శనివారం 26 సెప్టెంబర్ 2020
Devotional - Aug 10, 2020 , 01:29:42

‘విష్ణుమాయ’ అంటే ఏమిటి?

‘విష్ణుమాయ’ అంటే ఏమిటి?

కర్మఫలాన్ని అనుభవించడానికే మనం జన్మించామని హిందువులంతా నమ్ముతారు. ‘సంచితం, ప్రారబ్దం, ఆగామి’ పేర్లతో కర్మలను మూడుగా విభజించారు మన పూర్వీకులు. మనం చేసే ప్రతి పనికీ ఒక ఫలితం ఉంటుంది. భౌతికంగా కనిపించే ఫలితాన్ని మనసు అనుభవిస్తుంది. దీనికి సమమైన ఆంతరిక ఫలాన్ని ‘అంతఃకరణం’ అనుభవిస్తుంది. మనం చేసే కర్మకు చెందిన బాహ్యఫలం ఈ దేహాన్ని అలరిస్తే, ఆ కర్మ ఆంతరిక ఫలం (పాపం లేదా పుణ్యం) అంతఃకరణ పేటికలో భద్రమవుతుంది. దేహ త్యాగానంతరం ఆత్మ పయనం అనంతంలో సాగుతుంది. ‘పుట్టినవాడు మరణించడం ఎంత రూఢీనో, మరణించిన వారు మరల జన్మించడమూ అంతే కచ్చితం’ అంటున్నది భగవద్గీత. ఐతే, మనమంతా పుట్టడమే సంస్కారంతో పుడతాం. అది గత జన్మ వాసన. వాసన అంటే జీవాత్మ తాను గతంలో ధరించిన దేహ మాధ్యమంగా నిర్వహించిన కార్యక్రమాలకు చెందిన అనుభవ సారమన్న మాట. ఈ జీవాత్మ గతంలో ఎన్ని వందల, వేల జన్మలను ఎత్తిందో దానికే తెలుసు. 

జీవాత్మ మాతృ దేహధారణ చేసేప్పుడు ఆ నిర్వహణకు కావలసిన పరిమిత పరిజ్ఞానానికి తనను తాను కుదించుకొంటుంది. ఈ కారణంగా పరమాత్మకు తెలిసిన విషయాలు ఈ దేహాన్ని ధరించి ఉన్నంత కాలం జీవాత్మ స్ఫురణకు రావు. అంతఃకరణ పేటికలో ఆత్మ తొలి జన్మనుంచి ఈ జన్మను ఎత్తడానికి ముందున్న జన్మాంతం వరకు రకరకాల దేహాల మాధ్యమంగా చేసిన పాపపుణ్యాలు వేర్వేరు అరలలో భద్రపరచి వుంటాయన్న మాట. ఈ పాపపుణ్యాల సముచ్ఛయాన్ని ‘సంచితం’ అంటారు. ఎత్తబోయే జన్మ రూపాన్ని, ఆయుష్షును అనుసరించి ఆ పేటికలోని పాపపుణ్యాలను ఏయే నిష్పత్తులలో వేటివేటిని అనుభవింపదలచుకొన్నామో వానిని ఎంపిక చేసికొని మన వెంట తెచ్చుకొంటాం. ఆ మేరకు అంతఃకరణ పేటిక ఖాళీ అవుతుంది. అంతఃకరణ పేటిక రెండు అరలూ పూర్తిగా ఖాళీ అయితే, ఎత్తబోయే జన్మలో జాగ్రత్తగా ఉంటే చాలు, మనకు మరు జన్మ లేనట్లే. 

ఈ జన్మలో అనుభవించడానికి మన వెంట తెచ్చుకొన్న ‘సంచిత కర్మ’ పేరే ప్రారబ్దం. మనమే ఇష్టపడి తెచ్చుకొన్నాం కనుక, ప్రారబ్దాన్ని అనుభవింపక తప్పదు. ఇదంతా మన స్వయంకృతమన్న జ్ఞానం ఉండక పోవడం వల్ల మన కష్టసుఖాల బాధ్యత మనది కాదనుకొంటాం. ఇందులోనూ ఒక వికృతి ఉన్నది. సుఖాలను కష్టపడి సంపాదించుకొన్నామని అనుకొంటాం. కష్టాలను ఎవరో మన నెత్తిన పెట్టి వెళ్లారనుకొంటాం. ఈ జన్మలో చేసే పాపపుణ్యాల ఫలితాలు భవిష్యత్తులో మనకు లభిస్తవి కనుక వానిని ‘ఆగామి’ అన్నారు. జన్మరాహిత్యాన్ని పొందాలనుకొనేవారు పాపకార్యాల వైపు పోకుండా పూర్తిగా ధర్మబద్ధంగా జీవించాలి. పుణ్యకార్యాలు చేసేటప్పుడు ‘నాహం కర్తా హరిః’ అన్న ఆలోచనలతో నిండు సమర్పణ భావంతో చేయాలి. 

ప్రారబ్దంలోని పాపఫలం కష్టాలరూపంలో మనలను బాధిస్తుంది. పుణ్యఫలం సుఖాలరూపంలో అలరిస్తుంది. భగవదారాధన కష్టాలతీవ్రతను తగ్గిస్తుంది. ప్రార్థన కష్టాలను తట్టుకొనే ధైర్యాన్నిస్తుంది. సుఖాలను భగవంతుని ప్రసాదంగా భావించి అనుభవించాలి. అప్పుడు వినయాన్ని కోల్పోయి అహంకరిస్తే ‘ఆగామి’లో మన పాపాల చిట్టా పెరిగిపోతుంది. ‘ఆగామి’ కాస్తా ‘సంచితం’గా మారుతుందన్న ఇంగితంతో మనం జీవించాలి. అనుక్షణమూ గుర్తుండాల్సిన ఈ విషయం చిత్రంగా మనకు అసలు జ్ఞాపకమే ఉండదు. దీనికి మన పూర్వులు పెట్టిన అందమైన పేరే ‘విష్ణుమాయ’!


logo