బుధవారం 23 సెప్టెంబర్ 2020
Devotional - Aug 23, 2020 , 22:50:47

సర్వపాప నివారణకు హరహర శంకర! జయజయ శంకర!!

సర్వపాప నివారణకు హరహర శంకర! జయజయ శంకర!!

‘మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే 

అమృతేశాయ శర్వాయ మహాదేవాయ తే నమ:’ 

‘శం’ కరోతీతి శంకరః. శాంతిని కలిగించేవాడు శంకరుడు. పాపాలన్నింటినీ హరించేవాడు హరుడు. మంగళం కలిగించే వాడు శివుడు. మృత్యువు చేరకుండా కాపాడేవాడు మృత్యుంజయుడు. ఈ విధంగా పరమశివుడు అనేక రూపాల్లో మనకు కనిపిస్తున్నాడు. లింగరూపం, కాలరూపం, అమృతరూపంగా భక్తుల మానసిక భావాలను అనుసరించి పరమశివ దర్శనం జరుగుతుంది. శంకరుడు లయకారకుడు కూడా. లయమంటే కలిసి పోవడం. శివలింగం భూమికి సంకేతం. మనం భూమిలో పుట్టి భూమిలో కలిసిపోతాం. శరీరం భూమిలో లయమైనట్లుగానే ‘శంకరుని’ ఆరాధనవల్ల మనం చేసిన పాపాలన్నీ కూడా లయం అవుతాయి.

శరీరంలో వేర్వేరు వ్యవస్థలలో కలిగే అడ్డంకులవల్ల శక్తి, ఉష్ణం, వాయు ప్రసారాలు సరిగా జరగనప్పుడు అనారోగ్యం కలుగుతుంది. బాధ శరీరమంతా వ్యాపిస్తుంది. దీనికి చికిత్స అవసరమవుతుంది. ఇది శరీర వేదన అవుతుంది. అదే విధంగా మన మనస్సుల్లో కలిగే భావాలు సరైన విధంగా కార్యరూపం ధరించకుండా అడ్డు పడుతున్నప్పుడూ అంతే వేదన కలుగుతుంది. ఇది మానసిక వేదన. ఇటువంటి వేదనలు భారతీయుల భావనలో ‘పాపాలు’ అనబడతాయి. ‘పాపం’ అంటే అడ్డంకి అని అర్థం. ఆధునికంగా వీటినే ‘బ్లాక్స్‌' అంటున్నాం. మనలోని బ్లాక్స్‌ తొలగిపోవడమే పుణ్యం. పుణ్యం పెరిగి, పాపాలన్నీ హరించే శక్తి శంకరునికి, శంకర శబ్దానికీ ఉంది. 

అందుకే, మనం నిరంతరం ‘హరహర శంకర! జయజయ శంకర!!’ అనే జపం చేయాలి. ప్రతిరోజూ కనీసం 1 గంటసేపు గానీ, 1,108 సార్లు గానీ ఈ జపాన్ని మనం చేస్తూ ఉంటే, మనలోని బ్లాక్స్‌ అన్నీ తొలగిపోతాయి. మనసా, వాచా, కర్మణా పూర్వకర్మలలో చేసిన అన్ని పాపాలూ పటాపంచలు అవుతాయి. వ్యక్తి శక్తిగానూ, మానవుడు మహనీయుడుగానూ మారుతాడు. అందుకే, పాప పరిహారానికి నిరంతరం ‘హరహర శంకర, జయజయ శంకర’ జపాన్ని చేసుకుంటూనే ఉందాం.  

- సాగి కమలాకరశర్మ

97042 27744  


logo