ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Devotional - Aug 10, 2020 , 00:09:33

అఖిలం మధురం!

అఖిలం మధురం!

‘శ్రీకృష్ణుడంటే లోకంలో ఇంతటి ప్రత్యేక ఆకర్షణ ఎందుకు?’- ‘భగవంతుడు’ అంటే సర్వాకర్షకుడని మనందరికీ తెలుసు. సమస్త విశ్వాన్నీ అతడు ఆకర్షించగలడు. అందుకే, ఆ స్వామిని ‘జగత్‌-మన-మోహనుడు’ (జగన్మోహనుడు) అనీ అంటాం. సర్వాన్నీ ఆకర్షించేందుకు శ్రీకృష్ణునివద్ద వున్న ఆ గొప్ప గుణాలేమిటి? ఈ ‘కృష్ణాష్టమి’ పండుగ వేళ శ్రీకృష్ణ మాధుర్యాలను మనసారా ఆస్వాదిద్దాం. ‘కృష్ణ’ నామం వినగానే ఒక దివ్య సుమనోహర రూపం మదిలో మెదలుతుంది. ఆనంద సాగరంలో తన్మయత్వాన్ని పొందుతాం. దేవకీ నందనుడు, యశోద ముద్దుల తనయుడు, రాధా రమణుడైన ఆ శ్రీకృష్ణుడే పరబ్రహ్మమని, దేవాది దేవుడని ‘భగవద్గీత’ (10.12-13) ప్రబోధిస్తున్నది. వైదిక శాస్ర్తాలు, పురాణాలు, వేదాంత సూత్రాలు శ్రీకృష్ణుని గుణగణాలను ఒక క్రమపద్ధతిలో విశదీకరిస్తూ భగవత్‌ తత్త్వాన్ని బోధిస్తున్నాయి. శ్రీల రూపగోస్వాముల వారు తన ‘భక్తి రసామృత సింధు’ గ్రంథంలో శ్రీకృష్ణునిలోని ఆ ప్రత్యేక గుణాలను వివరించారు.

సర్వాద్భుత చమత్కార లీలా కల్లోల వారిధిః

అతుల్య మధుర ప్రేమ మండిత ప్రియ మండలః

త్రీజగన్మానసాకర్షి మురళీ కళ కూజితః

అసమానోర్ధ్వ రూప శ్రీ విస్మాపిత చరాచరః

మహాసముద్రంలోని అలల వలె తన దివ్యలీలా తరంగాలతో ముల్లోకాలనూ సంభ్రమాశ్చర్యాలలో ముంచెత్త గలవాడు,  తన దివ్యమాధుర్య ప్రేమ కలాపాల్లో తన చుట్టూ నిత్యం అసమతుల్యమైన భక్తిప్రపత్తులు కలిగిన విశుద్ధభక్తులను కలిగిన వాడు, తన మధురాతిమధుర వేణుగానంతో ముల్లోకాలను ఆకర్షించేవాడు, సరిపోల్చుటకు వీల్లేని సౌందర్య, ఐశ్వర్యాలను కలిగిన వాడు శ్రీకృష్ణుడు. ఆయనతో సమం కానీ, అధికులుగానీ మరొకరు లేరు. ఆ దేవాదిదేవుడు   ముల్లోకాలలోని సమస్త చరాచర జీవకోటిని విస్మయపరుస్తాడు. కనుకే, తాను అత్యంత సుమనోహర సుందరమూర్తి. 

శ్రీకృష్ణ లీలా మాధుర్యం:

శ్రీకృష్ణుని లీలలన్నీ అత్యంత ఆకర్షణీయం. దివ్యమైన ఆ విన్యాసాలలో అణువంతైనా ప్రాపంచిక మాలిన్యాలకు తావు లేదు. తన లీలలను యథార్థంగా ఎవరైతే అవగతం చేసుకోగలరో, వారు సులభంగా మోక్షాన్ని పొందుతారు. ఫలితంగా వారు తన దివ్య ధామాన్నీ (గోలోక బృందావనం) చేరగలరని స్వయంగా శ్రీకృష్ణుడే ‘భగవద్గీత’లో ప్రకటించాడు. సాధారణంగా, మోక్షాన్ని పొందే మార్గం ఎంతో కష్టతరమైంది. కానీ, అందుకు ‘భగవద్గీత’ మనకో సరళమైన మార్గాన్ని అందించింది. అదేమిటంటే, కేవలం కృష్ణలీలలను విని, అర్థం చేసుకొంటే సరి!

బృందావనం, మథుర, ద్వారక, హస్తినాపురం, కురుక్షేత్రం వంటి చోట్ల శ్రీకృష్ణుడు లీలా విన్యాసాలను ప్రదర్శించాడు. చిన్ని కృష్ణునిగా బృందావనంలో చూపిన లీలలు ప్రతి ఒక్కరి మనసుకు హత్తుకుపోతాయి. ఉదా॥కు, పసిపిల్లవాడిగా పూతనను వధించిన తీరు, ఏడేండ్ల ప్రాయంలో తన ఎడమ చిటికెన వేలుతో గోవర్ధన పర్వతాన్నే ఎత్తడం.. ఇలా ఎన్నెన్నో. గోపికల మనసును దోచి గోపీనాథుడయ్యాడు. కంసుడిని వధించిన వైనం అనితర సాధ్యం. ద్వారకాధీశునిగా, రుక్మిణీ వల్లభునిగా, సత్యభామ ప్రియుడిగా తాను ప్రదర్శించిన లీలలు ఎన్నో. పాండవ సఖ, అర్జున సఖ, రథ సారథి మొదలైన పేర్లు తనకు సార్థకమయ్యాయి. సమస్తాన్నీ త్యజించి, బ్రహ్మజ్యోతిలో ఐక్యం కావాలనుకునే తపోసంపన్నుల మనసులూ ఆ వైభవానికి ఆకర్షితం కాక తప్పదు. దీనిని ‘శ్రీమద్భాగవతం’ (1.7.10) స్పష్టం చేసింది.

శ్రీకృష్ణ రూప మాధుర్యం:

సమస్త శాస్ర్తాలూ శ్రీకృష్ణుని రూప మాధుర్యాన్ని కొనియాడుతున్నాయి. అసమతుల్యమైన స్వామి రూప మాధుర్యాన్ని ‘భాగవతం’ (1.9.33) అద్భుతంగా అభివర్ణించింది. తమాల వృక్షానికిగల నీలవర్ణంతోకూడిన దివ్య రూపధారుని ఆ దివ్యమంగళ రూపం ముల్లోకాలనూ ఆకర్షిస్తుంది. ఆ బ్రహ్మానంద స్వరూపం నుండి ఏ భక్తుడూ దృష్టిని మరల్చుకోలేడు. వాస్తవానికి శ్రీకృష్ణుని రూప మాధుర్యాన్ని ఆస్వాదించే క్రమంలో తమకు ఆటంకం కలిగించే కను రెప్పపాటును అమర్చిన ఆ బ్రహ్మదేవుడిపై భక్తులు ఆగ్రహాన్ని వ్యక్తపరిచే సంఘటన ‘భాగవతం’ (9.24.65)లో చూడగలం.

యస్యాననం మకరకుణ్డలచారుకర్ణ భ్రాజత్కపోలసుభగం సవిలాసహాసమ్‌  నిత్యోత్సవం న తతృపుర్దృశిభిః 

పిబన్త్యో నార్యో నరాశ్చ ముదితాః కుపితా నిమేశ్చ శ్రీకృష్ణుని వదనం మకర కుండల శోభితం. ఆతని కర్ణాలు సుందరములు, కపోమయాలు, తేజోమయాలు. దరహాసాలు అందరికీ ఆకర్షణీయం. స్వామిని చూడటమంటే నిత్యోత్సవ దర్శనమే. ఆ దేవదేవుని వదనం, రూపం చూసే వారందరికీ పూర్ణసంతృప్తి కలుగజేస్తుంది. రెప్పపాటువల్ల కలిగే అంతరాయాన్ని అయినా తట్టుకోలేరెవరూ. 

వేణుగాన మాధుర్యం:

వేణుగానం చేస్తూ, గోపబాలురతో కలిసి బృందారణ్యాలలో సంచరిస్తూ వుంటాడు శ్రీకృష్ణుడు. అతని వేణువు నిత్యం తన చుంబనాలను అందుకునే భాగ్యజీవి. నిత్యం శ్రీకృష్ణుని కరకమలాలలో వసించే ఆ వేణువు, ఎన్ని కోట్ల జన్మల పుణ్యఫలం గలదో. శ్రీకృష్ణునివద్ద వివిధ వేణువులు వుంటాయి. వివిధ సందర్భాలలో వాటితో పలు రాగాలను గానం చేస్తూ సకల జీవరాశులనూ మైమరపింపజేస్తాడు ఆ వేణు మాధవుడు. ఈ వేణునాదమే ధ్యానస్థితిలోని బ్రహ్మదేవుని చెవులలోకి ప్రవేశించి ముఖం ద్వారా గాయత్రీ మంత్రమై వ్యక్తమవుతుంది. ఈ కింది మూడు రకాల వేణువులను శ్రీకృష్ణుడు ఉపయోగిస్తాడని ‘భక్తి రసామృత సింధు’ గ్రంథం (అధ్యాయం: 26) పేర్కొన్నది. 

  • వేణువు: ఇది అన్నిటిలోకెల్లా చిన్నది. ఆరు అంగుళాలకు మించని ఈ వేణువును ఊదుటకు ఆరు రంధ్రాలుంటాయి.
  • మురళి: ఇది పద్దెనిమిది అంగుళాల పొడవు. మధ్యలో నాలుగు రంధ్రాలు, చివర్లో మరో రంధ్రాన్ని కలిగి వుంటుంది. అత్యంత మధురాతి మధురమైన శ్రావ్యతతోకూడిన నాదాలను ఇది జనింపజేస్తుంది.
  • వంశీ: ఇది పదిహేను అంగుళాల పొడవుతో తొమ్మిది రంధ్రాలను కలిగి వుంటుంది.

భక్తి మాధుర్యం:

నిత్యం తన ప్రాణ సన్నిహితులు, భక్తులతో కలిసుండే విలక్షణ గుణం శ్రీకృష్ణునిది. తన విశుద్ద భక్తులతోపాటే శ్రీకృష్ణుడు నిత్యం పలు లీలలను గావిస్తుంటాడు. శ్రీకృష్ణునితో వియోగాన్ని భక్తులు ఏ మాత్రం భరించలేరు. ‘శ్రీమద్భాగవతం’లో (1.11.9) భక్తుల మనోభావాలను గురించి విశదంగా ప్రస్తావితమైంది. శ్రీకృష్ణుడు సైతం తన భక్తులకు పరిపరి విధాలుగా సేవలొనర్చి తన ప్రేమను వ్యక్తపరుస్తాడని ‘భాగవతం’ (1.16.16) పేర్కొన్నది.

ఎవరికి సమస్త విశ్వం ప్రణమిల్లుతుందో, ఆ దేవాదిదేవుడైన శ్రీకృష్ణుడు (విష్ణువు) తన ప్రియభక్తులైన పాండవులకు రథసారథిలా, దూతలా, స్నేహితునిలా, కాపలాదారునిలా, సేవకునిలా పలు విధాల సేవలు చేశాడు. ఒక పిన్న వయస్కుడిలా ప్రణామాలర్పించే వాడు. ఈ విధంగా శ్రీకృష్ణుని నిర్హేతుక కృపను గురించి విన్న పరీక్షిత్‌ మహారాజు ఆ దేవదేవుని పాదపద్మాల వద్ద భక్తిపరవశుడయ్యాడు.

అదే మనందరి ధర్మం!

మాధుర్య రసభావనకు నిదర్శనమైన  నాలుగు విలక్షణ గుణాలే ‘శ్రీకృష్ణుడు సంపూర్ణ పురుషోత్తముడన్న’ విషయాన్ని ప్రకటిస్తున్నాయి. ‘మధురాధిపతే అఖిలం మధురం..’ అంటూ వారి దివ్యగుణ, రూపసంపత్తిలోని అణువణువూ మధురాతి మధురమేనంటూ కీర్తించారు వల్లభాచార్యులు. దక్షిణాదిన అనుసరించే పంచాంగం ప్రకారం శ్రావణ కృష్ణపక్ష అష్టమి తిథియే దేవాదిదేవుడైన శ్రీకృష్ణుడు ఈ భువిపై అవతరించిన శుభదినం. దుష్టులను శిక్షించి, శిష్టులను రక్షించి, ధర్మసంస్థాపన గావించేందుకై అవతరించిన శ్రీకృష్ణుడిని సేవించడమే జీవాత్మలమైన మనందరి ధర్మం. పవిత్రమైన కృష్ణ నామాన్ని కేవలం జపించినంత మాత్రాననే కృష్ణప్రేమను పొందగలం. ఈ శుభసందర్భంగా అందరం ఈ మహామంత్రాన్ని జపించి, తరిద్దాం. ఓం తత్‌ సత్‌.

హరేకృష్ణ హరేకృష్ణ కృష్ణకృష్ణ హరేహరే

హరేరామ హరేరామ రామరామ హరేహరే

సౌందర్య దర్శనం

‘పండుగ’ అంటే మనందరికీ తెలుసు. కానీ, ‘కనుల పండుగ’ అంటే ఏమిటో ‘భాగవతం’ (10.14.47) వివరిస్తున్నది. అదే శ్రీకృష్ణుని రూపం. స్వామి దివ్యదేహం నెమలి పింఛంతోను, పుష్పాలతోను, వనధాతువులతోను అలంకృతమై వుంటుంది. ఆతని వేణువు బిగ్గరగను, వేడుకగను ధ్వనిస్తుంది. గోవత్సాలను ఆతడు పేరు పెట్టి పిలుస్తాడు. గోపబాలురు ఆ దేవదేవుని పవిత్ర యశస్సును కీర్తించారు. అలా, శ్రీకృష్ణుడు నందవ్రజంలోకి ప్రవేశింపగా, ఆతని సౌందర్య దర్శనం ఒక్కమారుగా గోపవనితలకు నేత్రోత్సవమైంది. శ్రీకృష్ణుని శరీరం మనవంటిదేనని ఎన్నడూ భావించరాదు. అది దివ్యమైంది. కేవలం, వారి అంతర్గత శక్తిద్వారా మాత్రమే ఈ భౌతిక ప్రపంచంలో వ్యక్తమవుతుంది. 


- శ్రీమాన్‌ సత్యగౌర ,చంద్రదాస ప్రభూజీ అధ్యక్షులు, హరేకృష్ణ మూవ్‌మెంట్‌, హైదరాబాద్‌, రీజినల్‌ ప్రెసిడెంట్‌, అక్షయపాత్ర ఫౌండేషన్‌, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌


Previous Article Don’t Fear Corona

logo