శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Devotional - Aug 27, 2020 , 23:18:44

మహా ఆకర్షణ శక్తి గణపతి!

మహా ఆకర్షణ శక్తి గణపతి!

‘లంబోదరం పరమసుందర మేకదంతం

రక్తాంబరం త్రిణయనం పరమం పవిత్రమ్‌

ఉద్యద్‌ దివాకర నిభోజ్జ్వల కాంతికాంతం

విఘ్నేశ్వరం సకల విఘ్న హరం నమామి’

అత్యంత శ్రేష్ఠమైన వైజ్ఞానిక శక్తి, తొలిపూజలు అందుకునే దైవమే ‘గణపతి’. మనం నివసించే భూమి ఆకృతి శివలింగాకృతి. భూమి అంటే శివుడే. భూమి చుట్టూ ఉండే పాంచభౌతిక ప్రకృతి పార్వతి. ఈ భూమికి ప్రత్యేకమైన శక్తి ఉంది. అదే గురుత్వాకర్షణ శక్తి. అంటే, మనం గమనించగలిగే అన్ని శక్తుల్లోనూ అతి పెద్దది అని అర్థం. ఈ శక్తి వల్లనే మనచుట్టూ ఒక వాతావరణం ఏర్పడి, మన జీవన విధానంలో ఒక స్పష్టత ఏర్పడింది. భూమికి ఉన్న ఈ శక్తి వల్లనే మనం భూమిని అంటిపెట్టుకొని ఉంటున్నాం. ఆ శక్తిలో ఏ కొంచెం మార్పు వచ్చినా మనలోని పాంచభౌతిక శక్తుల్లోనూ మార్పులు కలుగుతుంటాయి. అందుకే, మనలను ఆకర్షించే శక్తిరూప దైవానికి తొలిపూజలు చేయడం సంప్రదాయమైంది. భూమి మధ్యభాగంలో ఉబ్బెత్తుగానూ, ధ్రువాల వద్ద ఒత్తబడి ఉంటుంది. భూమిలో ఉత్తరం వైపు తల, దక్షిణం వైపు కాళ్ళు పెట్టుకున్నట్లుగా ఉన్న గణపతి స్వరూపాన్ని ఊహిస్తే ఈ రూపానికి ఒక స్పష్టత ఏర్పడుతుంది. భూమి చుట్టూ ఉన్న విద్యుదయస్కాంత తరంగశక్తి (కుమారస్వామి) రూపమైన సర్పమే గణాధిపతి నడుముకు చుట్టుకున్న సర్పం. ఇదంతా భూమి గురుత్వాకర్షణకు మన ఋషులు ఇచ్చిన రూపాన్ని సూచిస్తున్న అంశాలే.

వినాయక వ్రతకథలోని సారాన్ని వైజ్ఞానిక దృష్టితో స్థూలంగా పరిశీలిస్తే మరికొన్ని విషయాలు అర్థమవుతాయి. ప్రకృతి (పార్వతి) ద్వారా చేర్చబడిన ఆకర్షణ శక్తి ఈ భూమికి మొదట్లో సరిపోలేదు. దానిని కాలానుగతికంగా, తన గతిని మార్చుకుంటూ మరింత బలంగా భూమి మార్చుకోవాల్సి వచ్చింది. గజాసురుని తలను తీసుకొని వచ్చిన కథ వెనుక తత్త్వమూ అదే. భూమిపై ప్రస్తుతానికి అతి బలమైన జంతువు గజమే. ఈ భూమిని మోసేవి కూడా అష్టదిగ్గజాలే అనేది పౌరాణికమైన భావన. ‘వినాయకుడు ఒకేచోట ఉండి శక్తిని చూపేవాడు. కుమారస్వామి విస్తరిస్తూ శక్తిని చూపేవాడు’ అనే భావన కూడా ఈ వ్రతకథ ద్వారా తెలుస్తున్నది. వినాయక మంత్రంలో ‘సర్వజనంమే వశమానాయ స్వాహా’ అనే మాటలలో లోకాన్ని వశం చేసుకునే గురుత్వాకర్షణ శక్తికి చేసే నమస్కారమే కనిపిస్తుంది. ‘గం’ ఆకర్షణ బీజం, ‘లం’ పృథివీ బీజం. ఈ బీజాక్షరాలను పేర్లలో నింపుకుని గణపతి, లంబోదరుడు వంటి పదాలతో పూజలందుకుంటున్నాడు.

భాద్రపద శుద్ధచవితి నాడు భూమ్యాకర్షణ శక్తి, చంద్రుని ఆకర్షణశక్తి మధ్యలో కలిగే ఘర్షణ వల్ల భూమిలోనూ, భూమిపైన జీవించే జీవుల్లోనూ కొన్ని ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఈ లోపాన్ని అధిగమించడానికి ధర్మ, విజ్ఞాన శాస్ర్తాలు సూచించిన విధానమే మట్టితో చేసిన గణపతి స్వరూపాన్ని తయారు చేయడం. మట్టికి దగ్గరగా ఉండటం వల్ల ఆకర్షణ శక్తికి దగ్గరగా ఉండే అవకాశం. అదేవిధంగా ఈ కాలంలో లభించే పత్రాలతో అర్చనలు చేయడం. ఇతర ఆహార పదార్థాలను తినకుండా జాగ్రత్తగా ఉండ్రాళ్ళు మాత్రమే తీసుకోవడం. ఈ విధంగా నియమబద్ధంగా అర్చించడం వల్ల మనని మనం ఈ కాలంలో నియంత్రించుకునే అవకాశం, శక్తిని కోల్పోకుండా చేసుకోగలం. అందుకే వినాయకచవితి ఒక వ్రతం. చాలా జాగ్రత్తగా ఆచరించాలి. శ్రద్ధతో పూజిస్తే విఘ్న నాశకుడు, శ్రద్ధలోపించిన చోట విఘ్న కారకుడు అయిన దైవం కూడా వినాయకుడే. 

-సాగి కమలాకరశర్మ 97042 27744


logo