శనివారం 19 సెప్టెంబర్ 2020
Devotional - Aug 06, 2020 , 00:20:32

దానం ఎందుకు చేయాలి?

దానం ఎందుకు చేయాలి?

‘ద’ అనే సంస్కృత ధాతువుకు ‘ఇచ్చుట’ అని అర్థం. మనకున్న దానిని ఫలాపేక్ష లేకుండా అందరికీ అందించే ప్రయత్నమే దానం. పూర్వజన్మ కృతం లేదా కర్మ కృతమైన దోషాలను పరిహరించే మార్గాలలో ‘దానం’ విశేషమైనది. అసలు, ‘ఎవరికి దానం చేయాలి? ఎందుకు చేయాలి? ఎంత చేయాలి? ఏ రూపంలో చేయాలి?’ అనే అంశాలను ఒకసారి తెలుసుకొందాం. 

నిత్యజీవితంలో ప్రతి నిమిషం మన దేహాన్ని వినియోగించుకుంటున్నాం. అవసరమైన గాలి, నీరు, వెలుతురు, శక్తి, ఆహారాదులన్నీ ప్రకృతినుంచి స్వీకరిస్తున్నాం. వినియోగించుకుని, ఆనందిస్తున్న దేహానికి అద్దె కట్టాలి కదా. అదేలా? ఈ ప్రకృతికోసమూ పన్ను కట్టాల్సి ఉంటుంది. వినియోగించుకున్న తర్వాత వాటికి రెంట్‌, టాక్స్‌ రూపాలలో తిరిగి ప్రకృతికి ఇవ్వని సందర్భంలో అవే సమస్యలుగా భావించబడతాయి. ధనలోపం, ఆరోగ్యలోపం, ఆస్తుల కబ్జా, వస్తువులు పోగొట్టుకోవడం, వైవాహిక, సంతాన, ఉద్యోగ సంబంధ ప్రయోజనాలు కోల్పోవడమేగాక ఒత్తిడులకు గురవుతుంటాం. వీటన్నిటి వల్ల మానవ జీవన ప్రయోజనమైన సుఖం, సంతోషం, ఆనందాలను కోల్పోతుంటాం. అందువల్ల, మనం ఈ లోకంలో ప్రకృతి నుంచి పొందుతున్న ప్రయోజనానికి తగిన విధంగా మళ్ళీ తిరిగి చెల్లించాల్సిందే. 

ప్రకృతికి, దైవానికి ఇవ్వడమే తెలుసు. ప్రకృతిని కాపాడుకోవాలి. సాధ్యమైనంత వరకు ప్రకృతి శక్తిని పెంచే ప్రయత్నం చేయాలి. అది మనకే లాభం. లోకమంతా ప్రకృతి, పంచభూతాల స్వరూపమే. అందువల్ల లోకంలోని వ్యక్తులకు ఏది అవసరమో గుర్తించి వారికి మళ్ళీ వాటిని అందించాలి. వారు మనకు తెలిసిన వారే కావాల్సిన అవసరం లేదు. దాన్ని వ్యాపారంగా మలచుకునే వారికి ఇవ్వాల్సిన అవసరమూ లేదు. మనం కూడా ప్రకృతిలాగా, దైవం లాగా ఉంటున్నప్పుడే మనకు దైవానుగ్రహం సిద్ధిస్తుంది. దానికి వ్యతిరేకమైన ప్రతి క్షణం మనకు సమస్యలు స్వాగతం పలుకుతూనే ఉంటాయి. కనుక, ఇవ్వడమే జీవితం కావాలి. దేనినైనా వదులుకుంటే ఆనందం, పట్టుకుంటే సమస్య. మనం దేనినీ దాచుకోలేం. వదులుకోవాల్సిందే. ఉద్యోగ, వ్యాపారాదుల్లో పొందే ప్రయోజనాన్నిబట్టి దానం చేయాలి. ధర్మశాస్ర్తాల ప్రకారం మన ప్రతి సంతోషం, సంతృప్తి, ధనం, అధికారం, ఉన్నతికి సంబంధించిన వానిలో ఐదవ భాగం (లేదా 20 శాతం) దానం చేయాలి. మిగిలిన నాలుగు భాగాలనే మనం అనుభవించాలి. ఇంకా తక్కువ శ్రమతో ఎక్కువ ప్రయోజనాలు పొందేవారు మరింత ఎక్కువ దానం చేయాలి. ఇలా దానం చేయనప్పుడు ఏర్పడేవే సమస్యలు. జీవితంలో సమస్యలు ఏర్పడకుండా, వాటిని అధిగమించాలంటే దానం ఒక ప్రధానమైన పరిష్కార మార్గం. దైవానికి, ఆలయాలకు, హోమాలకు అందించేది ‘సమర్పణ’. గురువులు, పూజనీయులు, పెద్దలకు ఇచ్చేది ‘దక్షిణ’. బలహీనులైన వారిలో దైవాన్ని దర్శిస్తూ వారి వద్దకు మనమే వెళ్ళి నమస్కరిస్తూ అందించేది ‘దానం’. బలవంతంగా తీసుకునేది, నిరంతరం అడుక్కొనేది ‘ముష్టి’. పూర్తి స్థాయి పుణ్యం లభించడానికి లేదా పాపకర్మల ప్రభావాలు తొలగించుకోవడం కోసం మొదటి మూడు పద్ధతులే ఆచరణీయమని ధర్మశాస్ర్తాలు చెబుతున్నాయి. 

అందుకే అనాథాశ్రమాలు, నిరుపేదలు, మనను అడగకుండా వారి పనుల్లో వారు ఉండే చిన్నస్థాయి ఉద్యోగులు, కూలీలు అందరిలో వున్న పరమాత్మను దర్శిస్తూ మనం దానం చేయడం అవసరం. వస్తు, వస్త్ర, ధాన్య, ధన రూపాల్లో ఏ రకంగా దానం చేసినా మంచిదే. వేర్వేరు గ్రహదోషాల నివారణకు అవసరమైన పదార్థాలను అవసరార్థులకు, ఆహార రూపాల్లో అత్యధికంగా అందించడం ద్వారా మనకు ఎంతో మేలు కలుగుతుంది. ఇలా చేయడం ప్రకృతి నియమాన్ని పాటించడం కిందికే వస్తుంది. కనుక, ఈ కలియుగంలో దానమే మనల్ని దైవానుగ్రహానికి చేరువ చేస్తుంది.


logo