మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Devotional - Aug 31, 2020 , 01:11:54

పితృ దేవతలారా.. దీవించండి!

పితృ దేవతలారా.. దీవించండి!

‘భస్మీభూతమైన శరీరం తిరిగి ఎలా వస్తుంది?’ వ్యక్తి బతికి ఉన్నప్పుడు వారికి పెట్టిన భోజనం ఉపయోగమవుతుంది. కానీ, మరణించిన వారికి పిండాలు పెడితే వారికెలా చేరుతాయి? ఇవి కొందరి సందేహాలు. శ్రాద్ధాదులు ఆచరించే మరి కొందరిలోనూ ఈ తరహా అనుమానాలుంటాయి. కానీ, ఎన్నో శాస్త్రీయ ఆధారాలు పునర్జన్మను నిరూపించగా, హైందవ విశ్వాసానికి మూలమైన వేదం శ్రాద్ధాదులను నిర్ధారించింది కూడా. కాబట్టి, వాటిని శ్రద్ధతో ఆచరించాల్సిందే. 

‘శ్రద్ధయా క్రియతే అనేన ఇతి శ్రాద్ధః’. పెట్టేవారి శ్రద్ధ, సంకల్పబలం, మంత్రశక్తి వల్ల మనం అర్పించే తర్పణ, పిండాదులు సూర్యుని ద్వారా చేరవలసిన వారికి తప్పక చేరుతాయని శాస్ర్తాలు చెపుతున్నాయి. పునర్జన్మ ఉన్నదంటున్నాం. ఒకవేళ వారు ఇప్పటికే మరొక జన్మ ఎత్తినా, వారికి శ్రాధ్ధాలు నిర్వహించవలసిందే. అలాగే, గయాదులలో శ్రాద్ధాదులు ఆచరించినా, మనం జీవించినంత కాలం పితృదేవతలకు శ్రాద్ధాదులు ఆచరించాల్సిందే. తల్లిదండ్రులు దేవలోకంలో ఉంటే మనం ఇచ్చే పిండరూపంలోని భోజనం వారికి అమృతరూపంలో చేరుతుంది. వారు నాగరూపంలో ఉంటే వాయురూపంలో వారిని చేరుతుంది. దనుజ (దానవులు) రూపంలో ఉంటే మాంసం రూపంలో చేరుతుంది. అలాగే, వారు రాక్షస రూపం (హింసా ప్రవృత్తి గలవారు)లో ఉంటే రక్తం రూపంలో వారిని చేరుతుందని అంటున్నది శాస్త్రం. 

భద్రమైన పదాన్ని (స్థానం) ఇచ్చేది భాద్రపదం. ఈ మాసంలో సూర్యుడు కన్యారాశిలోకి ప్రవేశించే పక్షాన్ని ‘మహాలయ పక్షం’ అంటారు. ఒకవేళ కన్యారాశిలోకి సూర్యుడు ప్రవేశించక పోయినా పితృదేవతలందరూ భాద్రపద మాస కృష్ణపక్షాన్ని ఆశ్రయించుకొని ఉంటారు. కాబట్టి, పౌర్ణమినుండి అమావాస్య వరకు ‘పితృపక్షం’గా పాటిస్తారు. ‘పితౄణాం మహస్య ఉత్సవస్య ఆలయో మహాలయ’. వసు, రుద్ర, ఆదిత్య రూపాలలో పితృదేవతలను ఉద్దేశించి ఉత్సవాలుగా నిర్వహించే శ్రాద్ధాదులకు ఇది యోగ్యమైన కాలం. 

కనుకే, దీనిని ‘మహాలయం’ అన్నారు. భాద్రపద పౌర్ణమి నుండి అమావాస్య వరకు నిత్యం తర్పణాలు, శ్రాద్ధాదులు నిర్వహించే కాలం ‘పక్ష మహాలయం’. అయితే, అలాకాక పక్షం రోజులలో ఏ దినంలోనైనా శ్రాద్ధాదులను ఆచరించడం ‘సకృన్మహాలయం’ అంటారు. ఇదేదైనా, పితృదేవతలు ఊర్ధ్వలోకాలకు వెళ్ళేందుకు ఆచరించే ప్రక్రియయే. ఈ పితృపక్షంలో తల్లి/తండ్రి తిథినాడు శ్రాద్ధం నిర్వహించి భోజనాలు పెట్టాలి. వారి తిథులు జ్ఞాపకం లేకపోయినా, కుదరకపోయినా అమావాస్యనాడు ఆచరించాలని శాస్త్రం అంటున్నది. ఇదీ కుదరకపోతే, కనీసం బియ్యం, పెసరపప్పు, కూరగాయలు వంటివైనా దానం ఇవ్వడం ఆచారం.

‘పితృ’ అంటేనే ‘తల్లి లేదా తండ్రి’ అని అర్థం. ‘దేవ పితృ కార్యాభ్యాం నప్రమదితవ్యం’. ‘దేవపితృ కార్యాలలో అప్రమత్తుడవై ఉండాలని’ అంటున్నది ‘తైత్తిరీయోపనిషత్తు’లోని శిక్షావల్లి. తల్లిదండ్రులకు నిర్వహించే ఉత్తరక్రియలన్నీ యజ్ఞాలే. ‘యజ్ఞం’ అంటే ధర్మం, దైవం, పర హితం కోసం ఆచరించే కర్మలు. దేవయజ్ఞం, భూతయజ్ఞం, పితృయజ్ఞం, బ్రహ్మయజ్ఞం, మనుష్య యజ్ఞం- ఈ ఐదు యజ్ఞాలు మానవులకు కర్తవ్యాలుగా నిర్దేశితమైనాయి. జ్ఞానార్జన బ్రహ్మయజ్ఞంగా, దేవతలను సంతృప్తి పరచడానికై ‘స్వాహా‘ పూర్వకంగా సమర్పించే హవనాదులు దేవయజ్ఞంగా, పితృదేవతల తృప్తికై ‘స్వధా‘ పూర్వకంగా ఆచరించే శ్రాద్ధాదులు, అన్నదానాలు పితృయజ్ఞంగా, జీవరాశులకు పెట్టే ఆహారం భూతయజ్ఞంగా, అతిథి అభ్యాగతులకు సమర్పించే భోజనాదులు మనుష్య యజ్ఞంగా పరిగణిస్తాం.  

తల్లిదండ్రులను, గురువులను, వంశకర్తలను, ఆశ్రితులను, ఆశ్రయమిచ్చిన వారిని, అనాథలను గుర్తించి, వారికి తిలోదకాలను ఇవ్వడం పుణ్యకార్యంగా భావించాలి. ‘మరణాంతాని వైరాణి’ అంటాడు రాముడు. బంధువుల మధ్య వైరభావన ఉన్నా వారికి తర్పణాదులు విడవవలసిందే. పితృదేవతలను స్మరించి వారికి కృతజ్ఞతలు తెలుపుకునే ఉత్సవమిది. ‘కృత’ అంటే, చేసిన మేలు, ‘జ్ఞ’ అంటే, జ్ఞాపకం, ‘త’ అనగా విధానం. అంటే, ‘చేసిన మంచిని గుర్తించి జ్ఞాపకం చేసుకునే పద్ధతే’ ఇలా కృతజ్ఞతలు తెలుపడం. ‘వారిని ఎందుకు స్మరించాలి?’ అంటే, ‘అనాదిగా వారిచ్చిన అనుభవ జ్ఞానాన్ని స్వీకరించినందుకు’! కృతజ్ఞతలు తెలుపకపోవడం కృతఘ్నత. చనిపోయిన వారిని ‘ప్రేత’ అంటారు. సపిండీకరణ తదుపరి వారు పితృదేవతలుగా పితృలోకానికి చేరుకుంటారు. పితృలోకాలు ఎక్కడ ఉంటాయి? ‘తైత్తరీయ బ్రాహ్మణం’ భూలోకం పైన అంతరిక్షం, ఆ పైన పితృలోకం ఉంటుందని చెపుతున్నది. ‘అథర్వ వేదం’ ఆకాశంలో మూడు కక్ష్యలు ఉంటాయని, మొదటి కక్ష్య జలమయమైంది, రెండవ కక్ష్య పరమాణు రూపమైంది, మూడవ కక్ష్య తేజోమయమైందని, అక్కడే పితరులు ఉంటారని’ పేర్కొన్నది. 

విశ్వాసం అన్నిటికీ మూలం. యద్భావం తద్భవతి. విశ్వసించండి, భావన చేయండి, ఆచరించండి, ప్రయోజనం పొందండి! ఎక్కడో మన పిల్లలు ఉంటారు. వారు ఆనందంగా ఉన్నారనే భావన మనలను సంతోషంగా ఉంచుతుంది. వారు అనారోగ్యంగా ఉన్నారనే వార్త మనకు దుఃఖాన్ని కలిగిస్తుంది. నిజానికి ఆ భావనే మన సంతోషానికి లేదా దుఃఖానికి మూలం కదా. ఈ కార్యక్రమాన్ని సముద్రతీరంలో, నదీతీరంలో లేదా ఇంట్లోనైనా నిర్వహించాలి. కార్యక్రమ నిర్వహణలో కనీసం నలుగురు బ్రాహ్మణులను అర్చించాలి. వీరినే ‘సంకర్షణ, అనిరుద్ధ, ప్రద్యుమ్న, వాసుదేవ’ అంటారు. వీరిపై పితృదేవతలను ఆవాహనం చేసి అర్చించి, భోజన తాంబూలాదుల ద్వారా తృప్తి పరచడం విధి. శ్రాద్ధకాలంలో వచ్చిన అతిథులకు అన్నదానం చేయడం వల్లనే పితృదేవతలు తృప్తిని పొందుతారని ‘కూర్మ పురాణం’ పేర్కొన్నది. పితృదేవతలు తృప్తులైతేనే కార్యక్రమ నిర్వాహకునికి క్లేశం (దుఃఖం), కర్మ (పని), విపాక (ఫలితం), ఆశయాలు (సంచితాలు) తొలిగి క్షేమం కలుగుతుంది. పిండాలు పెట్టినప్పుడు మరణించిన సమయంలో వెలగపండు పరిమాణంలో, ఆబ్దికాలలో కొబ్బరికాయ పరిమాణంలో, తీర్థయాత్రల సమయంలో కోడిగుడ్డు పరిమాణంలో, మహాలయ సమయంలో పెద్ద ఉసిరికాయ పరిమాణంలో పిండాలు పెట్టడం ఆచారం.

పాలకుర్తి రామమూర్తి

94416 66943


logo