మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Devotional - Sep 02, 2020 , 00:52:02

దుర్జనులలో త్రిగుణాల ప్రకోపం!

దుర్జనులలో త్రిగుణాల ప్రకోపం!

దుర్జనులు సహజంగానే ‘శక్తి’ సంపన్నులుగా ఉంటారు. కనుక, వారి పెత్తనం కొంతకాలం నిరాటంకంగా కొనసాగుతుంది. కానీ, ఎప్పటికైనా దానికి పతనం తప్పదు. వారి ప్రతి అడుగులోను ‘అహం’ కనిపిస్తుంటుంది. ఇందుకు కారణం, వారిలో ‘త్రిగుణాలు’ ప్రకోపించడమే. ఆ మూడు గుణాలు ఏమిటంటే: అసూయ, ఆత్మ ప్రత్యయం, ఆధిపత్య ప్రదర్శన. ఇదే వారిలోని అసలైన అజ్ఞానం. 

ఇత్థ మారాధ్య మానోపి క్లిశ్నాతి భువన త్రయమ్‌ శామ్యేత్‌ ప్రత్యపకారేణ నోపకారేణ దుర్జనః॥

  -కుమార సంభవం 

తారకాసురుని సంహారం సందర్భంలోని ఈ శ్లోకంలో కాళిదాసు మహాకవి అన్ని కాలాలకు పనికి వచ్చే ఒక గొప్ప సత్యాన్ని చెప్పాడు. ‘ఓ బ్రహ్మదేవా! నీ వరం వల్ల తారకాసురుడు శక్తిగలవాడై ఎదురులేని ప్రాభవంతో ప్రకృతి మొత్తాన్ని శాసిస్తూ, సకల సౌఖ్యాలతో ఆనందాన్ని అనుభవిస్తూనే, రాక్షస స్వభావంతో దుర్జనుడై ముల్లోకాలను బాధలపాలు చేస్తున్నాడు. తారకుడు స్వభావంతోనే దుర్జనుడు. దుర్జనులు మంచిమాటలకు లొంగరు. వారికి తగిన విధంగా శిక్షను విధిస్తేనే వారు లొంగుతారు’ అన్నది దీని భావం. 

శత్రువులపట్ల ప్రవర్తించవలసిన పద్ధతులు నాలుగు రకాలని రాజనీతి చెబుతున్నది. అవి: సామ, దాన, భేద దండోపాయాలు. శాంతి వచనాలతో కూడింది సామం. ‘మహాభారతం’లో ధర్మరాజు మొదట ‘తమ రాజ్యం తమకు తిరిగి ఇమ్మని’ సామ వచనాలతోనే రాయబారం పంపించడం దీనికి ఉదాహరణ. దుర్జనుడైన దుర్యోధనుడు దానికి అంగీకరించడు. అప్పుడు పాండవులు రాజ్యంలో కొంత భాగం వదులుకోవడానికి అంగీకరిస్తూ, మిగిలిన ‘కొంతయినా తిరిగి ఇమ్మని’ అనడం దాన మార్గోపాయం. దుర్యోధనుడు దానికీ ఒప్పుకోలేదు. అప్పుడు భేదోపాయం ప్రయోగించారు. శ్రీకృష్ణుడు స్వయంగా రాయబారానికి వెళ్లి ‘సామ దాన’ మార్గాలలో రాజ్యాన్ని పాండవులకు ఇమ్మని కోరుతూనే, చాతుర్యంతో ‘భేదోపాయాన్నీ’ కొనసాగించాడు. ఫలితంగా కౌరవపక్షంలో పరస్పర విరుద్ధ భావజాల వ్యాప్తి జరిగింది. దుర్యోధనుని దుష్టబుద్ధి అందరికీ తెలియవచ్చింది. 

భీష్ముడు, ద్రోణుడు తదితరులు ధర్మం తప్పనివారు. కౌరవ పక్షాన్నే నిలిచి యుద్ధం చేసినా, వారి మనసులు మాత్రం ‘పాండవులే జయించవలెననే’ కృతనిశ్చయంతో ఉండటం దుర్యోధనుని పరాజయానికి తగిన మార్గాన్ని ఏర్పరిచింది. ‘భీష్ముడు రంగంలో వున్నంత వరకు తాను యుద్ధం చేయనని’ కర్ణుడు యుద్ధవిముఖుడు కావడం, శల్యుడు రథ సారథ్యం వహిస్తూనే కర్ణుని ఉత్సాహాన్ని తగ్గించే విధంగా మాట్లాడటం’.. వంటివన్నీ భేదోపాయంలోని తంత్రాలే. పద్దెనిమిది అక్షౌహినుల సైన్యం, భీష్మద్రోణకృపాశ్వత్థామలు, కర్ణశల్యాది మహావీరులు, స్వయంగా తాను కృషి చేసి సంపాదించుకొన్న గదాయుద్ధ నైపుణ్యం.. వంటివేవీ మహాభారత యుద్ధంలో దుర్యోధనునికి విజయం కలిగించలేదు. సపరివారంగా అతనికి సర్వనాశనం తప్పలేదు. ఇదంతా ధృతరాష్ర్టునికి తెలియదా? అంటే, తెలుసు. కానీ, దుష్టునికి శిక్ష పడితే తప్ప, పరిస్థితి సరైన మార్గంలోకి రాదు. కనుక, దుర్యోధనుని చావుతో కాని కథ సుఖాంతం కాలేదు. ఇలాంటివారే హిరణ్యకశిపుడు, నరకాసురుడు, జరాసంధుడు, కంసుడు మొదలైన వారందరూ అసుర సంపదతో విర్రవీగిన దుర్జనులు. అందరికీ చివరికి పట్టిన గతి మాత్రం పతనమే.  

పౌరాణికంగా, చారిత్రకంగా కూడా ఏ కథలో చూసినా చివరకు సన్మార్గానిదే విజయం. దీనికి కారణం, దుష్టులైనవారిలో వుండే అహంకారం. ‘అహంకారం’ అంటే, అసలైన అర్థం ‘అహం కర్తృత్వ’ భావన. ‘సదరు పనిని చేస్తున్నది నేనే. మరెవరికీ దీనిలో కర్తృత్వం లేదు’ అన్న అభిప్రాయం వారిది. తత్తం విచారిస్తే బోధపడే విషయం ఏమిటంటే, ‘కేవలం మన శక్తి మాత్రంతోనే కార్యం నెరవేరుతుందనుకోవడంలో ఔచిత్యం లేదని’ గుర్తించగలగాలి. చాణక్యనీతి ప్రకారం దుర్జనులు మంచిమాటలకు లొంగరు. వారిని ‘వారి మార్గం’లోనే కౌటిల్యాన్ని ప్రదర్శించి అణచివేయక తప్పదు.

అమరేశం రాజేశ్వరశర్మ

94407 84614


logo