గురువారం 01 అక్టోబర్ 2020
Devotional - Aug 17, 2020 , 01:59:26

కర్ణుని జీవితం ఎందుకలా?

కర్ణుని జీవితం ఎందుకలా?

కర్ణుడు కౌరవుల పక్షాన ఎందుకు చేరవలసి వచ్చింది? ఉత్తములు ఉత్తముల పక్షాన ఉండక పోవడం ధర్మమేనా? -డి.శ్రీనివాస్‌ శర్మ, బెంగళూరు

దానకర్ణుడని కీర్తిప్రతిష్ఠలను సంపాదించుకున్న కర్ణుడు, రాచకూతురు కుంతీదేవికి తొలిచూలిగా జన్మించాడు. విచక్షణా జ్ఞానాన్ని కలిగి మహాభారత కథలో ప్రత్యేక వ్యక్తిత్వాన్ని సంతరించుకున్న ఆ రాధేయుడు, కన్నతల్లి చేసిన ఊహించని తప్పిదం వల్ల ‘అతిరథుడు’ అనే సూతుని పెంపకంలో పెరిగాడు. ఫలితంగా, సూతపుత్రునిగా వెలుగులోకి వచ్చాడు. ప్రారంభం నుండే అతని ఎదుగుదల విభిన్నంగా సాగింది. బాల్యం నుండే ఎంతో వివక్షకు గురికావడంతో, ఎదిగిన కొద్దీ విభిన్నమైన మార్గాన్నే ఎంచుకున్నాడు.

సూతుని ఇంట్లో పెరుగుతున్నప్పటికీ, రాజలక్షణం ఉట్టి పడుతుండే ఈ సూర్యజుడు, ద్రోణాచార్యులవద్ద కురుపాండవులతోపాటు శస్ర్తాస్త్ర విద్యలను నేర్చుకోవడం గమనార్హం. అర్జునునికి సమవుజ్జీగా ఎదగడం మరో అద్భుతం. ఐనా, వివక్షకు పోలేదు. విద్యార్థి దశలో, ఆ గురువు శిక్షణలోనే మొదలైంది. అప్పటినుండే తన విద్యా పాటవాన్నీ, ప్రాభవాన్నీ ప్రదర్శించి, పార్థున్ని గెలిచి తీరాలనీ, అతన్ని మించి పోవాలనే పట్టుదల అతనిలో వేళ్లూనుకొన్నది. రాజవంశంలో పుట్టిన అర్జునునితో పోరాడటానికి సూతపుత్రుడైన ఇతనికి అర్హత లేనట్లైతే, అందరూ చూస్తుండగానే ఇతన్ని ‘అంగరాజ్యానికి పట్టాభిషిక్తున్ని చేసి రాజుని చేస్తానని’ దుర్యోధనుడు సభాముఖంగా చెప్పిన మాటలు కౌమార దశలోనే, అతనిలో ఆత్మస్థయిర్యాన్ని నింపాయి. భీష్మ ద్రోణ కృపాదులెవ్వరినీ లెక్కచేయకుండా, వారి సమక్షంలోనే బహిరంగంగా రాజపదవిని బహుమతిగా ఇచ్చిన ఆ సుయోధనుడూ, అతని అనుచరులే కర్ణునికి ఉత్తములుగా కనిపించారు.

‘శూరుల జన్మంబు సురల జన్మంబును, నేఱుల జన్మంబు నెఱుఁగ నగునె’ (ఆది-6-59). పరాక్రమవంతుల పుట్టుకనూ దేవతలు, నదుల పుట్టు పూర్వోత్తరాలనూ ఎవరైనా అంచనా వేయగలుగుతారా? కులానికి కాకుండా పరాక్రమానికే పెద్దపీట వేయాలనే ఉన్నతమైన భావాలతో ఉన్న ఆ రారాజు పక్షంలోనే అతడు నిలిచాడు. వేద ప్రమాణం, స్మృతులలో చెప్పబడిందీ, సత్పురుషుల నడవడీ, తన ఆత్మకు నచ్చిందీ.. ఈ నాలుగు ధర్మాచరణానికి లక్షణాలు. ఆత్మ న్యూనతను సహింపలేని స్వాభిమాని అయిన కర్ణుడు వీటిలో చివరి ధర్మాన్నే ఎంచుకున్నాడు.

డా॥ శాస్ర్తుల రఘుపతి శర్మ, 94937 10552 


logo