గురువారం 01 అక్టోబర్ 2020
Devotional - Aug 24, 2020 , 23:29:41

‘సుఖదుఃఖ సమభావన’ ఎందుకంటే?

‘సుఖదుఃఖ సమభావన’ ఎందుకంటే?

‘యం హి నవ్యథ యంత్యేతే పురుషం పురుషర్షభ సమదుఃఖ సుఖం ధీరం సో మృతత్వాయ కల్పతే ॥

‘పురుష శ్రేష్ఠుడవైన ఓ అర్జునా..!’

‘సుఖదుఃఖాలను సమానంగా భావించే ఏ ధీరుణ్నైతే ఇంద్రియ చాపల్యాలు పీడింపలేవో అతడే మోక్షప్రాప్తికి అర్హుడు.’  శ్రీకృష్ణ భగవానుని ఈ ప్రబోధాన్ని పరిశీలిస్తే ధీరుడైన వాని దృష్టిలో సుఖదుఃఖాల సమభావన విధిగా ఉంటుందన్న విషయం అర్థమవుతుంది. మానవ జీవితంలో కష్టసుఖాలు తప్పవు. కష్టాల్లో కుంగిపోయి, సుఖాల్లో పొంగి పోవడమన్నది లోకంలో సాధారణంగా మనకు కనిపించే ధోరణి. కానీ, ‘భగవద్గీత’ బోధిస్తున్న పై అంశం ప్రకారం ‘ఆ రెండింటినీ సమదృష్టితో చూడాలి’. ఇది నిజానికి సామాన్యులకు చాలా కష్టం. అలాగని స్థిరచిత్తం గల మనిషికి అసాధ్యం మాత్రం కాదు. ఎంతటి కఠినమైన అంశమైనా సాధనతో సుసాధ్యమవుతుంది. కఠోర సాధన అనేకమైన అసాధ్యాలను మనకు చేరువ చేస్తుందన్నది నిరూపిత సత్యం కూడా. దాని ఆచరణ కోసమే ప్రతి ఒక్కరూ తమ సర్వ ప్రయత్నాలనూ కొనసాగించాలి. ఆ దిశగా మన గమ్యం నిర్దేశింపబడాలన్నదే భగవంతుని బోధనలోని పరమార్థం.

భారతీయ సనాతన ధర్మం బోధిస్తున్నది కూడా పురుషార్థాలను అచరించే జీవన విధానాన్నే! ఈ ఆచరణ వ్యక్తిగతంగా తనకు, సామాజికంగా ప్రజాబాహుళ్యానికి కూడా ప్రయోజనకరంగా ఉంటుందన్నది తిరుగులేని వాస్తవం. ఇది చెప్పింది ధర్మప్రవక్తలే అయినా ఇది సార్వకాలిక సత్యం కూడా. ‘ధర్మమార్గంలోనే అర్థ (ధన) సంపాదన చేసి, కామిత వాంఛలను పూర్తి చేసుకొని, మోక్షాన్ని సాధించాలన్నది ఇందులోని సందేశం. దీనిని ఆచరణలో పెట్టినవాడినే ‘పూర్ణ పురుషుడని, ధీరుడని’ మన శాస్ర్తాలు పేర్కొన్నాయి. అటువంటి స్త్రీ పురుషులందరికీ సుఖదుఃఖాల విషయంలో సమభావన ఉండాలి. అప్పుడే అంతిమ లక్ష్యమైన ‘మోక్షం’ సాధ్యమవుతుంది. ఆ సమభావన కలిగినవారే ఈ మార్గంలో పురోగతిని, విజయాలను సాధించి, సూర్యచంద్రాదులు న్నంత కాలం కీర్తిప్రతిష్ఠలను నిలుపుకొంటారు. భారతీయ పురాణేతిహాసాలన్నీ ఇటువంటి మహానుభావుల గుణాలనే గానం చేశాయి. అందుకే, ధీరులైన వారెప్పుడూ ఏ మోహంలోనూ చిక్కుకోరాదు. అది సుఖం కావచ్చు, దుఃఖం కావచ్చు. ఈ విషయంలో మనకు రామాయణ కావ్య నాయకుడైన శ్రీరామచంద్రమూర్తియే గొప్ప ప్రమాణం. 

శ్రీరాముడు ‘తనకు పట్టాభిషేకం జరుగబోతుందని తెలిసినప్పుడైనా, తర్వాత అది భంగమై తాను అడవులకు వెళ్లవలసి వచ్చిందని విన్నప్పుడైనా.. ఈ రెండింటినీ సమభావనతో చూడగలిగే ధీరత్వాన్ని ప్రదర్శించాడు. ధర్మాచణలో ఏ మాత్రం చలించనివాడు గనుకనే భార్యకు దూరమైనా, వానరులను కలుపుకొని రావణ సంహారంతో దుష్టశిక్షణలో విజయం సాధించగలిగాడు. ‘అన్ని భావాలను సమదృష్టితో చూడగలిగిన ధీరుడే విజయాలు సాధిస్తాడన్న’ దానికి ఇదొక గొప్ప ప్రతీక. అందుకే, పురుషోత్తముడైన శ్రీరాముడు తిరుగులేని దైవంగా మనందరి గుండెల్లో నిలిచిపోయాడు. జీవితంలో ప్రతి మనిషికీ అనేక కష్టాలు వస్తుంటాయి. వాటిని అధిగమించి విజయాన్ని పొందే మార్గంలో స్థిరత్వాన్ని కోల్పోకుండా, ధీరులమై నిలువాలన్న గొప్ప సందేశం ఇందులో ఉమిడి వుంది. ఈ దృష్టి పాదుకొనడానికి ప్రతి ఒక్కరికీ మానసిక దృఢత్వం ఎంతో అవసరం.  

‘మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖదుఃఖదాః

ఆగమాపాయినో నిత్యాః తాం స్తితీక్షస్వ భారత’॥

‘మనిషికి ఇంద్రియాల స్పర్శ ఉన్నంత కాలం శీతోష్ణాలు, సుఖదుఃఖాలు తప్పక ఉంటాయి. అవి రావడం, పోవడం కూడా ఉంటుంది. కాబట్టి, వాటిని అశాశ్వతాలని తెలుసుకొని, సమభావనతో ధీరుడై విజయాన్ని సాధించి, మోక్షం పొందాలి..’ అని బోధించి మార్గనిర్దేశనం చేసిన శ్రీకృష్ణ పరమాత్మ మనలనందరినీ ధన్యులను చేశాడు. 


logo