మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Devotional - Aug 11, 2020 , 22:19:15

త్రిగుణాతీతం దైవతత్త్వం!

త్రిగుణాతీతం దైవతత్త్వం!

త్రిగుణాలకు అంటే ‘సత్త్వ రజస్తమో’ గుణాలకు అతీతమైన రూపాన్నే మనం పరతత్త్వంగా లేదా భగవంతునిగా ఆరాధిస్తున్నాం. ఈ జీవకోటిని నడిపించేది అవాఙ్మానస గోచరమైన ఆ దైవతత్త్వమే. మాటలకు అందని మనసుకు చిక్కని త్రిగుణాతీతమైందే ఆ భగవత్‌ స్వరూపం. త్రిగుణాలంటే ‘సత్త్వ రజస్తమో’ గుణాలనే మూడు స్వభావాలు. మానవులలోని ఈ మూడు ప్రకృతుల స్వభావాల ప్రభావాలే వేర్వేరు వ్యక్తిత్వాలుగా క్రమేపీ రూపాంతరం చెందుతూ ఉంటాయి. 

సత్త్వ గుణమనేది ఎప్పుడూ ప్రకాశిస్తూ ఉంటుంది. ఈ ‘సాత్త్విక’ స్వభావంతో ఉన్నవాళ్ళు ఆడిన మాటను జవదాటరు. ఎల్లవేళలా స్వఛ్ఛమైన నడవడికతో ఉంటారు. అందరిపట్ల దయార్ద్ర హృదయంతో ఉండే ఈ లక్షణం సౌఖ్యాన్ని కలిగింప జేస్తుంది. ఇది అందరితో ఆదరింపబడే ఉన్నతమైన ఉత్తమ స్వభావం. ‘తమోగుణం’ మోహమయమైంది. దీనికి అన్నింటి పైన ఆకర్షణను కలిగింపజేసే లక్షణంతోపాటు బద్ధకత్వం కూడా తోడుగా ఉంటుంది. వీరెప్పుడూ అబద్ధాలు చెబుతుంటారు. ఇతరులను బాధపెడుతూ, నిద్దుర మత్తులో బతకడం అనేవి ఇలాంటి వారి అవలక్షణాలు. పిసినారితనం, సంగమాభిలాష వంటివి ‘రజోగుణ’ లక్షణాలు. ఇది కామ, క్రోధాలను ఆశ్రయించుకొని ఉంటుంది. ఈ గుణం కలవారు ఎప్పుడూ ఇతరులకు హాని తలపెడుతూ, బాధపెడుతూ ఉంటారు. అనేక అవలక్షణాలతో ఇది వృద్ధి చెందుతుంటుంది.

‘తేరు శరీరము దానికి

సారథి సత్త్వంబు తురగ చయ 

మింద్రియముల్‌

దారుణ తర బుధ్ధి వ్యా

పారము లొనరంగ గనప పగ్గములధిపా॥’

- మహాభారతం (స్త్రీ పర్వం: 1-57)

శరీరమనే రథానికి ‘సాత్త్విక’ గుణమనేది సారథి పాత్రను పోషిస్తే, జ్ఞానేంద్రియాలు ఆ రథాన్ని లాగే గుఱ్ఱాల పాత్రను కలిగి ఉంటాయి. ఎప్పటికప్పుడు విచక్షణతో ఆలోచించే శక్తి కలిగిన బుధ్ధి (మేధస్సు)తో తీసుకొనే నిర్ణయాలు అనేవి గుఱ్ఱాలను దారిలో పెట్టడానికి ఉపయోగపడే పగ్గాలవలె పనిచేస్తుంటాయి. ఎప్పుడూ ఇష్టానుసారంగా పరుగెత్తడానికి ప్రయత్నించే ఆ కోరికలనే గుఱ్ఱాల ధాటికి లొంగిపోయినవారు సంసారబంధాలలో చిక్కుకొని తనపై తానే నియంత్రణను కోల్పోతారు. వ్యక్తిగతమైన నడవడి, మైత్రి, దయ, ఏకాగ్రత, సహనం అనేవి మానవునిలోని పంచేంద్రియాల కోరికలను జయించడానికి సాధనాలుగా ఉపయోగపడుతుంటాయి. ఈ ఇంద్రియాలను జయించిన వారికి దైవశక్తి కూడా అబ్బుతుంది.

‘ఫలముల యెడ బ్రహ్మార్పణ

కలన పరుండగుచుఁ గార్య కర్మము నడపన్‌

వలయుం దత్త్వ జ్ఞానము

దల కొనినం గర్మ శమము దానై కలుగున్‌’

               - మహాభారతం (శాంతి: 1-69)

మానవుడు తాను చేసే కర్మ ఫలితాలను ఏ మాత్రం ఆశించకుండా దైవానికే సమర్పిస్తుండాలి. పరబ్రహ్మ స్వరూపమైన ఆ దైవానికే అంకితం చేసిన వారికి వారు ఇదివరలో చేసిన పాపాలుకూడా నశించిపోయి తత్త్వజ్ఞానం అలవడుతుంది. అహంకారాన్నీ దానితోపాటు కోరికలనూ విడిచిపెట్టి త్రికరణశుధ్ధిగా సమకస్త ప్రాణికోటి పైన జాలి చూపిస్తుంటే జ్ఞానయోగం అనేది సిద్ధిస్తుంది. ఈ జ్ఞానసిద్ధిని పొందిన వారే త్రిగుణాతీతులుగా దైవస్వరూపులుగా, మహనీయులుగా గౌరవాన్ని, ప్రశంసలను పొందుతుంటారు. ఉత్తమ వ్యక్తిత్వ నిర్మాణానికి తోడ్పడే ఇవన్నీకూడా మహాభారత కథలో కురుక్షేత్ర యుధ్ధం ముగిసిన పిదప, వైరాగ్యానికి లోనైన ధృతరాష్ట్ర- ధర్మజులకు ధైర్యాన్ని నింపడం కోసం చేసిన ప్రయత్నాలు.logo