శనివారం 26 సెప్టెంబర్ 2020
Devotional - Aug 23, 2020 , 22:50:45

సంసార వృక్షఫలం మోక్షమే!

సంసార వృక్షఫలం మోక్షమే!

భగవంతుడు ఈ శరీరాన్ని ఎందుకిచ్చాడనే అసహనంతో ప్రశ్నించేవాళ్లు చాలామంది ఉంటారు. ఈ శరీరం అనేది లేకపోతే ఏ కష్టాలూ ఉండవని వారి తలంపు. అటువంటి వారికి శరీరం విలువ తెలియదనే చెప్పాలి. జన్మలలో మానవజన్మ ఉత్తమమైంది. నిజానికి భగవంతుడు జీవులను ఉద్దేశించి ‘మీకే జన్మ కావాలని’ అడిగితే ఆయనను ‘మానవజన్మ ఇమ్మని’ కోరుతాం. ఆశ్చర్యం ఏమంటే, భగవంతుడు మొదట మానవుడినే సృష్టించినట్లు వేదాది గ్రంథాలు చెబుతున్నాయి. ‘యః ఈశే అస్య ద్విపదః చతుష్పదః (23-3)’ అన్నది యజుర్వేదం. రెండు పాదాలుగల ఉత్తమజన్మ మానవజన్మే. ఆ తర్వాతనే నాలుగు పాదాలు, అంతకంటే ఎక్కువ పాదాలుగల జన్మలు కలిగాయి. జీవకోటికి సుఖదుఃఖాలు అనుభవించడానికే సృష్టి ఉద్దేశితమైంది. మానవ శరీరం సృష్ట్యాదిలో భగవంతుని కరుణతో అయాచితంగా లభించిందే. బుద్ధిమంతులైన మానవులు సృష్టిగతమైన ఈ రహస్యాన్ని తెలుసుకొని వ్యవహరిస్తారు. మానవ శరీరం ఎంతో పుణ్యం చేస్తేగాని లభించదని మనందరికీ తెలుసు. కానీ, మొదట అయాచితంగా భగవంతుడు దాన్ని మనకు ఇచ్చిన విషయమే మన గ్రహింపులోకి రాదు. 

భగవంతుడే సృష్టికర్త. అతడు యజుర్వేదంలో (స ఓతశ్చ ప్రోతశ్చ విభూః ప్రజాసు. 32-8) చెప్పినట్లు అన్నింటిలోను ఓత ప్రోతమై ఉన్నాడు. ఇక్కడ ‘అన్ని’ అంటే సర్వ పదార్థాలని భావించాలి. మరి, సృష్టికంటే ముందు ‘అతడొక్కడే ఉన్నాడా? అతనిలో ఏమీ లేవా?’ అనే ప్రశ్న కలుగుతుంది. దానికి సమాధానం ‘ఛాందోగ్యోపనిషత్తు’లో ఉంది. ‘సదేవ సౌమ్యేదం అగ్ర ఆసీదేక మేవా ద్వితీయమ్‌' (6-2-1). సృష్టికంటే ముందు భగవంతుడు ఒక్కడే ఉన్నాడు. అతడు అద్వితీయుడు అనే విషయం ‘సత్‌' పదం వల్ల తెలుస్తున్నది. భగవంతుడు సూక్ష్మ పదార్థాలలోకెల్లా సూక్ష్మమైనవాడు. కనుకనే అంతటా వ్యాపించి ఉన్నాడు. పరమాణువులు సూక్ష్మమైనవి. అవి జ్ఞానం లేనివి. జీవులు వాటికంటే సూక్ష్మమైనవి. అవి జానం కలిగినవి. పరమాణువులకంటే, జీవులకంటేకూడ సూక్ష్మమైనవాడు భగవంతుడు. ‘ముండకోపనిషత్తు’ దీనిని ధ్రువపరుస్తున్నది. ‘సూక్ష్మాచ్చ సూక్ష్మాతరం విభాతి’ (3-1-7). సూక్ష్మమైన ప్రకృతిని నామరూప జగత్తుగా మార్చినవాడు భగవంతుడే. శరీరధారియైన జీవునికే రూపం, నామం లభిస్తాయి. నిజానికి జీవుడు అణువుకంటే సూక్ష్మమైనవాడు కనుక, అతనికి రూపం లేదు. శరీరంలోకి ప్రవేశించేంత వరకు పేరుకూడా లేదు. 

ఆత్మజ్ఞానం లేకపోవడం వల్ల తానే శరీరంగా భావించినప్పుడు, శరీరసుఖం కోసం కర్మలు చేస్తూ జన్మలు ఎత్తుతుంటాడు మానవుడు. కానీ, ఈ పాంచభౌతికమైన శరీరంలో తాను ఉన్నట్లు, దానికంటే భిన్నమైనట్లు, దాన్ని వదులుకోవడమే శ్రేయస్కరమైనట్లు ఎప్పుడైతే భావిస్తాడో అప్పుడు మానవుడు పురుషార్థాలపట్ల దృష్టి పెడతాడు. ‘శరీరమాధ్యం ఖలు ధర్మసాధనమ్‌' అనే సూక్తిని ఆకళింపు చేసుకొని ధర్మకార్యాలే తలపెడతాడు. పరోపకార కర్మలకే ప్రాధాన్యమిస్తూ, యథోచితంగా లభించిన సంపదతో జీవితాన్ని కొనసాగిస్తూ, సుఖాలను అనుభవిస్తూ పరమ పురుషార్థమైన మోక్షం వైపు సాగుతాడు. మనం ఎప్పుడైతే నిష్కామబుద్ధితో కర్మలు చేస్తామో అప్పుడే ప్రకృతి బంధనాలనుంచి బయటపడగలుగుతాం. కర్మనే మనల్ని బంధిస్తుంది. అదే తిరిగి మనలను మోక్షం వైపు మళ్లిస్తుంది. 

‘కర్మ వై చిత్య్రాత్‌ సృష్టి వైచిత్య్రమ్‌' (సాంఖ్యం॥ 6-46). కర్మ వైచిత్రివల్లే ఈ విచిత్రమైన సృష్టి రచన జరిగింది. ఎప్పుడైతే కర్మబంధనాల నుంచి మనకు విముక్తి లభిస్తుందో, అప్పుడే విశ్రాంతి లభిస్తుంది. నదులు ప్రవహిస్తూ సముద్రాన్ని చేరి నామరూపాలు విడిచి కనిపించకుండా పోయినట్లుగా, జ్ఞానికూడా నామరూపాలను విడిచి, పరాత్పరుడైన భగవంతున్ని చేరుకొంటాడు. ఇది నిష్కామకర్మ యోగం వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. అటువంటి యోగి తన యోగాగ్నిలో కర్మలను దగ్ధం చేసుకోగలుగుతాడు. సంసార బంధనాలనుంచి బయటపడి మోక్షస్థితిని చేరుకొంటాడు. ఇదే సంసార వృక్షానికి లభించే మహత్తరమైన ఫలం.


logo