గురువారం 24 సెప్టెంబర్ 2020
Devotional - Aug 22, 2020 , 00:30:10

ఋషిదృష్టితో జ్ఞాన సముపార్జన!

ఋషిదృష్టితో జ్ఞాన సముపార్జన!

మనసే మానవ జీవన కేంద్రం. ‘మనసు స్వతంత్రమా? దేహపదార్థ జనితమా? లేక, పరస్పర ఆశ్రితమా?’ అనే ప్రశ్నలకు వివిధ కోణాల నుంచి ‘ఔను, కాదు’ అనే సమాధానాలు వస్తాయి. మనిషి విషయంలో మనసు స్వీయ నియంత్రణకు, సంస్కరణకు, సంవర్ధనకు గురయ్యే అవకాశం చాలా ఉంటుంది. మానసిక పాటవమూ, కోమలత్వం అన్నవి మన జీవన స్థాయినీ, దిశనూ నిర్దేశించే మౌలిక శక్తులు. మనిషి ప్రముఖంగా అభ్యాస జీవికూడా. కనుక బోధన, సాధన అతని జీవిత క్రమాన్ని ప్రబలంగా ప్రభావితం చేస్తాయి. బోధన జ్ఞాన ప్రసాదమూ, మార్గదర్శనమూ అయితే, సాధన అంతర్గ్రహణమే కాక ఆచరణీయం కూడా! ఈ రెండూ (బోధన, సాధన) ఫలవంతంగా సాగాలంటే పటిష్ఠమైన గురుశిష్య సంబంధం ముఖ్యం.

బోధనా విషయాన్ని గురించిన స్పష్టమైన, విస్తృతమైన అవగాహన గురువుకు ఉండాలి. విద్యార్థికి శాస్ర్తాన్ని సమృద్ధంగా అందించాలన్న నిష్ఠకూడా ఉండాలి. విద్యార్థి నైపుణ్యం, సమర్థతల పట్ల గురువు విశ్వాసాన్ని కలిగి ఉండాలి. ప్రేరణనిచ్చే జీవనశైలి, శిష్యుల పట్ల వాత్సల్యం గురువులో పుష్ఠిగా ఉండాలి. అలాగే, శిష్యునిలోనూ తెలుసుకోవాలన్న జిజ్ఞాస అవసరం. శిష్యులు ప్రపంచ ఆకర్షణల వైపు ఆకర్షితులు కాకూడదు. సరళ జీవనం వైపు మొగ్గు చూపాలి. గురువు పట్ల గౌరవమూ, విశ్వాసం, దీర్ఘకాలిక కృషికి సంసిద్ధత వారు చూపాలి. తన కుటుంబం, సమాజం పట్ల కృతజ్ఞతనూ విద్యార్థి కలిగి ఉండాలి. ఇలాంటి గురుశిష్యుల మధ్య జరిగే విద్యా వ్యవసాయం సఫలం కావడానికి వారిలో ఆరోగ్యంతో పాటు ప్రశాంతమైన వాతావరణమూ ఉండాలి. ఏ ఒత్తిడులూ ఉండకూడదు. ఇందుకు బహు సూక్ష్మమైన భారతీయ ఋషిదృష్టి గురువుకు తప్పనిసరి. 

ఈ నేపథ్యంలోనే గురువులు దిన, పక్ష, మాస, ఋతు కాలచక్ర స్వభావాన్నీ, వివిధ వయసుల మానవ స్వభావంపై వాటి ప్రభావాన్నీ లోతుగా గ్రహించాలి. ఏ వయసు వారు, ఏ సాధన చేస్తున్న వారు, ఎప్పుడు ఏయే పనులు చేయడం వల్ల గరిష్ఠ సాఫల్యత సాధ్యమన్న దానిని ఇది సూచిస్తుంది. మారిన ప్రస్తుత పరిస్థితులలో ఈ సమయ నిబద్ధత ఆచరణయోగ్యం కానట్టు కనిపించినా, ఆ ఆచరణీయత ఇచ్చే విశేష ఫల లబ్ధిని మాత్రం మనం కాదనలేం. ప్రధానంగా నాలుగు అంశాలను గురువు శిష్యునకు (విద్యావ్యవస్థ పిల్లలకు) అందజేయవలసి ఉంటుంది. అవి: 1. ఆరోగ్య పరిరక్షణ , సత్త్వవృద్ధికి కావలసిన మౌలిక విషయాలు, విధానాలు. 2 ప్రకృతి కరుణాత్మక హృదయంతో మనకు అందిస్తున్న సంపద, మన ఉనికిని సమృద్ధపరుస్తున్న విధం, కృతజ్ఞతతో, ఆత్మీయతతో మనం ప్రకృతితో వ్యవహరించవలసిన తీరు. 3 ఎంతో సమర్థంగా అల్లబడిన సామాజిక వ్యవస్థలో మన స్థానం, బాధ్యత తెలుసుకొని, దాని ఋణం తీర్చుకునే విధంలో మనం చూపవలసిన కృతజ్ఞత, దక్షత. 4 జీవితం ఆసాంతం మన ప్రమేయం లేని అనేకానేక శక్తులతో, వ్యక్తులతో, కారకాలతో గణనీయంగా రూపొందుతున్న సత్యాన్ని గ్రహించగలగడం.

ఇలా సముపార్జించిన వస్తు సంపద, నిర్మించుకున్న బంధాల విస్తృతి నిష్క్రమణ సమయంలో వెంటరావని తెలుసుకోవడమూ ప్రతి విద్యార్థికీ ఎంతో ముఖ్యం. ‘అనివార్యమైన మరణం, మరొక కర్మానుగత విస్తృతిలోకి సహజ ద్వారం’ అన్న ఎరుకను ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలి. కనుక, బోధనలో వీటిని మేళవింపజేయడం మన భారతీయ పరిణత సంప్రదాయ సమగ్ర విజ్ఞతకు నిదర్శనం. మతాతీతంగా ప్రతి వ్యక్తినీ సుఖసంపన్నం చేసే మార్గంగా దీనిని అందరూ గుర్తించాలి. ప్రకృతితో, సమాజంతో వ్యవహరించే సమున్నత సంస్కారాన్ని కొత్త తరాలకు నేర్పించే అద్భుత మార్గంగానూ దీన్ని స్వీకరించాలి. ఇది ముందు తరాలకు గొప్ప భవిష్యత్తునూ ఇస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. 


logo