సోమవారం 21 సెప్టెంబర్ 2020
Devotional - Aug 18, 2020 , 23:06:51

వినాయక పత్రం- ఆరోగ్యదాయకం

వినాయక పత్రం- ఆరోగ్యదాయకం

గణేశ చతుర్థి నాడు వినాయక వ్రతంలో వాడే పత్రాల్లో మారేడు, జాజి, గరిక లాంటివి సులువుగానే దొరుకుతాయి. వీటిని పూజలోనే కాదు.. వివిధ రకాల వ్యాధుల్లో కూడా ఆయుర్వేద వైద్యులు వాడుతారు. వాటిలోని ఔషధ గుణాలేంటో ఇప్పుడు చూద్దాం. 

మరువం ఆకు

ఇది వాత, కఫాలను సమాన స్థాయిలో ఉంచుతుంది. ఈ ఔషధ మొక్క నుంచి తయారుచేయబడిన తైలం కండరాల నొప్పులను, పంటి నొప్పి, తలనొప్పి, కీళ్లనొప్పులను తగ్గిస్తుంది. సుఖనిద్రను కలిగిస్తుంది. ఇది క్రిమిహరంగా కూడా పనిచేస్తుంది. చర్మవ్యాధులకు మంచి మందు. జీర్ణ సంబంధ వ్యాధులను తగ్గిస్తుంది. 

బిల్వ పత్రం (మారేడు ఆకు)

మారేడు ఆకు వాత, పిత్త, కఫాలను (త్రిదోషాలు) సమతుల్యంగా ఉంచుతుంది. ఆయుర్వేదంలో చెప్పిన ‘దశమూలాల’లో ఒకటి. దీనికి యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాన్ని కలిగివుంటుంది. అందువల్ల నొప్పులు, వాపును తగ్గిస్తుంది. స్త్రీ సంబంధ వ్యాధులకు, డీసెంట్రీ, డయేరియాలకు బాగా పనిచేస్తుంది. రక్తంలో గ్లూకోజ్‌ను క్రమబద్ధీకరిస్తుంది. బిల్వ తైలాన్ని చెవి సంబంధిత వ్యాధుల్లో వాడుతారు. జ్వరాన్ని తగ్గిస్తుంది. కీటకజన్య వ్యాధులకు ఉపయోగకరం. 

జాజి పత్రం

ఈ పత్రం త్రిదోషాలను హరిస్తుంది. వీటి లేత ఆకులను నమిలితే దంతశూల (పంటినొప్పి), క్రిమిదంత, నోటిపూతను తగ్గిస్తుంది. జాజి పత్ర కషాయాన్ని పుక్కిళిస్తే చిగుళ్ల వాపు, నోటిపూత నుంచి ఉపశమనం కలుగుతుంది. ఈ ఆకుల తైలం కర్ణశూలను (చెవిపోటు) హరిస్తుంది. ఈ పత్రాన్ని మెత్తగా నూరి, ఆ లేపనాన్ని గజ్జి, తామర వంటి వ్యాధులకు ఉపయోగిస్తే మంచి ఫలితం ఉంటుంది. దురదలను కూడా తగ్గిస్తుంది. పత్ర తైలం వ్రణాలను మాన్పుతుంది. కండ్ల కలక, జ్వరం, దాహాలను హరిస్తుంది. జాజి పత్రాలకు యాంటీ బాక్టీరియల్‌, యాంటీ ఫంగల్‌ గుణాలున్నాయని పరిశోధనల్లో తేలింది. ఆయుర్వేద ఔషధమైన ‘జాత్యాదిఘృతం’ తయారీలో ముఖ్య కారకం. వ్రణాలను మాన్పడంలో ఈ ఔషధం బాగా పనిచేస్తుంది. logo