గురువారం 24 సెప్టెంబర్ 2020
Devotional - Aug 23, 2020 , 22:50:47

కైకేయిలో అంత స్వార్థమా?

కైకేయిలో అంత స్వార్థమా?

రామాయణంలో కైకేయి తన భర్త (దశరథుడు)ను కోరరాని వరాలు కోరడం న్యాయమేనా? తన కొడుకు (భరతుడు) మనసు తెలుసుకోకుండా స్వార్థబుద్ధిని చూపడం ఎంతవరకు ధర్మం?

- డి.సాయితేజ, రామాయంపేట

రామాయణం ఆత్మ ప్రధాన కావ్యం. రాముడు సాక్షాత్తు శ్రీమహా విష్ణువు. ఈ అప్రమేయ తత్తాన్ని మానవులు తెలుసుకునేందుకే ‘కైకేయి పాత్ర’ చక్కగా ఉపయోగపడింది. కైకేయి చేసిన ‘రామ పట్టాభిషేక భంగం’ అనేది పైకి తప్పు వలె కనిపించినా అది లోక శ్రేయస్సుకు జరిగిన మహోపకారంగానే భావించాలి. ఈ విషయం శ్రీరామునికీ తెలుసు కనుకనే చిన్నమ్మను తప్పు పట్టలేదు. ఇంకా, ఎక్కువగానే గౌరవించాడు. మంధరకూడా దేవతలతో ప్రేరేపితమైందే. దీని వెనుక ‘రావణాసుర వధ’ అనే ఒక బృహత్‌ కార్యం దాగి వుంది. ఇది జరగాలంటే, రాముడు అయోధ్యను విడిచి వెళ్లక తప్పదు.  ఇంతేకాదు, దట్టమైన అడవులున్న అయోధ్య పరిసర ప్రాంత ప్రజలు ఆటు కూృరమృగాలతోనూ, ఇటు రాక్షసులతోనూ పీడింపబడుతూ వున్నారు. ‘దుష్ట శిక్షణ- శిష్ట రక్షణ’కు రామ వనవాసం అనివార్యం. 

అసలు, ‘కైకేయి వరాలు’ కోరక పోతే రామాయణ కావ్యమే లేదు. అయోధ్య నుండి రాముడు బయటకు వెళ్లడానికి బలమైన కారణంగా ‘కైకేయి ఉదంతాన్ని’ పేర్కొనాలి. ఆమెకూ తెలుసు ‘రాముడు తన తండ్రి మాట కాదనడని’. అందుకే, అలాంటి కోరరాని వరాలనే కోరింది. దాని వెనుక ఒక మాతృహృదయాన్ని చూపించడం గ్రంథకర్త గొప్పతనం. ఎంతమంది చెప్పినా కైకేయి తన పట్టుదల వదలలేదు. ‘నువ్వు వరాన్ని ఇవ్వకుంటే ఆత్మహత్య చేసుకుంటానని’ దశరధుడిని బెదిరించింది కూడా. తల్లిని వారించే శక్తి ఒక్క భరతుడికి మాత్రమే ఉంది. కానీ, ఆ సమయంలో అతను మేనమామల దగ్గర ఉన్నాడు. వరాలు, శాపాలు మానవ ప్రవృత్తికి సంబంధించినవే. అవి అన్నీ కర్మ సిద్ధాంతాన్ని అనుసరించే పుట్టాయన్నదీ గమనార్హం. 

- రంగరాజు పద్మజ

99897 58144 


logo