శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Devotional - Aug 31, 2020 , 01:12:14

అనంత పద్మనాభ వ్రతం

అనంత పద్మనాభ వ్రతం

  • సకల పాపహరం ‘మోక్షకారణ సామగ్య్రాం 

భక్తిరేవ గరీయసీ’. 

కలియుగంలో భక్తియే 

మానవులకు ప్రధానమైందని శంకర భగవత్పాదుల వారు తన 

‘వివేక చూడామణి’లో పేర్కొన్నారు. 

‘అనంతానంత దేవేశ అనంత ఫలదాయక

అనంత దుఃఖనాశాయ అనంతాయ నమోనమః’

‘మన పూర్వీకులు ఏ మార్గమైతే అనుసరించారో అదే మనకూ అనుసరణీయం. ‘మహాజనః యేనగతః సపంథాః’ అన్నది పెద్దలవాక్కు. ఈమేరకు భక్తి మార్గంలోనే భగవంతుని అనుగ్రహాన్ని పొందవలసి ఉంటుంది. అందుకు ఉత్తమమైన మార్గాలలో ఒకటి అనంత పద్మనాభ స్వామి వ్రతం.

‘అనంత వ్రతమస్త్యేకం అథావశ్య మనుత్తమం, సర్వపాపహరం నౄణాం స్త్రీణాంచైవ యుధిష్ఠిర’ అని వనవాసంలో వున్న పాండవులకు వారి కష్టాలు తీర్చడానికి ఈ వ్రతాన్నే ఉపదేశించాడు. శ్రీకృష్ణుడు. భాద్రపద శుక్ల చతుర్దశి నాడు దీనిని ఆచరిస్తాం. దీనితో సమస్త పాపాలు తొలగిపోయి, సుఖసంతోషాలు, సంపదలు కలుగుతాయని, దీనిని మించిన వ్రతం మరొకటి లేదని శ్రీకృష్ణుడు ఉద్ఘాటించాడు. ‘తేనానంత వ్రతేనా స్యబభౌగో ధనసంకులం గృహాశ్రమం శ్రియాజుష్టం ధనధాన్య సమన్వితం తస్యానుష్ఠాన మాత్రేణ సర్వం పాపం వ్యపోహతి’ అన్నది ఆయన బోధన. ఈ వ్రతంతో జ్ఞానం, తద్వారా ముక్తి లభిస్తుందని శాస్ర్తాలు చెబుతున్నాయి.

‘సాధూనాం పాలనాయచ’. రాక్షస సంహారానికై, సత్పురుషుల రక్షణకై అనేక అవతారాలను పొంది, సగుణ సాకార స్వరూపుడిగా తనను తాను ప్రకటించుకున్నా, వస్తుతః నిర్గుణ నిరాకార నిత్యశుద్ధ బుద్ధముక్త స్వభావమే అనంతుని తత్త్వం. ‘సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ’ అన్నది ‘తైత్తిరీయోపనిషత్తు’. శ్రీ శంకర భగవత్పాదుల వారు, ‘తత్ర త్రివిధంహి ఆనంత్యం, దేశతః కాలతో వస్తుత శ్చేతి’ అన్నారు. అనంత శబ్దానికి దేశకాల వస్తు అభేదం సిద్ధించింది. ఈ దృష్ట్యా సచ్చిదానంద స్వరూపమే శ్రీఅనంత పద్మనాభుని తత్త్వంగానూ అర్థం చేసుకోవాలి. 

శీలా కౌండిన్యుల కథ:

ఈ అనంత వ్రతం చాలా సుప్రసిద్ధం. తెలంగాణ ప్రాంతంలో చాలామంది దీనిని ప్రతీ సంవత్సరం విధిగా ఆచరిస్తారు. ధర్మరాజు కృష్ణుడిని ఈ వ్రత విశేషాలను అడిగినప్పుడు, ‘శీలా కౌండిన్యుల’ కథ చెప్పాడు. ‘దీక్ష- సుమంతుడు’ అనే దంపతులకు జన్మించిన అమ్మాయి శీల. ఈమె పుట్టిన కొద్దిరోజులకే తల్లి అనారోగ్యంతో మరణించింది. సుమంతుడు ‘దుశ్శీల’ను పునర్వివాహం చేసుకున్నాడు. ఈ సవతి తల్లిది కర్కశబుద్ధి. శీలను నానా రకాలుగా బాధించింది. శీల చక్కని నడవడికతో అందరిలో మంచిపేరు తెచ్చుకొన్నది. 

శీలకు యుక్తవయసు రాగానే కౌండిన్యునికి ఇచ్చి వివాహం చేశారు. కూతురును, అల్లుడితో సాగనంపే వేళ కొంత ధనం ఇవ్వడానికీ దుశ్శీల తిరస్కరించింది. దాంతో సుమంతుడు ఇంట్లోని పేలపిండిని మాత్రం ఇస్తాడు. శీలా కౌండిన్యులు బయలుదేరి మధ్యాహ్నానికి యమునా నదీతీరానికి చేర్తారు. అక్కడ కొద్దిమంది స్త్రీలు ఎర్రని వస్ర్తాలు ధరించి ‘ఏదో వ్రతం’ చేసుకోవడం ఆమెకంట పడుతుంది. అదే అనంతుని వ్రతం! ‘ఈ నోము ఫలం అనంతం. ఎంతటి సమస్యలు ఉత్పన్నమైనా ఆ దేవదేవుని అనుగ్రహంతో తొలగిపోతాయి’ అని శీల తెలుసుకొంటుంది. తక్షణమే ఆమె అదే నదీతీరంలో తన దగ్గర ఉన్న వస్తు సామగ్రితోనే లోపం రాకుండా ‘అనంత పద్మనాభ స్వామి’ వ్రతం చేస్తుంది. దాంతో ఆ స్వామి శీలను అనుగ్రహిస్తాడు. ఆ దంపతులు ఇంటికి చేరేసరికి ‘ధనధాన్యాల సంపదలు’ సమకూరాయి.

కష్టాలు తొలగించే కంకణం:

స్వర్ణాభరణాలు ధరించిన శీల ఎడమ చేతికి అనంతుడి తోరం కనపడగా కౌండిన్యుడు, ‘నువు ధరించిన ఆ దారం ఏమిటి? నన్ను నీ వశం చేసుకోవడానికి ఏదైనా ప్రయత్నిస్తున్నావా?’ అని అనుమానిస్తాడు. ‘ఈ రోజు మనం అనుభవిస్తున్న ఈ సంపదలకు కారణమైన ఆ అనంతుని తోరమే ఇది’ అని చెప్పింది. అతను ఐశ్వర్యమదంతో ఆ తోరాన్ని త్రెంచి అగ్నిలో పడేస్తాడు. ‘అత్యుత్కటైః పుణ్యపాపైః ఇహైవ ఫలముపభుజ్యతే’. పాప తీవ్రతవల్ల తక్షణమే సర్వసంపదలు నాశనమై, బంధువర్గం దూరమై, భయంకరమైన దుఃఖాలు, కష్టాలు కలుగుతాయి. కష్టాలు వచ్చినప్పుడే మనిషి బుద్ధి సరైన మార్గంలోకి వస్తుంది. అప్పుడు పశ్చాత్తాపంతో కౌండిన్యుడు భార్య శీలద్వారా అసలు సంగతి గ్రహిస్తాడు.

స్వామి దర్శనం:

‘తాను చేసిన పాపమే తన ఈ దుస్థితికి కారణమని’ గ్రహించిన కౌండిన్యుడు తపస్సు చేసి స్వామి అనుగ్రహం పొందాలని అడవికి బయలుదేరుతాడు. ఆశ్చర్యం! ఒకచోట ఒక వృక్షం ఫలాలతో నిండి ఉన్నా పక్షులు ఏవీ దానిపై వాలడం లేదు. మరొకచోట పచ్చికపై గడ్డి మేయకుండా ఉన్న వృషభం. ఇంకొకచోట అటు ఇటు పరిగెడుతున్న ఆవుదూడలు. వేరొకచోట కలువలతో నిండిన కొలనులు. అక్కడే ఒక ఏనుగు. ‘మీరు ఎవరైనా నా అనంతుని చూశారా? ఆయన గురించి మీకు తెలుసా?’ అని అన్నింటినీ ప్రశ్నిస్తాడు. ‘మాకు తెలియదనే’ చెప్తాయవి. 

నిరాశా నిస్పృహలతో అలసిపోయిన కౌండిన్యుడు ఒకచోట సొమ్మసిల్లి పడిపోతాడు. కొద్దిసేపటి తర్వాత మూర్ఛనుండి తేరుకుని ‘అనంతా, అనంతా!’ అని స్మరిస్తాడు. అప్పుడు ఆర్తత్రాణ పరాయణుడు, శరణాగత రక్షకుడైన ఆ అనంతుడు ఒక వృద్ధ బ్రాహ్మణ వేషంలో కౌండిన్యుని వద్దకు వస్తాడు. అతని చేయి పట్టుకొని ఒక పర్వత గుహలోకి తీసుకెళతాడు. అక్కడ శంఖచక్ర గదాగరుడ శోభితుడై మహోన్నతంగా ప్రకాశిస్తున్న దివ్యమంగళ స్వరూపాన్ని కౌండిన్యుడు దర్శిస్తాడు. 

వేళా విశేషం

మన మహర్షులు మానవుని శ్రేయస్సుని దృష్టిలో ఉంచుకొని, కోర్కెలను నెరవేర్చే లక్ష్యంతో యజ్ఞయాగాది క్రతువులను, వాటితోపాటు పలు దేవతా వ్రతాలనూ ఉపదేశించారు. వాటిలో అత్యంత ప్రసిద్ధం, ప్రధానం, శ్రేయోదాయకం ‘అనంత పద్మనాభస్వామి వ్రతం’. ఈ నోము విశేషాలు ‘భవిష్యోత్తర పురాణం’లో ఉన్నాయి. సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడే అనంత పద్మనాభ స్వామిగా భక్తుల హృదయాలలో స్థిరనివాసం ఏర్పరచుకొన్నాడు.

ఆత్మజ్ఞాన సిద్ధి


చదువు వచ్చినా ఆ జ్ఞానాన్ని ఎవరికీ పంచని బ్రాహ్మణుడు వృక్షంగా, విత్తనాలు హరించిన భూమియే ఆవుగా, ధనం గ్రహించి ధర్మం బోధించిన బ్రాహ్మణుడు ఎద్దుగా, మాటలతోనే ధర్మాధర్మాలను ప్రసంగించే అక్కాచెల్లెళ్లు కొలనులుగా, ఏనుగు మదముగా, వృద్ధ బ్రాహ్మణుడిని నన్నుగా భావించమని కౌండిన్య మహర్షికి ఉపదేశిస్తాడు అనంతుడు. ఈ గుహయే సంసారంగా భావించమనీ చెప్తాడు. 

సుఖ సంతోషాలతో జీవించడానికి అనువైన మార్గం బోధించమని కోరతాడు కౌండిన్యుడు. దానికి స్వామి, ‘మహరీ!్ష నువు 14 సంవత్సరాలు నియమ నిష్ఠలతో, భక్తిశ్రద్ధలతో నా వ్రతాన్ని ఆచరించగలవు. వ్రతానంతరం బ్రహ్మచారిని, సువాసినిని అర్చించి నా స్వరూపమైన  తోరాన్ని ధరించండి. ఇలా పద్నాలుగేండ్లు ఈ వ్రతం చేస్తే ఈ లోకంలో సర్వ సౌఖ్యాలను పొంది, చివరగా అనిర్వచనీయమైన ఆనందాన్నిచ్చే ఆత్మజ్ఞానాన్ని పొందగలవు’ అని బోధిస్తాడు. ఈ వ్రతాన్ని ఆచరించిన వాళ్లతోపాటు కథను విన్నవాళ్లకూ విశేష పుణ్యఫలం సిద్ధిస్తుందని ఆ భగవానుడే పేర్కొన్నట్టు తెలుస్తున్నది. logo