మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Devotional - Aug 21, 2020 , 23:09:59

భజే వినాయకం వినాయక వ్రతకల్పం

భజే వినాయకం వినాయక వ్రతకల్పం

పిల్లల దేవుడు.. పెద్దల దైవం.. అగ్రపూజలు అందుకునే వేలుపు..సమష్టి తత్తానికి, సామాజిక చైతన్యానికి ప్రతీక విఘ్నేశ్వరుడు. షోడశనామాలు.. ముప్పయ్‌రెండు రూపాలతో అలరించే దేవుడు ఆయన. అన్నిటినీ మించి సకల విఘ్న నివారకుడు వినాయకుడు. చవితి ఉత్సవంలో ఆ పార్వతీ తనయుణ్ని ప్రకృతి స్వరూపంగా కొలుచుకుందాం. కరోనా వేళ..నవరాత్రి సంబురాలను వినమ్రతతో జరుపుకొందాం.

పూజా విధానం

వినాయక స్తోత్రం వందేహం గణనాయకమ్‌!

ఏకదంతం మహాకాయం, తప్తకాంచన సన్నిభమ్‌,

లంబోదరం విశాలాక్షం, వందేహం గణనాయకమ్‌.

మౌంజీ కృష్ణాజినధరం, నాగయజ్ఞోప వీతినమ్‌,

బాలేందు శకలం మౌళౌ, వందేహం గణనాయకమ్‌.

చిత్రరత్న విచిత్రాంగం, చిత్రమాలా విభూషితమ్‌,

కామరూపధరం దేవం, వందేహం గణనాయకమ్‌.

గణవక్త్రం సురశ్రేష్ఠం, కర్ణచామర భూషితమ్‌,

పాశాంకుశధరం దేవం, వందేహం గణనాయకమ్‌.

మూషికోత్తమమారుహ్య దేవాసుర మహాహవే,

యోద్ధుకామం మహావీరం వందేహం గణనాయకమ్‌.

యక్షకిన్నెర గంధర్వ, సిద్ధ విద్యాధరైస్సదా,

స్తూయమానం మహాబాహుం వందేహం గణనాయకమ్‌.

అంబికా హృదయానందం, మాతృభిః పరివేష్ఠితమ్‌,

భక్తి ప్రియం మదోన్మత్తం, వందేహం గణనాయకమ్‌.

సర్వవిఘ్నహరం, సర్వవిఘ్న వివర్జితమ్‌,

సర్వసిద్ధి ప్రదాతారం, వందేహం గణనాయకమ్‌.

గణాష్టకమిదం పుణ్యం, యఃపఠేత్‌ సతతం నరః,

సిద్ధ్యంతి సర్వకార్యాణి విద్యావాన్‌ ధనవాన్‌ భవేత్‌.

పూజా ద్రవ్యాలు:

పసుపు, కుంకుమ, తమలపాకులు, అగరువత్తులు, వక్కలు, కర్పూరం, గంధం, అక్షింతలు, కొబ్బరికాయలు, కలశము.

వినాయకుని మట్టిప్రతిమ లేక విగ్రహం.

పంచామృతం : ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, పంచదార అన్నీ కలిపినది.

దీపములు : తైలం, నెయ్యి.

వస్త్రములు : పత్తితో చేయవచ్చు.

మధుపర్కాలు : పత్తితో చేయవచ్చు.

యజ్ఞోపవీతం : పత్తితో చేయవచ్చు.

పసుపుముద్దతో వినాయకుడిని చేయాలి. ఒక పీటమీద కొద్దిగా బియ్యము పరచి, పూర్ణకుంభం (వెండి లేదా రాగి లేదా యధా శక్తి చెంబు)లో కొత్త బియ్యము వేసి, వినాయకుని విగ్రహం పెట్టి అలంకరించండి. మామిడాకులు, వివిధ రకాల ఆకులు, లేతగడ్డి ఆకులు, వివిధ రకాల పూలు, పండ్లు, పాలవెల్లి, గొడుగు.

మహా నైవేద్యం : నేతితో చేసిన 12 రకాల వంటకాలు. ఇవి వీలు కాకపోతే వారి వారి శక్తి కొలది రకరకాల పిండివంటలు చేయవచ్చు. తర్వాత మంచినీటితో గ్లాసు, గ్లాసులో పూవు, ఉద్ధరిణ (చెంచా) ఉంచుకోవాలి.

శ్రీగణేశ ప్రార్థన:

శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం 

ప్రసన్న వదనం ధ్యాయేత్‌ సర్వవిఘ్నోప శాంతయే ॥

ఉ. తొండము నేకదంతము తోరపు బొజ్జయు వామహస్తమున్‌

మెండుగ మ్రోయుగజ్జెలును మెల్లని చూపులు మందహాసమున్‌

కొండొక గుజ్జురూపమున కోరిన విద్యలకెల్ల నొజ్జయై

యుండెడి పార్వతీ తనయ యోయి గణాధిప నీకు మ్రొక్కెదన్‌

చం. తొలుత నవిఘ్నమస్తనుచు ధూర్జటి నందన నీకు మ్రొక్కెదన్‌

ఫలితము సేయుమయ్య నిను ప్రార్థన జేసెద నేకదంత నా

వలపటి చేత ఘంటమున వాక్కున నెప్పెడు బామకుండు మీ

తలపున నిన్ను వేడెదను దైవగణాధిప లోకనాయకా

క. తలచితినే గణనాధుని! తలచితినే విఘ్నపతిని దలచిన పనిగా!

దలచితినే హేరంబుని! దలచితి నా విఘ్నములను తొలగించుటకున్‌

క. అటుకులు కొబ్బరి పలుకులు! చిటి బెల్లము నానబ్రాలు చెరకురసంబున్‌

నిటలాక్షు నగ్ర సుతునకు! వటుతరముగ విందు చేసి ప్రార్థింతు మదిన్‌!

ఆచమనం 

ఓం కేశవాయ స్వాహా, ఓం నారాయణాయ స్వాహా, 

ఓం మాధవాయ స్వాహా 

(అని మూడు సార్లు జలం తాగాలి).

ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవేనమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం హృషీకేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్దాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం అధోక్షజాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయనమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరయే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః, ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః

(అనుకుని కాసిన్ని నీళ్ళు తలపై చల్లుకోవాలి)

శ్లో॥ అపవిత్ర పవిత్రోవా సర్వావస్థాంగ తోపివా  

యస్మరేత్‌ పుండరీకాక్షం సబాహ్యంభ్యంతర శ్శుచిః 

(ఈ మంత్రం చదివిన తరువాత చేతిలో కొన్ని నీళ్ళు తీసుకుని 

కింది మంత్రాన్ని పఠించాలి)

భూశుద్ధి -

శ్లో॥ ఉతిష్టంతు భూతపిశాచాః యేతే భూమిభారకాః  

ఏతేషామవిరోధేన బ్రహ్మ కర్మ సమారభే ॥

(తరువాత కొన్ని అక్షింతలు వాసన చూసి వెనుకకు (కుడివైపు) జల్లుకొని 

ఈ మంత్రం చదువాలి.)

కలశారాధన : నీటితో ఉన్న ఒక చెంబును తీసుకుని దానికి పసుపు రాసి, పసుపు, కుంకుమ బొట్లు పెట్టాలి. తరువాత ఆ పాత్రలో తమలపాకు, అక్షింతలు వేసి ఆ కలశాన్ని కుడిచేతితో మూసి ఉంచి గంగా జలాన్ని ప్రార్థించాలి.

పసుపు గణపతి పూజ ప్రారంభం

కొన్ని అక్షింతలు పసుపు గణపతిపై చల్లి నమస్కరించాలి. 
శ్రీ మహాగణాధిపతయే నమః ప్రాణప్రతిష్ఠాపన ముహూర్తోస్తు తథాస్తు.
(ఈ కింది విధంగా జపిస్తూ గణనాయకుడికి నమస్కరించాలి)
శ్లో॥ సుముఖ శ్చైకదంతశ్చ కపిలో గజకర్ణకః, లంబోదరశ్చ వికటో విఘ్నరాజో వినాయకః, ధూమకేతుర్గణాధ్యక్షః, ఫాలచంద్రో గజాననః, వక్రతుండ శూర్పకర్ణో హేరంబో స్కంధపూర్వజః, షోఢశైతాని నామాని యఃపఠేచ్చృణు యాదపి, విద్యారంభే వివాహేచ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్యనజాయతే॥ఓం శ్రీ మహాగణాధిపతయే నమః, ధ్యాయామి ధ్యానం సమర్పయామి, ఆవాహయామి ఆవాహం సమర్పయామి. (అని అనుకొని కొన్ని అక్షింతలు పసుపు గణపతిపై వెయ్యాలి.) ఆసనం సమర్పయామి (పువ్వులను పసుపు గణపతి వద్ద వుంచి కింది విధంగా అంటూ కింది భాగమున నీటిని చల్లాలి.) - హస్తయోః అర్ఘ్యం సమర్పయామి, పాదయో పాద్యం సమర్పయామి, ఔపచారిక స్నానం సమర్పయామి. స్నానానంతరం ఆచమనీయం సమర్పయామి. వస్త్రం సమర్పయామి (దూదితో చేసిన వస్త్రమును లేదా పుష్పాన్ని సమర్పించాలి), గంధాన్‌ సమర్పయామి (గంధాన్ని చల్లాలి.) గంధస్కోపరి అలంకరణార్థం  అక్షతాన్‌ సమర్పయామి (అక్షింతలు చల్లాలి.) పుష్పైః పూజయామి (పుష్పాలను ఉంచాలి.) తరువాత గణేశునిపై ఒక్కో పుష్పాన్ని వేస్తూ ఈ కింది మంత్రంతో అర్చించాలి. ఓం సుముఖాయ నమః, ఓం వక్రతుండాయ నమః, ఓం కపిలాయ నమః, ఓం హేరంబాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం వికటాయ నమః, ఓం గజకర్ణకాయ నమః, ఓం గణాధిపాయ నమః, ఓం లంబోదరాయ నమః, ఓం గణాధ్యక్షాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం గజాననాయ నమః, ఓం ధూమకేతవే నమః, ఓం శూర్పకర్ణాయ నమః ఓం ఫాలచంద్రాయ నమః, ఓం స్కందపూర్వజాయ నమః, ఓం శ్రీ మహాగణాధిపతయే నమః, నానావిధ పరిమళపత్ర పుష్పాణి సమర్పయామి. ధూపం ధూపయామి (అగరుపుల్లలను వెలిగించి స్వామికి ధూపం వెయ్యాలి.), దీపం దర్శయామి (దీపమును చూపించాలి.) మధ్యే మధ్యే పానీయం సమర్పయామి (నీటిని చల్లాలి.), ఆనంద కర్పూర నీరాజనం దర్శయామి (కర్పూరం వెలిగించాలి.),శ్లో॥ వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ, నిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్యేషు సర్వదా॥మహాగణాధిపతియే నమః ఆత్మప్రదక్షిణ నమస్కారాన్‌ సమర్పయామి. గణాధిపతిః సుప్రీతః సుప్రసన్నో వరదో భవతు, మమ ఇష్టకామ్యార్థ ఫలసిద్ధ్యర్థం గణాధిపతి ప్రసాదం శిరసా గృహ్ణామి. (గణపతి వద్దనుండి అక్షతలు తీసుకొని తలపై చల్లుకోవాలి).

శ్రీ వరసిద్ధి వినాయక పూజ

(కింది విధంగా అంటూ అక్షితలు స్వామిపై వేస్తూ నమస్కరించాలి)
ధ్యానం :  శ్లో॥ భవంసంచిత పాపౌఘవిధ్వంసన విచక్షణం  విఘ్నాంధకార భాస్వంతం విఘ్నరాజ మహంభజే ॥ 
    శ్లో॥ ఏకదంతం శూర్పకర్ణం గజవక్త్రం చతుర్భుజం  పాశాంతుకుశధరం దేవం ద్యాయేత్సిద్ధి వినాయకం ॥
    శ్లో॥ ఉత్తమం గణనాధస్యవ్రతం సంపత్కరం శుభం  భక్తాభీష్టంప్రదం తస్మాత్‌ ధ్యాయేత్తం విఘ్ననాయకం ॥
శ్లో॥ ధ్యాయేద్గజాననం దేవం తప్త కాంచన సన్నిభం  చతుర్భుజం మహాకాయం సర్వాభరణ భూషితం ॥
    ఓం శ్రీ వరసిద్ధి వినాయకాయ నమ: ధ్యాయామి ధ్యానం సమర్పయామి.
    (కింది విధంగా అంటూ అక్షితలు స్వామిపై వేస్తూ నమస్కరించాలి).
ఆవాహనం -  శ్లో॥ అత్రాగచ్ఛ జగద్వంద్వ సురరాజార్చితేశ్వర అనాధనాధ సర్వజ్ఙ, గౌరీగర్భ సముద్భవ ॥
                 ఓం శ్రీ వరసిద్ధి వినాయకాయ నమ: ఆవాహయామి ఆవాహనం సమర్పయామి.
    (కింది విధంగా అంటూ అక్షింతలు స్వామిపై వేస్తూ నమస్కరించాలి).
ఆసనం - శ్లో॥ మౌక్తికై: పుష్యరాగైశ్చ నానారత్త్నె ర్విరాజితం - రత్న సింహాసనం చారుప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం ॥
                ఓం శ్రీ వరసిద్ధి వినాయకాయ నమ: నవరత్న ఖచిత స్వర్ణసింహాసనార్థం-హరిద్రాక్షతాన్‌ సమర్పయామి.
    (కింది విధంగా అంటూ పుష్పముతో గణేశుని చేతులపై నీళ్ళు చల్లాలి).
అర్ఘ్యం -  శ్లో॥ గౌరీపుత్ర నమస్తేస్తు శంకరస్య ప్రియనందన - గృహాణార్ఘ్యం మయాదత్తం గంధపుష్పాక్షితైర్యుతం ॥
                 ఓం శ్రీ వరసిద్ధి వినాయకాయ నమ: హస్తయో: అర్ఘ్యం సమర్పయామి.
   (కింది విధంగా అంటూ పుష్పముతో గణేషుని పాదాలపై నీళ్ళు చల్లాలి).
పాద్యం -  శ్లో॥ గజవక్త్ర నమస్తేస్తు సర్వాభీష్టప్రదాయక - భక్త్యాపాద్యం మయాదత్తం గృహాణ ద్విరదానన ॥
    ఓం శ్రీ వరసిద్ధ్ది వినాయకాయ నమ: పాదయో పాద్యం సమర్పయామి.
    (కింది విధంగా అంటూ పువ్వుతో నీరు చల్లాలి).
ఆచమనీయం  - శ్లో॥ అనాధనాధ సర్వజ్ఞ గీర్వాణ గణపూజిత - గృహణాచమనం దేవ తుభ్యం దత్తం మయాప్రభో॥
           ఓం శ్రీ వరసిద్ధి వినాయకాయ నమ: ముఖే: శుద్ధ ఆచమనీయం సమర్పయామి.
   (కింది విధంగా అంటూ ఆవు పాలు, పెరుగు, నెయ్యిలతో కూడిన మధుపర్కము ఉంచవలెను).
మధుపర్కం -  శ్లో॥ దధిక్షీరసమాయుక్తం మధ్వాజ్యేన సమన్వితమ్‌  మధుపర్కం గృహాణేదం గజవక్త్ర నమోస్తుతే ॥
       ఓం శ్రీ వరసిద్ధి వినాయకాయ నమ: మధుపర్కం సమర్పయామి.
   (కింది విధంగా అంటూ పుష్పముతో స్వామిపై పంచామృతాలు చల్లవలెను).
పంచామృత స్నానం -  శ్లో॥ స్నానం పంచామృత్తెర్దేవ గృహాణ గణనాయక - అనాధనాధ సర్వజ్ఞ గీర్వాణగణ పూజిత ॥
    శ్రీ వరసిద్ధి వినాయకాయ నమ: పంచామృత స్నానం సమర్పయామి.
    (ఈ కింది విధంగా అంటూ పుష్పంతో నీటిని రెండుసార్లు స్వామిపై చల్లాలి).
శుద్ధోదక స్నానం -  శ్లో॥ గంగాది సర్వతీర్ధేభ్యై: అహృతై: అమలైర్జలై: స్నానం కురుష్వ భగవన్నుమాపుత్ర నమోస్తుతే॥
 ఓం శ్రీ వరసిద్ధి వినాయకాయ నమ: శుద్ధోదక స్నానం సమర్పయామి. స్నానానంతరం పున: శుద్ధాచమనీయం సమర్పయామి.
(కింది విధంగా అంటూ కొంచెం దూది పల్చగా చేసి స్వామిపై వెయ్యాలి).
వస్త్రం  -  శ్లో॥ రక్తవస్త్రద్వయం చారు దేవయోగ్యంచ మంగళం - శుభప్రద గృహాణత్వం, లమ్బోదర హారాత్మజ॥
  శ్రీ వరసిద్ది వినాయకాయ నమ: వస్త్రయుగ్మం సమర్పయామి.
(కింది విధంగా అంటూ దూదితో చేసిన యజ్ఞోపవీతాన్ని స్వామికి వెయ్యాలి).
యజ్ఞోపవీతం -  శ్లో॥ రాజితం బ్రహ్మ సూత్రంచ కాంచనం చోత్తరీయకం - గృహాణ దేవ సర్వజ్ఞభక్తానామిష్ట దాయక॥
            ఓం శ్రీ వరసిద్ధి వినాయకాయ నమ: యజ్ఞోపవీతం సమర్పయామి).
(కింది విధంగా అంటూ పువ్వుతో గంధాన్ని స్వామిపై వెయ్యాలి).
గంధం-  శ్లో॥ చందనాగరు కర్పూర కస్తూరీ కుంకుమాన్వితమ్‌ విలేపనం సురశ్రేష్టం ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం॥
                    శ్రీ వరసిద్ధి వినాయకాయ నమ: దివ్య శ్రీ చందనం సమర్పయామి
(కింది విధంగా అంటూ అక్షింతలు స్వామిపై వెయ్యాలి).
అక్షింతలు -  శ్లో॥ అక్షతాన్‌ ధవళాన్‌ దివ్యాన్‌ శాలీయాన్‌ తండులాన్‌ శుభాన్‌ గృహాణ పరమానంద శంభుపుత్ర నమోస్తుతే॥
ఓం శ్రీ వరసిద్ధి వినాయకాయ నమ: అలంకరణార్థం హరిద్రాక్షతాన్‌ సమర్పయామి.
(కింది విధంగా అంటూ పుష్పాలు స్వామిపై వెయ్యాలి).
పుష్పములు -  శ్లో॥ సుగంధాని సుపుష్పాణీ జాజీకుంద ముఖానిచ - ఏకవింశతి పత్రాణి సంగృహాణ నమోస్తుతే॥
    ఓం శ్రీ వరసిద్ధి వినాయకాయ నమ: పుష్పం సమర్పయామి

అథాంగ పూజ 

(కింది నామాలు చదువుతూ పత్ర, పుష్పాదులతో 
స్వామి వారిని అర్చించవలెను).
ఓం గణేశాయ నమ: - పాదౌ పూజయామి  
ఓం ఏకదంతాయ నమ: - గుల్పౌ పూజయామి  
ఓం శూర్పకర్ణాయ నమ: - జానునీ పూజయామి  
ఓం విఘ్నరాజాయ నమ: - జంఘే పూజయామి  
ఓం అఖువాహనాయ నమ: - ఊరూ పూజయామి  
ఓం హేరంబాయ నమ: - కటిం పూజయామి  
ఓం లంబోదరాయ నమ: - ఉదరం పూజయామి  
ఓం గణనాధాయ నమ: - నాభిం పూజయామి  
ఓం గణేశాయ నమ: - హృదయం పూజయామి  
ఓం స్థూలకంఠాయ నమ: - కంఠం పూజయామి  
ఓం స్కందాగ్రజాయ నమ: - స్కందౌ పూజయామి  
ఓం పాశహస్తాయ నమ: - హస్తౌ  పూజయామి  
ఓం గజవక్త్రాయ నమ: - వక్త్రం పూజయామి  
ఓం విఘ్నహంత్రే నమ: - నేత్రే పూజయామి  
ఓం శూర్పకర్ణాయ నమ: - కర్ణౌ పూజయామి  
ఓం ఫాలచంద్రాయ నమ: - లలాటం పూజయామి  
ఓం సర్వేశ్వరాయ నమ: - శిర: పూజయామి  
ఓం శ్రీ వరసిద్ధి వినాయకాయ నమ: - సర్వాణ్యంగాని పూజయామి  
తరువాత వినాయక అష్టోత్తర శతనామావళి, షోడశ నామావళి చదువుతూ పూలతో స్వామిని అర్చించాలి.

అథైక వింశతి పత్రపూజ 

ఓం సుముఖాయ నమ: - మాచీ పత్రం పూజయామి ॥  
ఓం గణాధిపాయ నమ: - బృహతీ పత్రం పూజయామి॥  
ఓం ఉమా పుత్రాయ నమ: - బిల్వ పత్రం పూజయామి॥  
ఓం గజాననాయ నమ: - దుర్వారయుగ్మం పూజయామి॥  
ఓం హరసూనవే నమ: - దత్తూర పత్రం పూజయామి॥  
ఓం లంబోదరాయ నమ: - బదరీ పత్రం పూజయామి॥  
ఓం గుహాగ్రజాయ నమ: - అపామార్గ పత్రం పూజయామి॥  
ఓం గజకర్ణకాయ నమ: - తులసీ పత్రం పూజయామి॥  
ఓం ఏకదంతాయ నమ: - చూత పత్రం పూజయామి॥  
ఓం వికటాయ నమ: - కరవీర పత్రం పూజయామి॥  
ఓం భిన్న దంతాయ నమ: - విష్ణుక్రాంత పత్రం పూజయామి॥
ఓం వటవే నమ: - దాడిమీ పత్రం పూజయామి॥  
ఓం సర్వేశ్వరాయ నమ: - దేవదారు పత్రం పూజయామి॥  
ఓం ఫాలచంద్రాయ నమ: - మరువక పత్రం పూజయామి॥  
ఓం హేరంబాయ నమ: - సింధువార పత్రం పూజయామి॥  
ఓం శూర్పకర్ణాయ నమ: - జాజీ పత్రం పూజయామి॥  
ఓం సూరాగ్రజాయ నమ: - గండకీ పత్రం పూజయామి॥  
ఓం లిభవక్త్రా నమ: - శమీ పత్రం పూజయామి॥  
ఓం వినాయకాయ నమ: - అశ్వత్థ పత్రం పూజయామి॥  
ఓం సుర సేవితాయ నమ: - అర్జున పత్రం పూజయామి॥  
ఓం కపిలాయ నమ: - అర్క పత్రం పూజయామి॥  
ఓం శ్రీ గణేశ్వరాయ నమ: - ఏకవింశతి పత్రం పూజయామి॥
(మిగిలిన మొత్తం ఆకులనూ స్వామికి సమర్పించాలి).

 విఘ్నేశ్వరుని వ్రతకథ 

ఒకరోవిఘ్నేశ్వరుని నామాలలో ‘స్థూలకాయుడు’ అని ఉంది. అతడు చిన్న బిడ్డ. బిడ్డలు స్థూలంగా వుంటేనే ముద్దుగా వుంటారు. గణేశుని తల విఘ్నాలను తొలగించేది. చిన్నకండ్లు సూక్ష్మదృష్టిని సూచిస్తాయి. ఏనుగు లాంటి తొండము స్వాభిమానాన్ని తెలుపుతుంది. పెద్ద చెవులు ప్రతీ చిన్న విషయాన్ని సమానంగా వినాలి. దంతాలు ఎవరికే విధమైన హాని చేయరాదు. నాలుకతో ఆ పరిశీలనకు, పెద్ద ఉదరము జ్ఞానాన్ని జీర్ణించుకునేందుకు చిహ్నాలు. నాలుగు చేతులు ధర్మ, అరకకధ, కామ, మోక్షాలను సాధించుటకు మార్గాలు.
జు ధర్మరాజుతో శౌనకాది మహామునులందరూ కలిసి సూతుడి దగ్గరికి వెళ్ళి సత్సంగ కాలక్షేపము చేయతలిచారు. అపుడు సూతుడు మిగతా మునులతో ‘నేను ఈ రోజు మీకు వినాయకుని పుట్టుక, చవితి రోజున చంద్రుణ్ని దర్శిస్తే కలిగే దోషం, దాని నివారణోపాయములు వివరిస్తాను’ అని చెప్పడం మొదలు పెట్టాడు. 
 పూర్వం గజాసురుడు అనే రాక్షసుడు పరమశివున్ని గురించి ఘోర తపస్సు చేశాడు. అతని తపస్సుకు మెచ్చిన శివుడు ‘గజాసురా! నీకేమి వరము కావలెనో కోరుకో’ అని అనెను. అంత గజాసురుడు ‘స్వామీ! ఇక నుంచి మీరు నా ఉదరంలో  నివాసము ఉండాలని’ కోరెను. భక్తుల కోర్కెను మన్నించి భోళా శంకరుడు వెంటనే గజాసురుని ఉదరంలోకి ప్రవేశించి నివాసముండసాగెను. 
కైలాసములో పార్వతీదేవి తన భర్త ఎటు వెళ్ళాడో తెలియక అనేకచోట్ల వెతకడం మొదలు పెట్టెను. కొంత కాలానికి తన పతి గజాసురుడనే రాక్షసుని ఉదరంలో ఉన్నాడని తెలుసుకొని బాధపడెను. విష్ణుమూర్తిని ప్రార్థించి, జరిగినదంతా చెప్పి ‘ఓ మహానుభావా! పూర్వం భస్మాసురుడి బారి నుండి నా భర్తను రక్షించావు. ఇప్పుడు కూడా అలాగే తగు ఉపాయముతో రక్షించమని’ కోరింది. అంత శ్రీహరి పార్వతీ దేవిని అనునయించి నేనున్నానని అభయమిచ్చెను. అప్పుడు విష్ణువు ... శివుని వాహనమైన నందిని గంగిరెద్దుగా అలంకరించాడు. బ్రహ్మాది దేవతలు తలొక వాద్యములు పట్టుకోగా శ్రీహరి చిరుగంటలు, సన్నాయి పట్టుకొని మేళగాని వేషంలో గజాసుర సంహారానికి అతని రాజ్యములోకి ప్రవేశించారు. గజాసురుడు  భవనం ఎదుట బ్రహ్మాది దేవతలు వాద్యముల విశేషమునకు తోడు శ్రీహరి చిత్ర విచిత్రములుగా గంగిరెద్దును ఆడించెను. పరమానంద భరితుడైన గజాసురుడు ‘మీకేమి కావాలో కోరుకోండి’ అని అనెను. ‘ఓ రాజా! ఇది శివుని వాహనమైన నంది. శివుడిని కనుగొనడానికి వచ్చెను. కావున, శివుని మాకివ్వుము’ అని శ్రీహరి పలికెను. తనకు ఇక మరణమే శరణ్యమని నిర్ధారణకు వచ్చిన గజాసురుడు తన గర్భములో ఉన్న శివుడిని ‘నా శిరస్సుకు త్రిలోకములలో పూజలు జరిగేలా చేసి తన చర్మమును నీవు ధరించవలెనని’ ప్రార్థించెను. భోళా శంకరుడు ‘సరేనని’ వరమునిచ్చెను. అంత శ్రీహరి అనుమతితో నంది గజాసురుని తన కొమ్ములతో సంహరించెను. అపుడు శివుడు ఆ అసురుని ఉదరము నుండి బయటకు వచ్చి విష్ణుమూర్తిని స్తుతించెను. శివుడు నందిని అధిరోహించి కైలాసముకు వెళ్ళెను. 
వినాయకుని జననం: కైలాసములో ఉన్న పార్వతి దేవతలవల్ల తన భర్త వస్తున్నాడని విని సంతోషించి అభ్యంగన స్నానం చేసి తన శరీరము నుండి వచ్చిన నలుగు పిండితో ఒక బాలుణ్ని తయారు చేసి ప్రాణము పోసి, ద్వారము దగ్గర కాపలాగా ఉంచెను. అంత పరమేశ్వరుడు నందిని అధిరోహించి వచ్చి లోపలికి వెళ్లుచుండగా ద్వారం దగ్గర ఉన్న బాలుడు అడ్డగించెను. దీనితో కోపావేశుడైన శివుడు తన త్రిశూలముతో ఆ బాలుని కంఠము తెంచి లోపలికి వెళ్ళెను. పార్వతి లోపలికి వచ్చిన శివుని పూజించెను. బాలుడి కంఠం తెంచిన విషయం తెలిసి పార్వతి శోకించెను. పార్వతిని ఊరడించిన శివుడు గజాసురుని తలను ఆ బాలుడికి అతికించి ప్రాణము పోసి ‘గజాననుడనే’ పేరు పెట్టి అల్లారుముద్దుగా పెంచుకొనసాగిరి.
విఘ్నేశాధిపత్యం: ఒకరోజు దేవతలు, మునులు పరమశివుణ్ని సేవించి, విఘ్నములకు అధిపతిగా ఒకరిని నియమించమని అడిగెను. అపుడు శివుడు గజాననుడు, కుమారస్వామి ఇద్దరినీ పిలిచి ‘మీలో ఎవరు ముందుగా ముల్లోకములలోని నదులన్నిటిలో స్నానం చేసి నా దగ్గరకు వస్తారో వారికి ఈ ఆధిపత్యం ఇస్తానని’ చెప్పెను. ఇది వినగానే కుమారస్వామి తన వాహనమైన నెమలి మీద ఎక్కి వాయువేగంతో వెళ్ళెను. అక్కడే ఉన్న గజాననుడు తండ్రి దగ్గరకు వెళ్ళి వినమ్రంగా నమస్కరించి ‘తండ్రీ! నా అసమర్థత తెలిసి కూడా మీరు ఇట్లాంటి పరీక్ష పెట్టుట తగునా’ అని ‘తగిన ఉపాయము చెప్పమని’ ప్రార్థించెను. అంత శివుడు కరుణతో ‘వత్సా! ఒక్కసారి నారాయణ మంత్రాన్ని పఠించినవారు మూడువందల కల్పాల కాలం పుణ్యనదులలో స్నానమాచరించిన ఫలం పొందుతారని’ చెప్పి పుత్రునకు ఆ మంత్రం ఉపదేశించెను. గజాననుడు తన తండ్రి ఉపదేశించిన మంత్రమును భక్తితో పఠిస్తూ కైలాసములోనే ఉండెను. 
నారాయణ మంత్ర ప్రభావముతో కుమారస్వామి ఏ నదిలో స్నానమాచరించుటకు వెళ్ళినా తన కంటే ముందుగా గజాననుడు అక్కడ ఉండటాన్ని గమనిస్తాడు. కుమారస్వామి ఆశ్చర్యపడి కైలాసములో శివుని పక్కనే ఉన్న గజాననునికి నమస్కరించి తన తప్పును తెలుసుకొని ‘ఈ ఆధిపత్యము తన అన్నగారికే ఇమ్మని’ తండ్రిని కోరెను. 
అంత పరమేశ్వరుడు ‘భాద్రపద శుద్ధ చవితి’ నాడు గజాననునికి విఘ్నాధిపత్యం ఇచ్చెను. దీంతో విఘ్నేశ్వరుడికి భక్తులు కుడుములు, ఉండ్రాళ్ళు మొదలైనవి నైవేద్యంగా పెట్టగా వాటిని సంతోషంగా తిని, కొన్ని తన వాహనమునకు పెట్టి, మిగతా వాటిని చేతిలో పెట్టుకుని భుక్తాయాసంతో సాయంకాల సమయమున తిరిగి కైలాసమునకు చేరుకొనెను. అక్కడే ఉన్న తల్లిదండ్రులకు నమస్కరించ తలచి సాష్టాంగ నమస్కారం చేయడానికి ప్రయత్నించగా తాను ఎక్కువగా ఆరగించడం వల్ల వంగడానికి తన శరీరము సహకరించక పోవడంతో ఇబ్బంది పడతాడు. అది చూసి శివుని శిరస్సు మీద ఉన్న చంద్రుడు వికటముగా నవ్వెను. అంత ‘రాజదృష్టి సోకితే రాయి అయినా పగులును’ అనే సామెత నిజమగునట్టు గజాననుడి పొట్ట పగిలి అందులో ఉన్న కుడుములు ఆ ప్రదేశం మొత్తం దొర్లి గణేషుడు చనిపోయాడు. అపుడు పార్వతి పుత్రుని మరణము చూసి తట్టుకొనలేక ‘నీ దృష్టి వల్ల నా కుమారుడు మరణించినాడు. కావున, ఇకపై నిన్ను చూసిన వారు పాపాత్ములై నీలాపనిందలు పొందుదురుగాక’ అని శపించెను. బ్రహ్మాది దేవతలు కైలాసానికి వెళ్ళి ఉమామహేశ్వరులను సేవించి, మృతుడై పడి ఉన్న గణేశున్ని బతికించారు. చంద్రునికిచ్చిన శాపమును ఉపసంహరింపమని ప్రార్థించెను. అంత పార్వతి గణేశున్ని ముద్దాడి వినాయక చవితి నాడు తప్ప.. మిగతా రోజులలో చంద్రుణ్ని చూసినా ఏమీ కాదు అని శాప విమోచనం చెప్పెను.
శమంతకమణి కథ: ద్వాపర యుగమున ఒకనాడు ద్వారకాధీశుడైన శ్రీకృష్ణుని చూడటానికై నారదుడు వచ్చి దర్శించి, మాట్లాడుకొనుచుండగా సాయంత్రము అయ్యెను. అంత కృష్ణుడు గోశాలకు వెళ్ళి పాలు పితుకుతూ పాలలో చంద్రుని ప్రతిబింబము చూసి, ‘ఆహా నా కెట్టి అపనింద రానున్నదో కదా’ అని చింతించెను.
కొన్నాళ్ళకు యదువంశ రాజు సత్రాజిత్తు సూర్యుని ఉపాసించి శమంతకమణి అనే పేరు గల అద్భుతమైన మణిని సంపాదించి, ద్వారకా నగరంలోని శ్రీకృష్ణుణ్ని సందర్శిస్తాడు. అతన్ని శ్రీకృష్ణుడు సాదరంగా ఆహ్వానించి మర్యాద చేసి, ‘ఈ మణిని మన రాజుకు ఇమ్మని’ అడిగెను. అంత సత్రాజిత్తు ‘ఈ మణిని నేనెవ్వరికీ ఇవ్వనని’ తిరస్కరించాడు. దీనితో కృష్ణుడు ‘సరే నీ ఇష్టం’ అని ఊరుకున్నాడు. ఇలా కొన్ని రోజులు గడవగా ఒక రోజు సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడు శమంతకమణిని మెడలో ధరించి అడవికి వేటకు వెళ్ళగా, ఒక సింహం మెడలోని ఆ మణిని చూసి ‘మాంసపు ముద్ద’ అని భ్రమపడి అతనిని చంపి, మణిని నోట కరుచుకుని పోవుచుండగా, ఒక మగ ఎలుగుబంటి (జాంబవంతుడు) ఆ సింహముతో పోరాడి ఆ మణిని తీసుకొని కొండగుహలోని తొట్టెలో ఆడుకుంటున్న తన కూతురైన జాంబవతికి ఆట వస్తువుగా ఇచ్చెను.
మరునాడు సత్రాజిత్తు తమ్ముడి మరణవార్త విని కోపంతో ‘ఆ రోజు శ్రీ కృష్ణుడికి మణి ఇవ్వలేదని, ఈ రోజు నా తమ్ముడిని చంపి మణిని తస్కరించాడని’ నగరమంతా చాటింపు వేయించాడు. అది విన్న శ్రీ కృష్ణుడు బాధపడి ‘అయ్యో ఆ రోజు పాలలో చంద్రుని చూసినందుకే కదా ఇటువంటి నీలాపనిందలు’ అని అనుకొని ఈ అభియోగమును తొలగించు కొనుటకు బంధుసమేతుడై అడవికి వెళ్ళి వెతుకుచుండెను. పలుచోట్ల గాలించగా ఒకచోట ప్రసేనుని మృతదేహము, సింహము కాలి జాడలు, ఎలుగుబంటి పాదముల గుర్తులు కనిపించెను. ఆ పాదముల గుర్తులను బట్టి కొంత దూరము వెళ్ళగా ఒక పర్వతగుహ ద్వారము దగ్గర అగి తన పరివారమును అక్కడే ఉండమని చెప్పి శ్రీ కృష్ణుడు లోపలికి వెళ్ళి, అక్కడ బాలిక ఉయ్యాలకు కట్టబడి ఉన్న మణిని చూసి తీసుకు వెళ్ళడానికి ప్రయత్నించెను. అంత కోపావేశుడైన ఆ బాలిక తండ్రి జాంబవంతుడు శ్రీ కృష్ణునిపై పడి గోళ్ళతో గిచ్చి, కోరలతో రక్కి అరుస్తూ కృష్ణుణ్ని చంపడానికి ప్రయత్నించెను. అంత వాసుదేవుడు అతన్ని పడద్రోచి చెట్లతోనూ, రాళ్ళతోనూ, చివరికి ముష్టి ఘాతాలతోనూ ఇరవై ఎనిమిది రోజులు రాత్రీ, పగలూ యుద్ధం చేస్తారు. దీనితో జాంబవంతుడు అలసి, క్షీణించి దేహమంతా దెబ్బలతో తనతో ఇట్లా యుద్ధము చేసి తన బలమంతా హరించిన మహా పురుషుడు త్రేతాయుగమున రావణ సంహారి అయిన శ్రీరామచంద్రుడుగా భావించి నమస్కరించి ‘దేవదేవా! భక్త జనపాలకా!’ నీవు అలనాడు రావణాది రాక్షస సంహారములకై అవతరించిన శ్రీరామచంద్రునిగా నేను గుర్తించాను. అపుడు నీవు నా మీద ప్రేమతో వరము కోరుకొమ్మని అడగగా, నేను బుద్ధి మాంద్యముతో మీతో ద్వంద్వ యుద్ధము చేయవలననే వరము కోరుకుంటిని. అప్పటి నుండి మీ నామస్మరణ చేస్తూ కాలం గడుపుతున్నాను. ఇంత కాలానికి నా కోరికను తీర్చినారు’ అని పలికెను. కృష్ణుడు జాంబవంతుడికి జరిగిన వృత్తాంతము అంతా చెప్పి మణిని ఇమ్మని కోరగా ‘స్వామీ! ఈ మణితో పాటు నా పుత్రికను కూడా స్వీకరించి నన్ను ధన్యుణ్ణి చెయ్యమని’ కోరెను. దీనికి శ్రీకృష్ణుడు అంగీకరించి మణితోపాటు జాంబవతిని కూడా తీసుకుని గుహ బయట తన కోసం ఎదురుచూస్తున్న పరివారమునకు జరిగింది వివరించి సత్రాజిత్తు దగ్గరికి వెళ్ళి ఈ వృత్తాంతమంతా చెప్పగా, అంత సత్రాజిత్తు ‘అయ్యో తమరిపై నేను తీవ్ర అభియోగము మోపానని’ బాధపడి మణితోపాటు తన కుమార్తె అయిన సత్యభామను కూడా స్వీకరించమని కోరెను. అంత శ్రీకృష్ణుడు ‘మణి నా కొద్దని’ ఒక శుభముహూర్తమున జాంబవతీ, సత్యభామలిద్దరినీ వివాహమాడెను. ఈ వివాహమునకు వచ్చిన దేవతలు, మునులు శ్రీకృష్ణుణ్ణి స్తుతించి ‘స్వామీ! మీరు తగిన సమర్థులు కనుక మీ మీద వచ్చిన అపనిందను పోగొట్టుకోగలిగారు. మరి, మాలాంటి సామాన్యుల గతి ఏమని’ ప్రార్థించగా, శ్రీ కృష్ణుడు దయాహృదయుడై ‘ఎవరైతే భాద్రపద శుద్ధ చతుర్థి నాడు యాథావిథిగా వినాయకుని పూజించి ఈ శమంతకమణి కథను చదివినగానీ, వినిన గానీ అక్షింతలు తలపై చల్లుకుంటారో వారికి చంద్రుణ్ని చూసిననూ ఎటువంటి ప్రమాదము ఉండదు’ అని చెప్పెను. అంత దేవతలు, మునులు, జనులు సంతోషముతో తమ తమ ఇళ్ళకు చేరి ప్రతీ సంవత్సరము భాద్రపద శుద్ధ చతుర్థి నాడు తమ స్థాయికి తగ్గట్టుగా గణపతిని పూజించి, తాము సుఖముగా జీవించుచుండిరని సూతుడు శౌనకాది మహామునులకు వినిపించి, అక్కడే ఉన్న ధర్మరాజుతో ‘నువ్వు కూడా ఇదే ప్రకారముగా గణపతిని పూజిస్తే తప్పక నీకు జయం కలుగుతుంది. తిరిగి నీ రాజ్యం నీకు దక్కుతుంది’ అని పలికెను.
ఇతది శ్రీ స్కాంద పురాణములోని ఉమామహేశ్వర సంవాదమునందలి వినాయకవ్రత కల్పము.
ఉద్యాపన:
యజ్ఞేన యజ్ఞమయజంత దేవస్తాని
ధర్మాణి ప్రథమాన్యాసన్‌
తేహనాకం మహిమానస్సచంతే
యత్ర పూర్వే సాధ్యాస్సంతి దేవాః
(దేవుని ఈశాన్య దిశగా కొంచెము కదపండి!)
సర్వేజనా సుఖినో భవంతు...
ఓం శాంతిః ఓం శాంతిః ఓం శాంతిః


logo