శనివారం 26 సెప్టెంబర్ 2020
Devotional - Aug 19, 2020 , 02:34:52

నరకానికి మూడు ద్వారాలు

నరకానికి మూడు ద్వారాలు

స్వర్గ-నరకాల చర్చ మానవులలో అనంతకాలంగా కొనసాగుతూనే ఉన్నది. ఇది కేవలం మన దేశంలోనేగాక ప్రపంచంలోని అన్ని దేశాలు, మతాలు, జాతులు, తెగలలోనూ ఉండటం గమనార్హం. అయితే, వాటి గురించిన పూర్తి వివరాలు తెలియక పోయినా మనిషి కోరుకొనేది స్వర్గాన్నే కాని నరకాన్ని కాదు. దీనికి కారణం, నరకంలో కష్టాలు అనుభవించాల్సి రావటమే. అదే స్వర్గంలో అయితే హాయిగా సుఖాలు ఉంటాయన్నది అందరికీ తెలిసిందే. 

స్వర్గ-నరకాలలో మనుషుల ప్రయాణం దేని వైపునకు అన్నది వారి స్వభావాలనుబట్టి, చేసే కార్యాలనుబట్టి తెలుస్తుందని శాస్ర్తాలు చెబుతున్నాయి. స్వర్గానికి వెళ్లలేకపోయినా, మనిషి కనీసం నరకంలో పడకుండా ఉండేటట్లు ప్రయత్నిస్తే అదే ఎంతో గొప్ప అనుకొంటాడు. అందుకే నరకద్వారాల గురించి ప్రతి ఒక్కరూ విధిగా తెలుసుకోవాలి. ‘ఈ లోకంలోనే నరకానికి మూడు ద్వారాలు ఉన్నాయని’ శ్రీకృష్ణ భగవానుడు ‘భగవద్గీత’లో పునరుద్ఘాటించాడు. ‘కామం, క్రోధం, లోభం.. ఇవి నరక ద్వారాలు. ఇవి ఆత్మకు వినాశనాన్నీ కలిగిస్తాయి. కనుక ప్రతీ బుద్ధిమంతుడు వాటిని తప్పక విడిచిపెట్టాలి’ (భగవద్గీత: 16.21). సాక్షాత్తుగా భగవంతుడే మానవుల సంక్షేమం, శ్రేయస్సుకోసం అతి ముఖ్యమైన ఈ హెచ్చరికను చేశాడు. 

కామం, క్రోధం, లోభం అనేవి సహజ స్వభావాలుగానే కనిపించినా, నిజానికి వాటి గడప తొక్కిన వారు ప్రవేశించేది నేరుగా నరకంలోకే అని అర్థం చేసుకోవాలి. ఈ మూడు ద్వారాలు లేదా వాటిలోని ఏ ఒక్క ద్వారం గుండా వెళ్లినా చివరకు చేరేది అక్కడికే. ‘కామం’ అంటే సాధారణంగా ‘కామవాంఛ’ అనుకొంటారు కానీ, దానికి విస్తృతార్థం ‘కోర్కె’. కామవాంఛకు లోనైన వారు తమ భవిష్యత్తును పణంగా పెడుతున్నట్టుగానే అర్థం చేసుకోవాలి. చక్కని సాంగత్యంతో మానవులు కామవాంఛ నుండి బయటపడ గలుగుతారు. ఏ తోడు (జీవిత భాగస్వామ్యం) లేని కారణంగానే వారు అలా కామవాంఛకు లోనవుతారని పరిశోధనలు చెబుతున్నాయి. 

ఇక, అలవికాని కోపం వల్ల క్రోధం పుడుతుంది. ఎవరైతే కామవాంఛకు అడ్డు వస్తున్నారో వారిమీద క్రోధం ఏర్పడుతుంది. ఆనందానికి అడ్డు వచ్చే వారి అంతు చూడటమే మనిషి క్రోధం వల్ల చేసే పని. క్రోధంతోనే వైరం, కలతలు. అది తీవ్రమైతే హత్యలు వంటివి సైతం జరిగిపోవచ్చు. ఈ పరిణామాలు జీవితాల్ని నరకప్రాయం చేస్తాయి. అందుకే, మనిషి తనకు కోపం రాకుండా చూసుకోవాలి. ‘లోభం’ అంటే ‘అంతా తనకే కావాలనుకోవడం’. ఎవరికీ అందకూడదని అనుకోవడం. దీనివల్ల ప్రేమ, మమకారం, స్నేహం, సాంఘిక జీవనం, బాంధవ్యం వంటివన్నీ మృగ్యమవుతాయి. 

కాబట్టి మానవులు ఈ విషయంలో సావధానులై, గీతోపదేశం చేసే హెచ్చరికను జాగ్రత్తగా గమనించాలి. కామానికి, క్రోధానికి, లోభానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. పెద్దలు, గురువులు, బాధ్యత గలవారంతా తమ తోటివారిని పై మూడు దుర్గుణాల బారిన పడకుండా చూసుకోగలిగితే మంచిది. అప్పుడు జీవితం గండం లేకుండా ప్రశాంతంగా, సుఖమయంగా సాగడమేగాక నరకద్వారంలోకి ప్రవేశించే అవసరం లేకుండా పోతుంది. తత్‌ ఫలితంగా రాబోయే జన్మలూ సుఖమయమవుతాయి. ఈ గీతా సందేశమే సమస్త మానవాళికి అందివచ్చిన ఒక గొప్ప వరంగా భావించాలి. 

డాక్టర్‌ వైష్ణవాంఘ్రి సేవకదాస్‌

98219 14642logo