బుధవారం 23 సెప్టెంబర్ 2020
Devotional - Aug 17, 2020 , 01:59:28

పరశురాముని గొప్పతనం!

పరశురాముని గొప్పతనం!

సప్తర్షులలో ఒకడు జమదగ్ని. ఆయన చిన్న కొడుకే పరశురాముడు. ఆ మహర్షి తల్లి సత్యవతి, తండ్రి ఋచీకుడు. ప్రసేన జిత్తు కుమార్తె రేణుకను పెండ్లాడాడు. రేణుక ఎల్లమ్మ దేవాలయాలలోని ప్రధాన దేవత ఈమెనే. వారికి రమణ్వతుడు, సుసేషణుడు, వసువు, విశ్వావసువు, పరశురాముడు అని ఐదుగురు పుత్రులు కలిగారు. భృగు వంశస్థుడైనందున రాముడు భార్గవరాముడైనాడు. గండ్రగొడ్డలి (పరశువు)ని ఆయుధంగా ధరించినందున పరశురాముడైనాడు.

రోజూ ఆశ్రమ సమీపంలోని నదికి వెళ్లి గృహావసరాలకు కావలసిన నీళ్లు తెచ్చుకొనేది రేణుక. ఒకరోజు ఎప్పటిలాగే నదికి వెళ్లింది రేణుక. ఆ సమయానికి చిత్రరథుడనే గంధర్వరాజు తన భార్యలతో నదిలో జలకాలాడుతూ ఉన్నాడు. ఆ దృశ్యాన్ని చూస్తూ అలానే ఉండిపోయింది రేణుక. ఆమె మనసులో అక్రమమైన కోర్కెలేమీ ఉదయించలేదు. కానీ, ఆ దృశ్యాన్ని చూస్తూ ఆనంద పరవశురాలైంది. అంతే!

పరధ్యానంలో వున్న రేణుక చేతిలోని మృణ్మయ పాత్ర కాస్తా జారి నేలమీది పడి, పగిలిపోయింది. గతంలో కూడా ఒకసారి చేతిలోంచి జారిపడ్డ కుండ ఇలాగే పగిలిపోయింది. అప్పుడామె నదిలోని ఇసుకతో కుండరూపాన్ని చేసి, భర్తను తలచుకోవడంతో కుండ తయారు కాగా, నీళ్లు తీసుకెళ్లింది. ఈసారి కూడా అలాంటి ప్రయత్నమే చేసింది. కానీ, కుండ తయారవలేదు. ఒకటికి రెండుసార్లు విఫలం చెందాక తనలో ఏదో దోషం ప్రవేశించిందని అనుకొన్నది.

‘నది నీటిలో దూకి లయమై పోదామను’కొన్నది. కానీ, ‘ఆత్మహత్య మహాపాపం’ కనుక, భర్త అనుమతి పొంది ప్రాణత్యాగం చేయాలని నిర్ణయించుకొని రిక్తహస్తాలతో వెనుకకు వచ్చింది రేణుక. ఆమె మొహం చూస్తూనే ఏదో పొరపాటు జరిగిందని గ్రహించిన జమదగ్ని ద్యివదృష్టితో జరిగిన విషయాన్ని తెలుసుకొన్నాడు. ‘తనకు తగిన ప్రాయశ్చిత్తాన్ని చెప్పాల్సింది’గా భర్తను కోరింది రేణుక. ‘మరణదండనే ఇందుకు తగిన శిక్ష’ అని నిర్ణయించిన జమదగ్ని, వెంటనే పెద్ద కొడుకు రమణ్వతుడిని పిలిచి, ‘తల్లి తలను నరకమని’ ఆదేశించాడు.

‘మాతృహత్య మహాపాపం. అదీగాక ఆమె ఎటువంటి పాపానికీ ఒడి గట్టలేదని నా నమ్మకం. అందువల్ల ఆవిడను చంపలేను’ అన్నాడతను. రెండవ, మూడవ, నాలుగవ కొడుకులు కూడా అదే సమాధానం చెప్పారు. ఏదో పనిమీద బయటకు వెళ్లిన పరశురాముడు అప్పుడే లోపలికి వస్తున్నాడు. ‘మీ తల్లి తప్పు చేసింది. తల నరికి చంప’మన్నాడు జమదగ్ని. ‘తల్లిని చంపడం పాపకార్యమే. కానీ, తండ్రి ఆజ్ఞ శిరోధార్యం. తండ్రి ఆజ్ఞను పాటించడం వల్ల కలిగే పాపపుణ్యాలు నన్ను తాకవు’ అంటూ, తన గండ్ర గొడ్డలితో తల్లి తలను నరికేశాడు పరశురాముడు.  ‘నా ఆజ్ఞను ధిక్కరించిన నీ నలుగురన్నల తలలనుకూడా నరికి వేయ’మన్నాడు జమదగ్ని. నరికేశాడు పరశురాముడు. 

‘నా ఆజ్ఞలను పాటించి నాకు ఎంతో సంతోషాన్ని కలిగించావు. ఏం వరం కావాలో కోరుకో’మన్నాడు జమదగ్ని. ‘నా కన్న తల్లిని, అన్నయ్యలు నలుగురిని బతికించ’మన్నాడు పరశురాముడు. ‘తెగి పడిన తలలను వారి వారి శరీరాలకు అంటించి పెట్టమని’ చెప్పాడు జమదగ్ని. అలానే చేశాడు పరశురాముడు. కాసేపటికే తల్లి, నలుగురు అన్నలూ లేచి కూర్చున్నారు. ఆనందంతో అందరి పాదాలకు నమస్కరించాడు పరశురాముడు. వారతనిని  లేపి, కౌగిలించుకొన్నారు. జమదగ్ని కూడా సంతోషపడ్డాడు. ఇదీ పరవురాముని గొప్పతనం! 

-వరిగొండ కాంతారావు, 94418 86824


logo