నింటికీ ఆద్యుడు. సృష్ట్యారంభంలో అంతటా వ్యాపించి ఉన్నది ఆదిశక్తి ఒక్కటే. అదే రెండుగా, అనేకంగా విభజితమైంది. అంతటా నిండిన చైతన్యమే అంతర్యామిగా వ్యాపించి ఉంటుంది. అదే శివుడు. అతడినే స్థాణువు (స్థిరంగా వుండేవాడు) అంటారు. అంతటా తానే ఉండటం వల్ల కదిలేందుకు స్థలం లేనివాడన్నమాట. మూడు కండ్లు కలవాడు, అవి మూడు లోకాలకు, కాలాలకు ప్రతీకలు. మూడు లోకాలు- స్వర్గం, భూమి, పాతాళం. స్వర్గం సత్వ గుణానికి, భూమి రజో గుణానికి, పాతాళం తమో గుణానికి ప్రతీకలు. ‘భూత, భవిష్యత్‌, వర్తమానాలు’ మూడు కాలాలు. అలాగే, ‘సూర్య, చంద్ర, అగ్నులు’ మూడు కండ్లుగా కలిగినవాడు. సూర్యుడు శక్తికేంద్రం. శరీరం పదార్థం. శక్తి పదార్థంతో ప్రకటితమవుతుంది. చంద్రుడు- మనసుకు, అగ్ని- మాటకు ప్రతీకలు. సూర్య చంద్రాగ్నులు త్రికరణాలకు ప్రతీకలు. ‘మనస్సు, వాక్కు, కర్మలు’ త్రికరణాలు. భౌతికమైన కండ్లు కాదు, అవి చూసే శక్తి. ‘జటా’ అంటే చీకటికి ప్రతీక. అదే మాయ. చీకటికి ఆవల వున్న వెలుగును సాధకుడు తెలుసుకోవాలి. జింకను ధరించినవాడు. జింక మనోచంచలతకు ప్రతీక. దానిని అదుపులో ఉంచుకున్న వాడని లేదా మనోనిగ్రహం కలిగిన వాడని అర్థం. 

‘దిత్‌' అనే ధాతువు నుంచి వచ్చిన దివ్యమైన శరీరం కలిగిన వారు దేవతలు. ఆ దేవతలూ దేవునిగా భావించేవాడు మహాదేవుడు. ‘ఏకోదేవః సర్వభూతేశు గూఢః’ అంటున్నాయి ఉపనిషత్తులు. సకల భూతలంలోనూ అంతర్యామిగా ఉన్నవాడు శివుడు. ప్రతి వస్తువులో చైతన్యం ఉంటుంది. అది కనిపించదు. వస్తువు కనిపిస్తుంది. ఎలాగైతే, పాలలో నేయి ఉంటుందో, అలా గూఢం (రహస్యం)గా ఉన్నవాడు. ‘అతనిని పట్టుకోవడం ఎలా?’. బుద్ధిని మథించడం ద్వారానే ఇది సాధ్యం. అంతర్ముఖులై చేసే సాధన చేయాలి. అజ్ఞానం లేదా కాలమనే పాశంతో బంధితమైన వారంతా పశువులే. వారికి పతి పశుపతి. అతడు కాలాతీతుడు. చిత్‌ (జ్ఞానం) ఎవరిని ఆలంబనగా చేసుకున్నదో అతడే శివుడు. ‘అమ్మతో కూడిన అయ్య’ సమగ్రతకు, సంపూర్ణతకు ప్రతీక. వారిరువురూ, పరస్పరాధారితులై సంపూర్ణత్వాన్ని పొందుతారు. శివమంటేనే ఆనందం. అతి విడంబం. ‘అలాంటి శివుడిని నేను ధ్యానిస్తున్నాను’ అన్నాడు ఆదిశంకరులు. ఆ పరమ శివుడు మనందరికీ సుప్రసన్నుడగుగాక!


logo