శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Devotional - Aug 19, 2020 , 23:25:17

అసలైన ఐశ్వర్యవంతుడు!

అసలైన ఐశ్వర్యవంతుడు!

‘శ్రీ కైవల్య పదంబు జేరుటకు నై చింతించెదన్‌..’ అని భాగవతాన్ని ఆరంభించిన పోతన మహాకవి ఆశించిన, ప్రబోధించిన ‘ఐశ్వర్యం’ పరమోత్కృష్టమైంది. మానవరూపం ధరించి వచ్చిన ఏ మహితాత్ములకో తప్ప అందరికీ సాధ్యం కాని మహైశ్వర్యమది. ఐహిక భోగభాగ్యాలు, అధికార దర్పాలు, అందచందాలు, శారీరక దారుఢ్యతలు, విద్యా వైదుష్యాలు ఒకటేమిటి.. ఎన్నో, ఎన్నెన్నో ఐశ్వర్యాలుగా భ్రమింపజేసి మనిషిని ఆత్మజ్ఞాన సాధన దిశగా చేరనీయకుండా లాక్కొని పోతుంటాయి. కోరిక లీరికలెత్తే బతుకు పోరాటంలో ఆశలు, ఆశయాల పేరిట పిడికెడంత గుండెలో కడలిని మించిన కల్లోలాలను అవి రేపుతుంటాయి. ‘ఈశ్వరాదిచ్ఛేత్‌ ఐశ్వర్యం’. ‘ఈ లోకంలో లభించే ప్రతిదీ భగవంతుని వరప్రసాదమే..’ అనే భావనతో జీవించే వానికన్నా ఐశ్వర్యవంతుడు మరొకడుండడు.

మహదైశ్వర్యానికి చిహ్నాలైన విజయం, ధనం, ధాన్యం, ధైర్యం, సంతానం, విద్య, ఆరోగ్యం, పాడిపంటలు వంటివన్నీ పొందాలంటే అష్టలక్ష్ముల అనుగ్రహం ఉండాలి. ఇవి లేని వాళ్ళకు ఓటమి, సంతాన హీనత, భార్యా భర్తృ వియోగం, దారిద్య్రం, అవిశ్వాసం, అవిద్య, అనారోగ్యం వంటి అష్ట దరిద్రాలు తప్పవు మరి. ఐశ్వర్యం అంటే భూతి/విభూతి. అదే భగవదత్తమైన అనుగ్రహం, సౌభాగ్యం. ‘పరమాత్మపట్ల అచంచలమైన విశ్వాసం కలిగిన వారికి లభించిన ప్రతి ధర్మఫలితమూ ఈశ్వర దత్తమే’. వీటిని స్వీకరించగలిగిన పారమార్థికునికంటే ఐశ్వర్యవంతుడెవరు? ఈ దృష్టి లేనివాడు ‘పరమ+ఆర్థికుడే’. నిజమైన భక్తుని దృష్టిలో సంపాదనమంటే శ్రేయస్సంపాదనమే. ‘నిధి చాలా సుఖమా రాముని సన్నిధి చాల సుఖమా’ అనలేదా త్యాగయ్య. పురుషార్థాల సాధనలో ద్వితీయమైంది, అద్వితీయమైంది అర్థ సంపాదనమే. ధర్మం వెనువెంటనే వచ్చేది ఇదే.

‘వర్షార్థమష్టౌ ప్రయతేత మాసాన్‌

నిశార్థమర్థం దివసా యతేత

వార్ధక్య హేతోః వయసా నవేన

పరస్య హేతోః ఇహ జన్మనా చ॥

వర్షాలు కురిసే నాలుగు నెలల కోసం సంవత్సరంలో మిగతా ఎనిమిది నెలలు కష్టపడి సంపాదించాలి. రాత్రి సుఖంగా ఉండాలంటే పగలంతా కష్టించి పనిచేయాలి. ముసలితనంలో ఆనందంగా ఉండాలంటే వయసులో ఉండగానే కష్టపడి సంపాదించాలి. పై లోకంలో స్వర్గసుఖాలను పొందాలంటే ఈ లోకంలో ధార్మికంగా జీవించాలి. ఇదీ మన పూర్వీకుల అర్థ సంపాదన ప్రణాళిక. చిన్న చీమలనుండి పెద్ద ఏనుగులదాకా సృష్టిలోని ప్రతి ప్రాణి ఈ విధానాన్నే అవలంబిస్తాయి. 

కానీ, అన్నీ తెలిసిన మనిషి ఇందుకు భిన్నంగా ప్రవర్తిస్తుండటమే విడ్డూరం. రాత్రికి రాత్రే కోటీశ్వరులై పోవాలనే ఆలోచనే సరైంది కాదు. సంపాదన ధర్మమార్గంలోనే సాగాలి. క్రమక్రమంగా ఎదగాలి. స్వీయ సంపాదనను మూడు భాగాలుగా విభజించుకొని కుటుంబసుఖాలకు (సంసార నిర్వహణకు) ఒక భాగం, ధార్మిక కార్యక్రమాలకు మరొక భాగం వెచ్చించాలి. మూడవ భాగాన్ని జాగ్రత్త పరచుకొని వృద్ధి చేసుకోవాలి. తర్వాతి తరానికి అందించాలి. ‘ఆపదుద్ధారే ధనం రక్షేత్‌' అంటున్నది మహాభారతం. కష్టాలు కలిగినప్పుడు ఆదుకోవడానికి కొంత ధనాన్ని దాచుకోవడంలో తప్పేమీ లేదు. కానీ, తరతరాలకు తరగనంత అధికంగా నిధులు దాచుకోవడం మాత్రం తగదు.

‘దత్త భుక్తఫలం ధనం’ అంటే, సంపాదించిన ధనానికి ఫలం. ఒకటి తాను అనుభవించడం, మరొకటి దానం చేయడం. బాగా నిండిన చెరువు మత్తడి దూకినట్లు సంపాదించిన ధనంలో కొంత త్యాగం చేసి తీరాలి. త్యాగం వల్లనే అమృతత్త్వం సిద్ధిస్తుందని చెప్తున్నది ఈశావాస్యం. అయోధ్యలోని రాచరిక ఐశ్వర్యాధిపత్యాలను క్షణంలో వదిలి అరణ్యవాసంలోని దుఃఖ క్లేశాలను ఆనందంగా వరించగలిగిన శ్రీరాముని మించిన ఐశ్వర్యవంతుడు మరొకరుంటారా!? అందుకే, రాముడు ఆదర్శ వర్తనుడు.

మరుమాముల 

దత్తాత్రేయ శర్మ ,94410 39146


logo