శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Devotional - Aug 31, 2020 , 01:11:28

స్నాన విధులు-ధర్మాలు

స్నాన విధులు-ధర్మాలు

మానవ జీవన విధి విధానంలో, దినచర్యలో భాగంగా ‘శుచి శుభ్రతలు’ చాలా ముఖ్యమైనవి. శాస్త్రం, ధర్మం దృష్ట్యానే కాకుండా, ఆరోగ్యం కోసమైనా వీటిని ‘తప్పక ఆచరించాల్సిన కర్మలు’గా మనం భావించాలి. అందులో ‘నిత్య స్నానం’ తప్పక పాటించాల్సిన విధి. స్నానం చేయకుండా చేసే ఏ కర్మలు అయినా సత్ఫలితాలను ఇవ్వవని, ఒకవేళ ఏవైనా ఫలితాలను ఇచ్చినా వాటిని రాక్షసులు తీసేసుకుంటారని కూడా ప్రతీతి. స్నానం వల్ల పరిశుభ్రతేకాక బలం, ఆయువు, తేజస్సు ఇత్యాది పదిరకాల ప్రయోజనాలు కలుగుతాయని మన ప్రాచీన విజ్ఞానం చెబుతున్నది. స్నానాల్లో తప్పక పాటించాల్సిన విధి విధానాలు కొన్నుంటాయి. ‘ఎక్కడ స్నానం చేస్తే ఎలాంటి ఫలితం వస్తుంది?’ వంటి విషయాలతో పాటు శాస్త్ర సమ్మతమైన వేర్వేరు స్నాన పద్ధతులు కూడా ఉన్నాయి.

సూర్యోదయానికి ముందే జరిగే స్నానం అన్నివిధాలుగా శ్రేష్ఠం. నదీ నీటిలో చేసే స్నానం అన్నింటికన్నా ఉత్తమమైంది. నదీజలాలు పవిత్రమైనవి, తీర్థంలోని నీరు అంతకన్నా పవిత్రం. గంగానదీ జలమైతే సర్వోత్కృష్టమని పురాణ విజ్ఞానం చెబుతున్నది. తటాక (చెరువు) స్నానం మధ్యస్తమైతే, బావిలోగానీ, బావినుంచి తోడిన నీటితోకానీ చేసే స్నానం సామాన్యమైంది. నిలువ నీటితో చేసే స్నానాన్ని అధమమైందిగా భారతీయ ఋషులు పేర్కొన్నారు. అప్పట్లో భూమి వ్యవస్థలు ఈ కాలం మాదిరిగా కలుషితం కాలేదన్నది నిజం. నేటి ఆధునికకాలంలో నిలువ నీటి స్నానమే సాధ్యమవుతున్నది. కాకపోతే, ఆ నీటిని కాలుష్య రహితంగా, క్రిములు చేరకుండా చూసుకోగలిగితే సరి. నదులు, గంగాజలం అతి పవిత్రం కాబట్టి, మిగతా జలాల్లో గంగను ఆవాహనం చేసుకొని, స్నానం చేయడం వల్ల అంతటి ఫలితాన్ని కొంతవరకు పొందవచ్చు.

నదీ స్నానంలో ప్రవాహానికి అభిముఖంగా నిలబడాలి. జలాశయాల్లో అయితే సూర్యుడివైపు ముఖం చేసి నిలబడి స్నానం చేయాలి. నూనె రాసుకొని, గట్టిగా రుద్ది శరీర మురికిని తొలిగించుకొన్నాకే నదిలోకి దిగి స్నానానికి ఉపక్రమించాలి. ఈ మలాపర్షక స్నానంలో ఆరోగ్య సూత్రాలు, పర్యావరణ స్పృహ ఇమిడి ఉన్నాయి. నదీస్నానం తర్వాత తడివస్ర్తాన్ని విడిచేటప్పుడు కిందనుంచి, ఇంట్లోస్నానం అయితే తడివస్ర్తాన్ని పై నుంచి తీసివేయాలి. పిండిన వస్త్రం భుజంపై ధరించడం దోషం. స్నానం తర్వాత తడివస్త్రం ఎప్పుడైనా మళ్లీ ధరించాల్సి వస్తే, అది విడిచాక మళ్లీ తప్పనిసరిగా స్నానం చేయాలి. మధ్యరాత్రి, ఎక్కువ బట్టలు ధరించినప్పుడు, తెలియ నిచోట లేదా కొత్త జలాశయాలలో, భోజనం చేసిన వెంట నే, సంధ్యా సమయాలలో స్నానాలు ఎంతమాత్రం ఆచరణీయం కాదు. కానీ, గ్రహణ సమయంలో మాత్రం స్నానదోషం ఉండదు. శరీరం అలసిపోయినప్పుడు, ఎం డలో తిరిగివచ్చినవారు ఆ అలసట తీరకుండా వెంటనే స్నానం చేయకూడదు కూడా. దీనివల్ల ఆరోగ్యానికి హాని కలుగడమే కాక ప్రత్యేకించి చూపు మందగించే ప్రమాదం ఉంటుందని పెద్దల ద్వారా వినికిడి. వివస్త్ర స్నానం నిషేధం. శరీరం మీద ఏదో ఒక వస్త్రం తప్పనిసరి. 

‘మంత్ర, భౌమ, భస్మ, వాయ వ్య, దివ్య, వారుణ, మానసిక’ అని స్నానాలు ఏడు రకాలు. ఇవేగాక, సారస్వత, కాపిల, ధ్యాన స్నానాలు అశక్తులైన వారు, ఇతరుల కోసం ఆచరించేవి. సామాన్యంగా బ్రహ్మచారి రోజుకు ఒకసారి, గృహస్థులు, వానప్రస్థులు రోజుకు రెండుసార్లు, సన్యాసులు రోజుకు మూడుమార్లు స్నానం చేయాలని మన ధర్మశాస్త్రం చెబుతున్నది. మానవ శరీర తత్వాలను, పర్యావరణ, ఆరోగ్య సూత్రాలను దృష్టిలో పెట్టుకొనే ఈ విధమైన స్నాన నియమాలు, సూచనలు ఏర్పరిచారనడంలో ఎలాంటి సందేహం లేదు.


logo