మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Devotional - Aug 31, 2020 , 23:00:49

అంతశ్శత్రువులే అతి ప్రమాదకరం!

అంతశ్శత్రువులే అతి ప్రమాదకరం!

‘ఇంట గెలిచి రచ్చ గెలువాలి’ అన్నది లోకోక్తి. మనం ఇంట్లో అలవరచుకున్న క్రమశిక్షణే బయటివాళ్లను గెలువడానికి కూడా తోడ్పడుతుంది. ‘ఇల్లు’ అంటే ఇక్కడ ‘మానవుని మనసు’. మనలను రాత్రింబవళ్లు వెంటాడుతుండే అంతఃశ్శత్రువులు అరిషడ్వర్గాలు. ‘అరి’ అంటే ‘శత్రువు, ‘షడ్వర్గం’ అంటే ‘ఆరింటి సముదాయం’. ‘కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు’ అనేవి ఆ ఆరు శత్రువులు. ఇవి ఎప్పుడూ మన మనసు లోపలే ఉండి మనల్ని దారి తప్పించడానికి ప్రయత్నిస్తుంటాయి. అందుకే, వీటిని మన లోపల ఉండే ‘కనిపించని శత్రువులు’గా పిలుస్తాం. మానవుడు వీటిని జయించి, అణిచి వేయగలిగినపుడే బయటి శత్రువులను కూడా జయించగలుగుతాడు.

‘కామమంటే కోరిక’ (కామంబనునది కోర్కె. శాంతిపర్వం: 4-46). ఏ వస్తువునైతే కోరుకుంటామో అది దొరికేదాక మనల్ని ఇబ్బంది పెట్టి, ఆ వస్తువు చేతికి చిక్కగానే ఇది మాయమైపోతుంది. ‘క్రోధం’ అంటే ‘కోపం’. తనకు నచ్చని పనిని ఇతరులెవరు చేసినా క్షణంలో ఇది పుడుతుంది. అలాంటి వాళ్లను సహనంతో క్షమించినపుడు అది అదుపులోకి వస్తుంది. ‘లోభం’ అంటే ‘పిసినారితనం’ లేదా ‘అత్యాశ’. ధనం, ధాన్యం అనేవన్నీ క్షణికమైనవనే భావన లేకపోవడం వల్ల ఇది పుడుతుంది. వాటిని పొందినప్పుడు తొలగిపోతుంది. ఆకలి వేసిన వ్యక్తి బాధతో (విషముష్టి) ‘ముసిడిచెట్టు ధాన్యాన్ని ఎంత మొత్తంలో తిన్నా లావు కానట్లే’, అబద్ధాలు చెబుతూ లోభాన్ని ప్రదర్శించినంత మాత్రాన సంపదలు దరిచే రవు, ఒకవేళ చేరినా నిలువవు. సంతృప్తి లేని పేరాశ అనేది చివరికి దుఃఖాన్నే మిగుల్చుతుంది. ‘మోహ’మంటే ‘లౌకిక సంపదలపైన ప్రేమ’. ఇదీ మన అజ్ఞానంతోనే పుడుతుంది. తన రోగాన్ని కుదుర్చుకోవడానికి ఔషధాన్ని ఆశ్రయించినట్టుగానే, ఈ మోహాన్ని జయించాలంటే నిజాయితీగా, మనస్సులో కల్మషం లేకుండా పారదర్శకంగా ఉంటూ, ఇంద్రియ నిగ్రహాన్ని పాటించాలి. 

అంతవరకు చేసు కున్న మహా తపస్సు ఫలితాన్నంతటినీ కూడా ఒక్క క్షణంలో పోగొట్టే ‘మదం’ అంటే ‘గర్వం’. ఇది గొప్ప కులంలో పుట్టడం వల్లనో, గొప్పగా విద్యావంతుడు కావడం వల్లనో, లెక్కలేనంత ధనాన్ని కలిగి ఉండటం వల్లనో జనిస్తుంది. మనిషి విధిగా ఇలాంటివాటికి అతీతంగా ఆలోచించగలగాలి. అప్పుడు, ‘తనను మిం చినవాళ్లు ఎందరో ఉన్నారని’ తెలిసివచ్చి, గర్వం కాస్తా అంతరించి పోతుంది. సాత్త్విక స్వభావం లేనివాళ్లకు ‘మాత్సర్యం’ (విర్రవీగే గుణం) అబ్బుతుంది. దీనివల్ల ఇతరులపై ఈర్ష్య, అసూయ, ద్వేషాలతో కూడిన శత్రుభావం పెరిగిపోతుంది. ఫలితంగా అది హింసకు సైతం దారి తీయవచ్చు. ప్రమాదకరమైన ఈ అంతఃశత్రువును అణిచివేయాలంటే ఉత్తములైన గురువులనూ, సాధువులనూ ఆశ్రయించాలి. వాళ్ల బోధనల వల్ల జ్ఞానోదయమవుతుంది. అప్పుడు మాత్రమే అలా పుట్టిన ఈ మాత్సర్యం నశించిపోతుంది. మన మనసుల్లో పుట్టే ఈ అంతర శత్రువుల న్నీ ఆధ్యాత్మిక పురోగతికి అత్యంత ప్రమాదకరం. వీటన్నింటినీ విజయవంతంగా అధిగమించి, ధర్మబద్ధంగా జీవించగలిగినవారే లోకంలో ఆదర్శవంతులు కాగలరు. 

 డాక్టర్‌ శాస్ర్తుల రఘుపతి

94937 10552


logo