బుధవారం 23 సెప్టెంబర్ 2020
Devotional - Aug 23, 2020 , 22:50:50

శ్రీ వామన విజయం!

శ్రీ వామన విజయం!

మహిమాన్వితమైన శ్రీవామన చరిత్రను విన్నవారు నిశ్చయంగా సమస్త పాపాలనుండి బయటపడతారు. అప్పుడు వారి కష్టాలు, దుఃఖాలు వాటంతటవే నశించిపోతాయి. శ్రీవామన చరిత్ర ఫలశ్రుతిని తెలుపుతూ శ్రీశుకదేవుడు, దేవతా ప్రీత్యర్థం చేసే కర్మలలోగాని, పితృదేవతల ప్రీత్యర్థం చేసే కర్మలలోగాని, వివాహం వంటి సాంఘిక కర్మలలోగాని వామన చరిత్రను కీర్తిస్తే వారి కార్యం నిర్విఘ్నంగా అత్యంత శుభప్రదమవుతుందని తెలియజేశాడు. 

‘ఛలయసి విక్రమణే బలి మద్భుత వామన

పదనఖనీర జనిత జనపావన

కేశవధృత వామనరూప జయజగదీశ హరే’

‘ఓ కేశవా! ఓ జగదీశా! వామనరూపాన్ని ధరించిన ఓ హరీ! నీకు జయము జయము. మహోన్నతమైన అడుగులతో నువు బలి మహారాజు ఆట కట్టించావు. నీ పాద పద్మముల నుండి బయల్వెడలిన గంగాజలంతో ఈ జగత్తులోని సకల జీవులను ఉద్ధరించావు’ అన్నది ఈ శ్రీవామన స్తుతి భావన. 12వ శతాబ్దానికి చెందిన సుప్రసిద్ధుడైన శ్రీ జయదేవ గోస్వామి ‘శ్రీవామనదేవుని విజయం’ గురించి ‘దశావతార స్తోత్రం’లో రచించారు. ఈ విధంగా దేవదేవుడైన శ్రీహరి దశావతారాలలో ఒకానొక సుప్రసిద్ధ అవతారంగా శ్రీ వామనదేవుడు భక్తుల హృదయాలలో నిలిచిపోయాడు. కవులతో విశేషంగా కీర్తనలు అందుకొన్నాడు. 

తెలుగువారికి సుపరిచితమైన ‘ఇంతింతై వటుడింతయై మఱియు దానింతై నభోవీథిపై..’ అనే శ్రీ భక్త పోతనామాత్యుల విరచితమైన భాగవతంలో కూడా శ్రీవామన విజయం రమ్యంగా వర్ణితమైంది. శ్రీవామన చరితం గురించి ప్రామాణికంగా తెలుసుకోవాలంటే శ్రీవ్యాసదేవ విరచితమైన  శ్రీమద్భాగవతంలోకి వెళ్లాల్సిందే. అందులో శ్రీవామనదేవుని ప్రస్తావన మొదటి స్కంధంలోను, దశమ స్కంధంలోను కొద్దిగా వచ్చినా, 8వ స్కంధంలో విస్తారంగా వర్ణితమైంది. వేదవిభజన, పురాణాలు, బ్రహ్మసూత్రాలు, ఉపనిషత్తులు, మహాభారతం చివరగా శ్రీమద్భాగవతాన్ని అందించిన శ్రీవ్యాసదేవుడు పూర్ణసంతుష్టిని పొందినట్లు భాగవతంలో స్పష్టంగా ఉంది. ఇందులోని మొదటి అధ్యాయంలో భగవంతుని అవతారాలలో భాగంగా శ్రీవామనావతారం ‘పదిహేనవది.’.

పంచదశం వామనకం కృత్వాగాదధ్వరం బలేః

పదత్రయం యాచమానః ప్రత్యాదిత్సు స్త్రిపిష్టపమ్‌

‘పదిహేనవ అవతారంలో భగవానుడు వామనదేవుని రూపాన్ని స్వీకరించి బలి మహారాజు ఏర్పాటు చేసిన యజ్ఞస్థలిని సందర్శించాడు. త్రిభువన రాజ్యాన్ని తిరిగి పొందాలని హృదయంలో తలచినప్పటికీ ఆ దేవదేవుడు కేవలం మూడు అడుగుల నేలను మాత్రమే దానంగా పొందాడు’.

మూడుసార్లు పుత్రునిగా భగవంతుడు:

ద్వాపర యుగాంతంలో శ్రీకృష్ణుడు దేవకీ వసుదేవులకు అష్టమ సంతానంగా మథురలోని కారాగారంలో జన్మించాడు. అప్పుడు సాక్షాత్తుగా చతుర్భుజాలు, శంఖచక్రగదాపద్మాలు, వనమాల, కిరీట కుండలాలు, పీతాంబరాలతో వారికి దర్శనమిచ్చాడు. “మీరు స్వాయంభువ మన్వంతరంలో పృశ్నిసుతవులుగా జన్మించారు. ప్రజాసృష్టి చేయమని బ్రహ్మదేవుడు ఆజ్ఞాపించినప్పుడు మీరిద్దరు ఎంతో ఇంద్రియ నిగ్రహంతో తీవ్ర తపస్సు చేశారు. 12,000 దేవతా సంవత్సరాలు తపస్సు చేశాక మీకు నేను దర్శనమిచ్చాను. ‘నావంటి పుత్రుని పొందాలని’ వరం కోరారు. ఫలితంగానే పృశ్నగర్భంలో నేను అవతరించాను. మీరు తర్వాతి యుగంలో ‘అదితి కశ్యపులు’గా జన్మించారు. అప్పుడు మళ్లీ నేను మీకు ‘వామనదేవుని’గా ఆవిర్భవించాను. ఉపేంద్రుడిగా ప్రసిద్ధి చెందాను. ఇక, ఇప్పుడు ద్వాపరయుగంలో ‘దేవకీ దేవులు’గా జన్మించిన మీకు మూడవసారి పుత్రుని అయ్యాను. నా మాటలు సత్యం. మీ పూర్వజన్మలను గుర్తు చేయడాకే ఈ విష్ణురూపంలో మీ ముందుకు వచ్చాను’ అని భగవంతుడు వారితో అన్నాడు. శ్రీమద్భాగవతంలోని దశమ స్కంధంలో శ్రీకృష్ణుని ఆవిర్భావ వేళ ఈ విషయం వెల్లడైంది. పృశ్ని-సుతవులనే దంపతులకు భగవంతుడు మూడుసార్లు పుత్రుడుగా లభించాడు. వారిలో ఒకరే శ్రీవామనదేవుడు.

అవతారానికి మూల కారణం

క్షీరసాగర మథనంలో దేవతలకు అమృతం లభించింది. దానవులకు అందులో భాగం దొరకలేదు. అమృతపానంతో అమరులైన దేవతలు ఇంద్రుని నాయకత్వంలో దానవులను ఘోరంగా ఓడించి, తరిమి వేశారు. అప్పుడు దానవ రాజైన బలి మహారాజు తీవ్రంగా గాయపడ్డాడు. 

దానవులూ అత్యధిక సంఖ్యలో మరణించారు. దానవ గురువైన శుక్రాచార్యుడు వారందరినీ సంజీవినీ విద్యతో బతికించాడు. బలి మహారాజుకూ పూర్తి స్వస్థతను చేకూర్చాడు. శుక్రాచార్యుడు బలి చక్రవర్తితో విశ్వజిద్యజ్ఞాన్ని నిర్వహింపజేసి అతిబలసంపన్నునిగా చేశారు. యజ్ఞం నుండి బలికి అద్భుతమైన రథం, అశ్వం, ధ్వజం, విల్లు, కవచం, రెండు తూణీరాలు లభించాయి. ఆ దివ్య వరదానాలతో బలి మహారాజు తిరిగి దేవతలపైకి దండెత్తాడు. బలి శంఖారావం ఇంద్రునికి భీతిని కలిగించింది. ‘ఘోరంగా ఓడిపోయిన బలి మహారాజుకు ఎందుకింత ధైర్యం వచ్చిందని’ అతడు తమ గురువైన బృహస్పతిని అడిగాడు. బ్రాహ్మణుల వరాలవల్ల బలి అతిశక్తి సంపన్నుడు అయ్యాడని, అతడు ఇప్పుడు అజేయుడని ఆయన చెప్పాడు. అతనిని ఎదుర్కోవడం కంటే స్వర్గాన్ని విడిచిఎక్కడికైనా వెళ్లిపోవడం ఉత్తమమనీ బృహస్పతి సలహా ఇచ్చాడు. దాంతో ఇంద్రాది దేవతలు స్వర్గాన్ని విడిచిపెట్టి అదృశ్యంగా సంచరించసాగారు. తర్వాత శుక్రాచార్యుడు బలి మహారాజుతో నూరు అశ్వమేధ యాగాలు చేయించి, ఇంద్ర పదవికి యోగ్యుని చేశాడు. ఈ రకంగా బలి మహారాజుకు స్వర్గలోక్ర పాప్తి, దేవతలకు స్వర్గం నుండి ఉద్వాసన కలిగాయి.

పయోవ్రతం

దేవతల తల్లి అదితి. తన పుత్రులకు కలిగిన కష్టాలకు ఆమె కుమిలిపోయింది. స్వర్గంలో హాయిగా ఉండవలసిన వాళ్లు అదృశ్యంగా తిరుగుతున్నందుకు ఆమె బాధపడింది. ‘వారికి పూర్వ వైభవం కలిగించమని’ తన భర్త కశ్యప ప్రజాపతిని కోరింది. పన్నెండు రోజులపాటు చేసే పయోవ్రత పూజావిధానాన్ని ఆమెకు ఆయన తెలియజేశాడు. దీని పూర్తి వివరణ భాగవతంలో ఉంది. పరమాద్భుతమైన పయోవ్రతాన్ని భక్తి శ్రద్ధలతో అదితి చేయగానే, సాక్షాత్తు భగవంతుడైన నారాయణుడు ఆమె ముందు ప్రత్యక్షమయ్యాడు. ఆమె మనసులోని కోరికను గ్రహించాడు. ‘దేవతలందరు తిరిగి స్వర్గరాజ్యాన్ని  పొందుతారని, తాను ఆమెకు పుత్రునిగా జన్మిస్తానని’ దేవదేవుడు వరమిచ్చాడు. ఫలితంగా, కశ్యపుని హృదయం నుంచి అదితి గర్భంలోకి నారాయణుడు ప్రవేశించాడు.

విజయ ద్వాదశి

శుభఘడియ రాగానే అదితి గర్భంలోంచి భగవంతుడు చతుర్భుజ రూపంలో ఆవిర్భవించాడు. కశ్యప ప్రజాపతి ఆశ్రమం తేజోవంతమైంది. ఆ రోజు భాద్రపద శుక్ల ద్వాదశి. చంద్రుడు శ్రవణా నక్షత్రంలో ఉండగా, అభిజిత్‌ లగ్నంలో ‘భగవంతుని అవతరణ’ జరిగింది. ద్వాదశీ తిథిలో భగవంతుడు అవతరించినప్పుడు సూర్యుడు ఆకాశం మధ్యలో ఉన్నట్లు జ్యోతిష పండితులు గమనించారు. ఆ ద్వాదశికే ‘విజయ ద్వాదశి’ అనే పేరు సుస్థిరమైంది. ఆ చతుర్భుజ నారాయణ రూపమే చిన్న వటువుగా మారింది. కశ్యప ముని తన బాలునికి జాతక కర్మాదులు చేశాడు. బ్రహ్మచారికి కావలసినవన్నీ దేవతలు సమకూర్చారు. కుబేరుడు భిక్షాపాత్రను ఇవ్వగా, శివపత్ని భగవతీదేవి తొలిభిక్ష వేసింది. వామనుడు నేరుగా నర్మదా నదికి ఉత్తరతీరంలోని భృగుకచ్ఛమనే క్షేత్రానికి చేరుకొని, బలి మహారాజు యజ్ఞస్థలిలోకి ప్రవేశించాడు. భగవంతుని షడ్విభూతులలో ఒకటైన సౌందర్యాన్ని సంపూర్ణంగా ప్రదర్శిస్తున్న వామనుని చూసి బలి మహారాజు ఆశ్చర్యపోయాడు. ఆకర్షితుడయ్యాడు. ఆ వటువుకు ‘కోరినదేదైనా దానం చేయడానికి’ సిద్ధపడ్డాడు. వామనుడు తనకు కేవలం ‘మూడు అడుగుల నేలను’ దానమడిగాడు. బలవంతం చేసినా ఇంకేదీ అడుగలేదు. అడిగిన దానం ఇవ్వడానికి బలి మహారాజు సిద్ధపడగానే గురువైన శుక్రాచార్యుడు అతనిని నిరోధించాడు. తన మాట వినకపోతే నశించిపోతావని శాపం పెట్టాడు. ‘వామనరూపంలో వచ్చింది దానవ వైరి’ అని రహస్యం చెప్పాడు. అయినా, దేనికీ జంకక ఆత్మనివేదనతో బలి, వామనునికి మూడు అడుగుల నేలను దానం చేశాడు. అంతే! 

మరు క్షణమే వామనుడు అనంతంగా పెరగసాగాడు. విరాట్రూపంతో ఒక్క అడుగుతో సమస్త భూమండలాన్ని, శరీరంతో ఆకాశాన్ని, భుజాలతో సమస్త దిక్కులను ఆక్రమించాడు. రెండవ అడుగుతో సత్యలోక పర్యంతం సమస్తాన్నీ ఆక్రమించేశాడు. మూడవ అడుగుకు స్థానం లేదు. దాంతో బలి మహారాజు తన తలను స్వామి ముందుంచాడు. అలా, ఆత్మ సమర్పణం చేసిన బలి మహారాజును తన పరమభక్తునిగా స్వీకరించాడు. అతనికి సుతల లోకంలో అద్భుత స్థానాన్ని కల్పించి, దానికి తానే కాపలాదారు అయ్యాడు. ‘రాబోయే సావర్ణి మన్వంతరంలో బలి మహారాజు ఇంద్ర పదవిని పొందుతాడని’ భవిష్యద్వాణితో భగవంతుడు పలికించాడు. బలి మహారాజు తన బంధువులతోపాటుగా సుతల లోకానికి వెళ్లిపోయిన తర్వాత శ్రీవామనదేవుడు స్వర్గరాజ్యాన్ని తన సోదరుడైన ఇంద్రునికి సమర్పించాడు. ఇంద్రుడు సకల లోకపాలురతోపాటు శ్రీవామనదేవుని ముందుంచుకొని బ్రహ్మదేవుని అనుమతితో దివ్యవిమానంలో తన లోకానికి తీసుకొని వెళ్లాడు. మహిమాన్వితమైన శ్రీవామన చరిత్రను విన్నవారు నిశ్చయంగా సమస్త పాపాలనుండి బయటపడతారు. అప్పుడు వారి కష్టాలు, దుఃఖాలు వాటంతటవే నశించిపోతాయి. శ్రీవామన చరిత్ర ఫలశ్రుతిని తెలుపుతూ శ్రీశుకదేవుడు, దేవతా ప్రీత్యర్థం చేసే కర్మలలోగాని, పితృదేవతల ప్రీత్యర్థం చేసే కర్మలలోగాని, వివాహం వంటి సాంఘిక కర్మలలోగాని వామన చరిత్రను కీర్తిస్తే వారి కార్యం నిర్విఘ్నంగా అత్యంత శుభప్రదమవుతుందని తెలియజేశాడు. అందుకే, అన్ని శుభకార్యాలలో శ్రీవామన చరిత్రను చదువడం, వినడం ఒక మంచి అలవాటుగా పెట్టుకోవాలి.

శ్రీవామన దేవవ్రతం:

శ్రీవామన దేవవ్రతం గురించి వామన, భవిష్య, బ్రహ్మవైవర్త పురాణాలలో విస్తారంగా ఉంది. శ్రీవామనదేవుని అర్చనా మంత్రాలు, వ్రతవిధానం బ్రహ్మవైవర్త పురాణంలో సవివరంగా వుంది. వామనదేవ వ్రతాన్ని ‘విజయవ్రతమని’ కూడా అంటారు. ఈ వ్రతఫలాన్ని తమ తల్లిదండ్రులకు ధారపోసేవారు సమస్త కుటుంబాన్ని ఉద్ధరించిన వాడవుతాడు. భక్తిశ్రద్ధలతో వామన వ్రతపాలన చేసేవాడు వైకుంఠప్రాప్తిని పొంది, తర్వాతి మన్వంతరంలో రాజుగా జన్మిస్తాడని, శత్రుభయ రహితంగా జీవిస్తాడని కూడా శాస్త్రంలో ఉంది. వామనవ్రత పాలకుడు ఐశ్వర్యం, సౌందర్యం, సౌభాగ్యం, రోగవిముక్తి, దీర్ఘాయువు వంటి అద్భుత ఫలాలను  పొందుతాడు. ఇహలోకంలో పుత్రపౌత్రులతో వందేళ్లు సుఖంగా జీవిస్తాడు. ‘పుత్ర పౌత్రైః పరివృతో జీవేచ్ఛ శరదాం శతం’ అన్నది భవిష్యోత్తర పురాణం. అందుకే, శ్రీవామన ద్వాదశి రోజు శ్రద్ధాళువులైన భక్తులంతా ‘ఓం వామనాయ నమః’ అంటూ దేవదేవుని మనసారా ఆరాధించగలిగితే, అంతకంటే ఈ జన్మకు కావలసిందేముంటుంది!

- డా॥ వైష్ణవాంఘ్రి సేవక దాస్‌

098219 14642


logo