సోమవారం 21 సెప్టెంబర్ 2020
Devotional - Aug 13, 2020 , 23:44:03

సూర్యోపాసనే గాయత్రి పరమార్థం!

సూర్యోపాసనే గాయత్రి పరమార్థం!

ఓం భూర్భు వస్వః 

ఓం తత్స వితుర్వరేణ్యం 

భర్గో దేవస్య ధీమహి 

ధియోయోనః ప్రచోదయాత్‌

విశ్వవ్యాప్తంగా ప్రశస్తిని పొందిన అతి సనాతన వైదిక మంత్రం గాయత్రి. దీని ‘ద్రష్ట’ (ఋషి) విశ్వామిత్రుడు. ఋషి తాను దర్శించిన దానిని తన వాక్కులతో ప్రకటిస్తాడు. తత్తవేత్తలైన ఋషులు ‘అహం కర్తృత్వ’ భావన లేని మహనీయులు. కనుకే, తాము ఫలానా మంత్రాలకు రచయితలమని ప్రకటించుకొనేవారు కాదు. ఒకప్పుడు ‘గాయత్రీ మంత్రం’ ఉపనయనమైన బ్రాహ్మణులకు మాత్రమే పరిమితమై ఉండేది. బ్రాహ్మణ స్త్రీలకూ దీని ఉచ్ఛారణకు అవకాశం ఉండేది కాదు. అప్పట్లో బ్రాహ్మణేతరులెవరూ ఉపనయనం చేసుకొనేవారు కాదు. కనుక, అందరికీ అది అందుబాటులో ఉండక పోయేది. నిజానికి ఇది మధ్యలో వచ్చిన పోకడ. వైదిక యుగంలో బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులందరూ (స్త్రీలతోసహా) ఉపనయనార్హతను కలిగి ఉండేవారు. కనుక, వారికి వేదాధ్యయన అధికారమూ ఉండేది. దయానంద సరస్వతి పుణ్యమా అని ఇవాళ వేదాధ్యయనం అందరికీ అందుబాటులోకి వచ్చింది. 

గాయత్రి మంత్రానికి చెందిన కొన్ని విషయాలు ఇంకా రహస్యాలుగానే ఉన్నాయి.  ఇది ఛందస్సు గాయత్రి. కనుకే, మంత్ర దేవత పేరు గాయత్రి కాదు. గాయత్రి నాలుగు పాదాలు గల ఛందస్సు. వేద గాయత్రిలో మాత్రం నాలుగుకు బదులు మూడు పాదాలే ఉంటాయి. దీనినే ‘త్రిపద’ అంటారు. ప్రతి పాదానికి 8 చొప్పున మొత్తం 24 అక్షరాలు. ‘చతుర్వింశత్యక్షరా’ అంటారు. దీన్నిబట్టి, గాయత్రి ఆ మంత్రదేవత కాదు, మంత్ర ఛందస్సు మాత్రమేనని వేద విజ్ఞానులు తేల్చారు. మరి, ఈ మంత్రానికి దేవత ఎవరు? అసలు, గాయత్రి మంత్రం ఏమంటున్నది? 

‘యోదేవ స్సవితాస్మాకం ధియోధర్మాది గోచరాః 

యత్తత్‌ ప్రేరయతే భర్గః తద్వరేణ్య ముపాస్మహే’. 

ఇది గాయత్రీ మంత్రార్థంతో కూడిన శ్లోకం. దీని మేరకు మంత్రదేవత ‘సవిత’. ఈ శబ్దం మూల మంత్రంలోనిదే. సవితృ శబ్దం ‘షూ ప్రేరణే’ అనే ధాతువునుంచి ఏర్పడింది కనుక ‘ప్రేరేపించువాడు’ అని వ్యుత్పత్త్యర్థం. ‘సవితారవిః’ అని అమరం దీనికి ‘సూర్యుడు’ అనే అర్థాన్నిచ్చింది. కనుక, ‘సూర్యుడు గాయత్రీ మంత్రదేవత’ అని స్పష్టమవుతున్నది. 

సూర్యుడు ప్రత్యక్ష దైవం కూడా. ఆయనే సర్వజగత్‌ స్థితికి మూలం. ఆయననుంచి లభించే శక్తివల్లే మన జీవనం సాగుతున్నది. ‘సూర్యుని తేజస్సును ధ్యానిస్తున్నాం’ అన్నది ఈ మంత్ర పరమార్థం. సూర్యమండల మధ్యవర్తి నారాయణుడు కనుక, ఈ మంత్రదేవతను శ్రీసూర్యనారాయణునిగానూ భావించవచ్చు. గాయత్రిలోని ‘ధీమహి’ అనే పదం ‘నిరంతర ధ్యానంతో పరమాత్మ తత్తాన్ని తెలుసుకోవాలని’ ప్రబోధిస్తున్నది. సాధకులను జీవన్ముక్తులుగా మార్చే అద్భుత శక్తి ఈ మంత్రరాజానికి ఉన్నది. పరమాత్మ తేజస్సును, శక్తిని వివరించేదే గాయత్రి మంత్రం. ఆ శక్తి ఎవరో కాదు, గాయత్రి మాత. ఈ రకంగా ఇది గాయత్రీ దేవి ఆరాధనగానూ స్థిరపడింది. గాయత్రి వర్ణన ‘దేవీ భాగవతం’లో విపులంగా ఉన్నది. 


ప్రాచార్య 

అమరేశం రాజేశ్వరశర్మ

94407 84614


logo