శనివారం 19 సెప్టెంబర్ 2020
Devotional - Aug 18, 2020 , 00:30:11

జగన్మాత స్వరూపిణి భూమి!

 జగన్మాత స్వరూపిణి భూమి!

వేద మహర్షులు భూమిని ఒక దివ్యశక్తిగా దర్శించారు. ‘భూమాత’ అనడం వేద సంస్కృతి నుంచి వచ్చిన భావనే. భూమిని ఒక గ్రహంగానో, జడ పదార్థంగానో గాక మనల్ని పోషిస్తూ మన ఉనికికి ఆధారభూతమైన, చైతన్యవంతమైన ఒక మాతృస్వరూపంగా ఆరాధించాలి. ‘ఉపసర్ప మాతరం భూమిం’ అన్నది ఋగ్వేదం. ‘నమో మాత్రే పృథివ్యః’ అన్నది యజుర్వేదం. అంటే, తల్లి భూమికి నమస్కారం. ‘వందేమాతరం’ అనే భావానికి మూలం వేదాల్లో కనిపిస్తుంది. ఆ ఋషి మంత్రమే ఒక ఉద్యమమై మన దేశానికి స్వాతంత్య్రాన్ని తెచ్చి పెట్టిందన్నా అతిశయోక్తికాదు.

నాట్యం చేసే ముందు నర్తకులు ‘పాదఘాతం క్షమస్వమే’ అంటూ భూమికి నమస్కరిస్తారు. భూమి పైకి కనిపిస్తుంది. కానీ, దానిలోని శక్తి మనకు కనిపించదు. ఆ శక్తియే అమ్మవారు. అది ఋషి ప్రోక్తం. అంటే, ఋషి సమాధినుండి వినబడిన భగవత్‌ వాక్యం. అందుకే, వేదమంత్రాలు పరమ సత్యాలు. ‘అశ్వక్రాంతే, రథక్రాంతే, విష్ణుక్రాంతే వసుంధర’ అన్నాడు ఋషి భూమివైపు చూసి. అమ్మవారి రూపాల్లో ఇదొక రూపం. ‘దేవీ భాగవతం’ భూమాతను జగన్మాత అంశ స్వరూపంగా పేర్కొన్నది. భూమి పేర్లలో ‘వసుంధర’ ఒకటి. శ్రీ వరాహ కల్పంలో బ్రహ్మతో స్తుతింపబడిన శ్రీ వరాహ మూర్తి హిరణ్యాక్షుని చంపి, నీటినుంచి భూమిని పైకెత్తాడు. కొలను నీటిపై కమలం వలె భూమిని నిలిపాడు. సృష్టి సమయంలో నీటిపై జన్మించిన భూమి ప్రళయకాలంలో నీటిలో మునుగుతుంది. అటువంటి ఈ భూమి దుర్గాలు, సముద్రాలు, కొండలు, వనాలు, దీవులతో అలరారుతుంటుంది. 

అందుకే, భూమి నిత్యాధిష్టాన దేవి. మనకు సకల ఐశ్వర్యాలను ప్రసాదించే దేవత వసుమతి. మనం ఇల్లు కట్టుకోవాలంటే కలప, తిండి తినటానికి పంట, వాహనాలు నడుపుకోవడానికి ఇనుము, బొగ్గు, పెట్రోలు.. ఇలా ఎన్నో, ఎన్నెన్నో ఆ తల్లి తన గర్భం నుంచి మనకు ఇస్తుంది. కలిగి ఉండటం వేరు. అనుభవించడం వేరు. కానీ, భూమాత కలిగింది, ఇవ్వగలిగింది కూడా. ‘విశ్వంభర’ అంటే మన కళ్ళకు కనిపించని ఎన్నింటినో ధరించింది అని అర్థం. ‘గోత్రా’ అంటే పర్వతాలను మోసేది. ‘క్షితి’ అంటే ఓర్పు కల్గింది. ‘అవని’ అంటే విష్ణువు అంశ రాజులోకి ప్రవేశించి ధర్మం నిలబడేట్టు చేసేది. ‘అచల’ అంటే, విష్ణుశక్తితో కదలకుండా ఉండేది. ఇది నిజంగా కదిలితే ఐశ్వర్యాలన్నీ పోతాయి. 

భూమిలో ఓషధీ తత్త్వం ఉంది. భూమికి బరువు అన్నది ఉండదు. ‘నేను ఇది మోయలేను’ అని అనదు. పాపాన్ని మాత్రం మోయలేదు. పాపమంటే వేద విరుద్ధమైన జీవనమే. ఆ పాపం పెరుగుతుంటే భూమాత గోమాతగా రూపొంది ఆక్రోషిస్తుంది. ఆ తల్లి ఎదపై కాలు పెట్టకుండా, నడవకుండా ఏ ప్రాణీ బతకలేదు. ఇల్లు కట్టుకోవాలన్నా ఆమె గుండెమీద గునపంతో పెకిలించాలి. మనకు తిండి కావాలన్నా నాగేటి చాలుతో ఒళ్లు కదిలించాలి. అయినా, ఆ తల్లి మనకు అన్నం పెట్టి పోషిస్తుంది. అందుకే, ‘అమ్మా! మాకు వేరే గతి లేదు. మమ్మల్ని క్షమించు’ అని ధ్యానిస్తూ భూమిపై కాలు మోపాలి. ఆ తల్లికి మరో పేరు ‘జ్యా’. అంటే, కోట్లాది కోట్ల కళేబరాలను, మలినాలను తనలో కలుపుకొని కూడా ఏ దుర్వాసన లేకుండా, కలుషితం లేకుండా, శక్తిగా ఉండి, మళ్లీ మళ్లీ జన్మలనిస్తుంది. ఇవన్నీ తలుచుకుంటే మనకు ఆ తల్లిపై అపారమైన భక్తి కలుగుతుంది. అందుకే, అనవసరంగా ఆ తల్లిని బాధించకూడదు. ఆ జగన్మాత స్వరూపానికి నమస్కరించనిదే కాళ్లు కింద పెట్టరాదు. ఇదే భారతీయ దృక్పథం. సనాతన ఋషి దర్శనం. 

వేముగంటి శుక్తిమతి

99081 10937


logo