సోమవారం 21 సెప్టెంబర్ 2020
Devotional - Aug 12, 2020 , 23:33:38

పితృభక్తికి ప్రతిరూపం రామాయణం

పితృభక్తికి ప్రతిరూపం రామాయణం

తండ్రికి, తండ్రిమాటకు అత్యంత ప్రాధాన్యమిచ్చిన దేశం మనది. భారతీయ సంస్కృతితో రామాయణానికి విడదీయరాని అవినాభావ సంబంధమే ఉంది. మన నరనరాన జీర్ణించుకుపోయిన ధర్మాలు రామాయణం కాలం నుంచి స్థిరపడ్డాయి. తండ్రిమాటను ఆజ్ఞగా శిరసావహించి రాముడు ధర్మమూర్తిగా కీర్తి పొందాడు. రాముడే కాదు, శ్రవణ కుమారుడు, అంగదుడు, ఇంద్రజిత్తు, అక్షయ కుమారుల వంటి చాలామంది తమ తండ్రుల సేవలో తరించారు. పున్నామ నరకం నుంచి విముక్తికోసం తల్లిదండ్రులు పుత్ర సంతానం కోరుకుంటారు. అదే స్థాయిలో తల్లిదండ్రులను అనుసరించటం, గౌరవించి ఆదరించటం పుత్రుల కర్తవ్యమని మన వేదాలు, ఉపనిషత్తులు, సనాతన ధర్మాలు ఘోషిస్తున్నాయి.

పితాధర్మః పితాస్వర్గః పితాహి పరమం తీపి పితాప్రీతి హిమాపన్నే స్వర్గాప్రీయతి దేవతాః

తండ్రిని సేవించటం, ఆయనను సుఖింపజేయటం, ధర్మవర్తనుడైన తండ్రిని మారు మాట్లాడకుండా అనుసరించే సంతానానికి సమస్త దేవతలు ప్రసన్నులవుతారు. వృద్ధ తల్లిదండ్రులు ‘జ్ఞానమతి, శాంతవనుల’కు సేవచేస్తూ శ్రవణ కుమారుడు తరించిన వృత్తాంతం తెలిసిందే. అతను అడవిలో తన తల్లిదండ్రులకు తాగునీటి కోసం జలాశయానికి వెళతాడు. నీటిలో బుడగల శబ్దం విన్న దశరథ మహారాజు జంతువుగా భావించి బాణం వేస్తే అది కాస్తా ఆ శ్రవణ కుమారునికి తాకుతుంది. అతను చనిపోయే ముందు ‘రాజా! నేను మరణిస్తే వృద్ధులైన నా తల్లిదండ్రులెలా జీవిస్తారని’ వారిపట్ల అనిర్వచనీయమైన ప్రేమను ప్రకటిస్తాడు. అతని మృతి గురించి తల్లిదండ్రులకు దశరథుడు చెప్పి, ‘తన తప్పిదాన్ని మన్నించమని’ కోరుతాడు. ఐనా, ‘నువ్వు కూడా మా వలె పుత్రశోకంతో మరణిస్తావని’ శపించి ఆ వృద్ధులు తనువు చాలిస్తారు.

దశరథుడు ఇచ్చిన వరాలమాటను కైకేయి చెప్పగానే శ్రీరాముడు తండ్రిమాటకు గౌరవమిస్తాడు. ఆమెను పల్లెత్తు మాటైనా అనడు. దుఃఖిస్తున్న తండ్రిని చూసి.. ‘పితాహి దైవతం తాతా దేవతానామపి స్మృతమ్‌ తథావర్తితు మిచ్ఛామి సహి ధర్మ స్సనాతనః’ అంటాడు. తండ్రిమాటలు వంద శాతం ఆచరిస్తానని అంటాడు. వనవాసానికి సిద్ధమౌతాడు. తల్లిదండ్రులు, గురువులు, తోబుట్టువులను హింసిస్తే మనిషి అనేక జన్మలెత్తి గర్భస్రావాలు, అల్పాయుష్యంతో ప్రాణాలు కోల్పోతాడని ‘గరుడ పురాణం’ చెబుతున్నది. అందుకే, తల్లిదండ్రుల మనసు బాధ పెట్టకూడదని రామాయణంలో ఎన్నో సంఘటనలు నిరూపించాయి. దశరథుని మరణవార్తతో భరతుడు రాముని వద్దకు చేరి విలపిస్తాడు. అంత్యకర్మలన్నీ జరిపిస్తాడు. ‘అయోధ్యను పాలించడానికి’ రమ్మని భరతుడు, అన్నను బతిమాలుతాడు. అప్పుడు ‘మనకు తండ్రిమాట శిరోధార్యమని’ రాముడు తమ్ముళ్ళను ఓదారుస్తాడు.

వేదాలుకూడా దేవఋణం, ఋషిఋణం, పితృఋణం తీర్చుకోవాలని చెపుతున్నాయి. పిల్లలు ఎదిగే వరకు తల్లిదండ్రులు కంటికి రెప్పలా కాపాడుకుంటారు. ఎదిగిన సంతానం రెక్కలు వచ్చిన పక్షులై తల్లిదండ్రులను గాలికి వదిలి వెళ్ళటం, వృద్ధాశ్రమంలో ఉంచడాన్ని ‘రామాయణం’ అంగీకరించదు. భరతుని పితృభక్తిని కూడా రామాయణంలో వాల్మీకి అమితంగా ప్రశంసిస్తాడు. తల్లిదండ్రులను ఆదరించి పూజిస్తే తీర్థయాత్రలు, భూలోక ప్రదక్షిణలు చేసినంత గొప్ప ఫలితం లభిస్తుంది. రాముడు వాలిని బాణంతో కొడతాడు. ఆ తర్వాత తన కొడుకు అంగదుడిని పిలిచి ‘రామునికి సేవ చేయమని’ ఆదేశిస్తాడు. రాముని విజయం కోసం అంగదుడు తండ్రిమాటను పాటిస్తాడు. 

ఇంద్రజిత్తు, అక్షయ కుమారుడు హనుమంతునితో పోరు, రామరావణ యుద్ధం వేళ కూడా తండ్రిని, తండ్రిమాటను గౌరవిస్తూ సేవిస్తారు. సీతమ్మ తనకు రామునితో వివాహం చేసిన తన తండ్రి మాటను నమ్మి, ఆదరించి వనవాసం వేళ రాముడు వారించినప్పడు తండ్రి విలువను రెట్టింపు చేస్తుంది. అందుకే, తల్లి తండ్రిని గౌరవించని, ఆదరించని ఏ సంతానమూ సుఖంగా ఉండలేదు. సత్య, దాన, యజ్ఞాలకంటే తండ్రిసేవ విశిష్టమైనదని రాముడు సీతకు చెప్పినట్లు వాల్మీకి లోకానికి ఉపదేశించాడు.logo