ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Devotional - Aug 04, 2020 , 23:46:10

విశుద్ధ భక్తివైపే కృష్ణప్రేమ!

విశుద్ధ భక్తివైపే కృష్ణప్రేమ!

‘కృష్ణభక్తి రసభావితా మతిఃక్రీయతాం యది కుతోపి లభ్యతే

తత్ర లౌల్యమపి మూల్యం ఏకలమ్జన్మ కోటి సుకృతైర్‌ న లభ్యతే॥’

-శ్రీ చైతన్య చరితామృతము, మధ్యలీల, 8.70

దుర్లభమైన కృష్ణభక్తి రసభావన కోటిజన్మల సుకృతి ఫలంగానైనా లభించ శక్యం కానిది. తీక్షణమైన లౌల్యమనే మూల్యం చెల్లించి, తపించే వారికి మాత్రమే అమూల్యమైన ఆ కృష్ణప్రేమ లభిస్తుంది. సాధారణంగా ‘లౌల్య’మనేది ప్రాపంచిక భావనలో ఒక చెడు లక్షణం. ‘లౌల్యం’ దుఃఖానికి హేతువు కూడా. అయినా, అది విశుద్ధ భక్తితో కూడింది అయినప్పుడు కృష్ణప్రేమకు అర్హమవుతుంది.

లౌకిక సంపదలను వరించాలనే లౌల్యంతో వెంపర్లాడే వారిని అతి త్వరలోనే దుఃఖమూ వరిస్తుంది. కానీ, శ్రీకృష్ణుని ప్రేమ భక్తి భావనలో అల్పమైందేదీ లేదు. ప్రతీదీ సహేతుకమే. చెడు లక్షణంగా భావించే లౌల్యాన్ని సైతం శ్రీకృష్ణుని సేవకు వినియోగించవచ్చు. ఎలాగైనా.. కృష్ణప్రేమను పొందాలనే లౌల్యం గలవాని మనోచిత్తమూ పరిపూర్ణంగా సన్మార్గం కిందే లెక్క. పై శ్లోకంలో శ్రీరూపగోస్వాముల వారు బోధించినట్టు శ్రీకృష్ణుడి అనుగ్రహాన్ని పొందేందుకు జీవునికి ఉండవలసిన ఏకైక అర్హత కల్మషం లేని భక్తి. అది దుర్బుద్ధితో కూడిన ‘లౌల్యం’లోనూ ఉండవచ్చు.

ఒక దొంగ చాలా చిత్రంగా చిన్ని కృష్ణుని దివ్యాభరణాలపైనే కన్నేస్తాడు. తత్‌ పర్యవసానంగా అతడు గొప్ప భక్తుడిగా మారిన తీరు ఇక్కడ గమనార్హం. ‘రోజూ అనేక ఆభరణాలతో, గోవులను కాచేందుకు బాలకృష్ణుడు అడవులకు వస్తాడని’ ఒక భాగవత కథకుడు చెబుతుండగా విన్నాడు ఆ దొంగ. ‘చిన్న దొంగతనాలు చేస్తూ ఇబ్బందులు పడే బదులు, ఏకంగా ఆ బాలుని నగలు దోచేస్తే తన కష్టాలన్నీ తీరిపోతాయి కదా’ అనుకొంటాడు. ఆ బాలుని గురించి మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు అత్యంత శ్రద్దగా ‘భాగవత’ ప్రవచనమంతా వింటాడు. చివరికి తీక్షణమైన లౌల్యంతో వెంటనే బృందావనానికి వెళతాడు. ఆ రాత్రే అడవిలో మాటు వేసి, పొద్దున రాబోయే చిన్ని కృష్ణుని కోసం వేచి చూడసాగాడు. ఇద్దరు బాలలు గోవులను వెంట బెట్టుకొని అడవికి వస్తారు. వెంటనే చెట్ల పొదల్లోంచి ఒక్కసారిగా వారిపైకి దూకి చిన్ని కృష్ణుని చేతిని స్పృశిస్తాడు. అంతే! జన్మజన్మల అతని పాపాలన్నీ దగ్ధమై పోయాయి. ఆ బాలగోపాలుని దివ్య సౌందర్యానికి దొంగ ముగ్ధుడైనాడు. కృష్ణుని ఒంటిమీది ఆభరణాలన్నీ దొంగిలించాడు. కానీ, చోరులకే చోరుడైన ఆ గోపబాలుడే అతని మదిని తస్కరించాడు. ఎట్టకేలకు ఆ దొంగ పరిశుద్ధుడై భక్తి మార్గంలోకి వచ్చి తన జీవితాన్ని పునీతం చేసుకొన్నాడు.

కఠోర తపస్సులు చేసే యోగులకు సైతం లభించని ఆ పరంధాముని ప్రేమ ఇలా ఒక దొంగను వరించడమేమిటి, ఆశ్చర్యమే కదా! ఆ చోరునిలోని తీక్షణమైన ‘లౌల్యానికి’ భగవానుడు వశుడైపోయాడు. అతనిది నిజానికి దొంగతనమనే దుర్భుద్ధే కావచ్చు. కానీ, శ్రీకృష్ణునిపట్ల ఆకర్షితుడవటం ఇక్కడ ముఖ్యం. దీన్నే శ్రీరూపగోస్వాముల వారు, ‘యేన కేన ప్రకారేణ మనః కృష్ణ నివేశయత్‌' అన్నారు. శ్రీకృష్ణుని పొందాలనే కోరిక తీక్షణమైంది కావాలి, అంతే! వారెవ్వరైనా కృష్ణప్రేమను పొందగలరని పై కథ నిరూపించింది. మనసులో అంతటి తీక్షణత లేకుండా ఎన్ని సత్కర్మలు చేసినా రృష్ణప్రేమను పొందడం సాధ్యం కాదు. అందుకే, ఎప్పుడైనా, ఎక్కడైనా విశుద్ధ భక్తికి మాత్రమే కృష్ణప్రేమ సొంతమవుతుంది.logo