శనివారం 19 సెప్టెంబర్ 2020
Devotional - Aug 15, 2020 , 23:29:18

ధర్మరాజు శోకం తీర్చేదెవరు!

ధర్మరాజు శోకం తీర్చేదెవరు!

మహాభారత సంగ్రామ మారణకాండకు తానే కారణమని కుమిలిపోతున్నాడు కుంతీపుత్రుడు ధర్మరాజు. వేదవ్యాసుడు, కులపురోహితుడు ధౌమ్యుడు మొదలైన వారు ఎన్నో విధాల శోకం మాన్పి వివేకం కల్పించ యత్నించారు. ధర్మరాజు సమాధానపడలేదు. విచిత్రం! వాసుదేవుని బోధ కూడా వ్యర్థమయిందట! అసలు వాసుదేవుని మనసులో ఏముందో వ్యాసాది మహర్షులకు కూడా తెలియదని వ్యాసుడే భాగవతంలో రాసుకున్నాడు.

అజాతశత్రువు (ధర్మరాజు)ను ఆవహించిన అవివేకాన్ని అతిశయింప (విజృంభింప) చేయటమే అచ్యుతుని అభిప్రాయమేమో! ‘కృష్ణేనాద్భుత కర్మణా’- అథోక్షజుని కర్మలు అద్భుతాలు! ఇక్కడ మాధవుని మనసులోని మర్మాలు రెండు- తన సన్నిధిలో తనను సందర్శిస్తూ తనువును త్యజించాలన్న భక్తుడైన శాంతనవుని (భీష్ముని) చిరకాల వాంఛ తీర్చడం, భీష్ముని ద్వారా ధర్మరాజుకు ధర్మబోధ చేయించి ఆయనకు అఖండ ఖ్యాతి (కీర్తి) కలిగించడం. భీష్ముడు గత జన్మలో ‘ద్యౌః’ అనే పేరు కల్గిన ఉత్తమ వసువు. వశిష్ఠమహర్షి శాపం వల్ల గంగా- శంతనులకు ‘దేవవ్రతుడు’గా జన్మించాడు. దేవతల వలె సత్యభాషణాది వ్రతనిష్ఠుడు. అంతర్బాహ్య శత్రువులిద్దరికీ భయంకరుడు కాన భీష్ముడు. ధర్మరాజాదులకు మోక్షాది ధర్మాలను ప్రవచించిన సర్వజ్ఞుడు. క్షాత్రధర్మనిష్ఠుడు, భాగవతుడు. అన్నిటినీ మించి పితృభక్తికి పరాకాష్ఠ, పరమ ఆదర్శం. తండ్రి మనసు గ్రహించి చిన్నవాడైనా తానే పెద్దరికం వహించి, తండ్రి సుఖం కోసం తన రాజ్యాధికార సుఖమే కాక శరీర సుఖం కూడా త్యజించి, ఆయనకు వివాహం జరిపించి తాను యావజ్జీవం అఖండ బ్రహ్మచర్య దీక్షా ప్రతిజ్ఞ బూనిన త్యాగధనుడు భీష్ముడు. తండ్రి చలించిపోయి తనయునికి స్వచ్ఛంద మరణం అనుగ్రహిస్తాడు. ‘భీష్మ ప్రతిజ్ఞ చేశావు దేవవ్రతా!’ అంటూ దేవతలు జయఘోష చేస్తూ పుష్ప వృష్టి కురిపించారు. ఆ క్షణం నుంచి దేవవ్రతుడు భీష్ముడయ్యాడు. చక్రధారి శ్రీకృష్ణుడు కూడా చకితుడై తన శ్రీముఖంతో భీష్ముని భవ్య చరిత్రను భావోద్వేగంతో ఇలా గానం చేశాడు-

ఉ. రాజటె రాగహీనుడటె రాజిత సుందరమూర్తియంటె, వి

భ్రాజిత సంపదున్నతి విభాసిత వర్తనుడంటె, కామినీ

రాజి మనోజ్ఞ భంగి చతురత్వధనుండటె, బ్రహ్మచర్య దీ

క్షాజిత మన్మథుండునటె జన్మములిట్టివి ఎందుగల్గునే!”

తిక్కన చిక్కని పసగలిగిన పద్యముత్యాలలో ఇది ఒకటి. గాంగేయుడు అపర మార్కండేయుడు. రాజర్షి. మరణం ఆ మహాత్మునికి చరణదాసి! ‘జన్మము లిట్టివి ఎందు గల్గునే’- లోకంలో ఇలాంటి ఉదాత్త, ఉత్తమ జన్మలు కూడా ఉంటాయా? ఊహాతీతం కదా!

ధర్మరాజాదులు, దామోదరుడు వెంటరాగా భీష్మదర్శనానికి కురుక్షేత్రం చేరారు. ఆ సంగ్రామ రంగంలో శరతల్పంపై దివి నుంచి భువికి జారిపడిన దేవతవలె ఉన్న దేవవ్రతునికి వినీతులై నమస్కరించారు. పాండవులను చూడగానే పితామహుని కళ్లలో ప్రేమాశ్రువులు పొంగిపొరలాయి. గద్గద స్వరంతో గాంగేయుడు- ‘అయ్యలారా! ధరణీసురులను, ద్వారకాధీశుని, ధర్మాన్ని దిక్కుగా భావించి జీవించే మీకు ఇన్ని దుఃఖ పరంపరలా? ‘ఇట్టి చిత్రకర్మమెందు గలదు’- ఇంతకన్నా వింత ఉన్నదా? మీ తల్లి కుంతికి ఇంతవరకు సుఖమంటే ఏమిటో రవ్వంత కూడా తెలియదే!’ అంటూ సాంత్వన వాక్యాలు పలికాడు. ఈ సందర్భంలో పోతన, తిక్కనగారి పై పద్యాన్ని పోలిన ఒక పద్యాన్ని పాండవులను పరామర్శిస్తూన్న పితామహుని చేతి సానుతాపంగా, సహాశ్చర్యంగా పలికిస్తాడు-

ఉ. రాజట ధర్మజుండు, సురరాజ సుతుండట ధన్వి, శాత్రవో

ద్వేజకమైన గాండివము విల్లట, సారథి సర్వభద్ర సం

యోజకుడైన చక్రియట, యుగ్ర గదాధరుడైన భీముడ

య్యాజికి దోడు వచ్చునట, యాపద గల్గుటిదేమి చోద్యమో!-

‘అజాత శత్రువని పేరు గాంచిన ధర్మపుత్రుడు యుధిష్ఠిరుడు ప్రజాపాలకుడా! జగజ్జెట్టి ఐన ఇంద్రపట్టి వివ్వచ్చుడు- విజయుడు (అర్జునుడు) విలుకాడా! గుండెల్లో గుబులు పుట్టించే గాండీవం విల్లా! ప్రచండ గదాదండ ధారి ఐన భీముడు సంగ్రామంలో సహాయకుడా! అన్నిటిని మించి సర్వసౌభాగ్య సంధాత, సకల శ్రేయోదాత, కాలచక్ర విధాత ఐన శ్రీకృష్ణుడు జీవిత రథసారధిగా కొండంత అండగా ఉన్నా పాండవులకు పరాభవాలు, పాట్లు తప్పలేదంటే ఎంత ఆశ్చర్యం!’ మూలార్థాన్ని ముగ్ధమనోహరంగా, మిన్నగా వెలయించే ఇలాంటి అనువాద పద్యాలు పోతన భాగవతంలో అనేకం. ఈ పద్యంలో ‘అట’ అనే మాట ఆశ్చర్యాన్ని సూచించే అవ్యయం. అది ఐదు మారులు ఆమ్రేడితమై (వచ్చిందే మరల మరల వచ్చి) ప్రాసతో కూడి పద్యం వినసొంపుగా ఉండటమే కాక, ఇన్ని ‘అట’లు- అనగా ఇంతటి సహాయ సంపద, శక్తియుక్తులు ఉన్నాపాండవులకు- ‘ఆపదగల్గుటిదేమి చోద్యమో!’- ఆపదలు, అవమానాలు, అరణ్య అజ్ఞాతవాసాలు, భిక్షాటనలు అనుభవించక తప్పకపోవడం మహా ఆశ్చర్యం కదా! అని ఈ ‘అట’ పంచకం వల్ల కలిగిన అర్థపుష్టి! ఇట్టి రసావిష్కరణకి తిక్కన, పోతన వంటి రససిద్ధ కవీశ్వరులు చేసే ‘శబ్ద బ్రహ్మోపాసన’ ఇది. శబ్ద బ్రహ్మలో పండినవానికే రస (ఆనంద) రూప పరబ్రహ్మానుభవం! కావ్యానందం బ్రహ్మానంద సహోదరం కదా! ‘పలికెడిది భాగవతమట’ అనే పద్యాన్ని స్ఫురణకు తెచ్చే పద్యమిది. తిక్కన పద్యం భక్తుని గురించి భగవంతు పలికినదైతే, పోతన పద్యం భక్తుల గురించి భక్తుడు తెలిపింది.

బాహ్య దృష్టితో చూచి పాండవుల కష్టాలకు కారణం చెప్పడం చాల కష్టం. కాలం అన్నిటికీ మూలం. కాలస్వరూప ఈశ్వరుడు అఘటన ఘటనా సమర్థుడు. అతని మాయలకు మహాత్ములైన విద్వాంసులు కూడా మోహంలో పడి మునిగి తేలుతూ ఉంటారని కృష్ణుని వేలెత్తి చూపాడు కురువంశ కుంజరుడు భీష్ముడు. భక్తవత్సలుడు భగవంతుడు అనన్య భక్తులకు అత్యంత సులభడు. వారికి ఆర్తి కల్గించడం వారి మనస్సులను పూర్తిగా తాను స్వాధీనపరచుకోడానికే! ధర్మజా! భగవంతుడు సర్వులకూ సముడైనా ఏకాంత భక్తుల పట్ల ఆయన కృప నితాంత విలక్షణం! నాకు దర్శనమిద్దామనే వచ్చాడు సుదర్శనుడు. కాని, మీకు మరో కారణం చెప్పి ఉంటాడు. ఆయన భక్త పక్షపాతం అలాంటిది!

తంగిరాల రాజేంద్రప్రసాద శర్మ, 98668 36006 


logo