శుక్రవారం 14 ఆగస్టు 2020
Devotional - Aug 02, 2020 , 23:32:44

అలనాటి..అయోధ్యాపురి!

అలనాటి..అయోధ్యాపురి!

రామో రామో రామ ఇతి ప్రజానామభవన్‌ కథా రామభూతం జగత్‌ సర్వం రామే రాజ్యం ప్రశాసతి..రఘుకుల తిలకుడి పాలనలో అయోధ్యలో ఎటు చూసినా రామనామ స్మరణే, ఎవరినోట విన్నా రామకథలే! - అంటాడు వాల్మీకి మహర్షి యుద్ధకాండ చివరలో. ఆ మాటకొస్తే, రామ జన్మభూమి వ్యవహారమూ ఓ యుద్ధకాండే! సుదీర్ఘ పోరాట ఫలితంగా, శతాబ్దాల నిరీక్షణ అనంతరం, ఆగస్టు 5న.. భూమిపూజ జరుగనున్నది. కొన్ని యుగాల తర్వాత, జగాలన్నీ ప్రతిధ్వనించేలా ఆ గడ్డమీద రామఘోష వినిపించనున్నది. ఈ సందర్భంగా, అలనాటి అయోధ్య వైభవాన్ని ఒక్కసారి గుర్తుచేసుకుందాం!

‘త్రేతాయుగం..సరయూ తీరం..కోసల దేశం.మను చక్రవర్తి నిర్మించిన..శత్రుదుర్భేద్య నగరి.. అయోధ్యాపురి! కోసలదేశానికి ఆయువుపట్టు. రఘువంశ కీర్తి పతాక. పన్నెండు యోజనాల పొడవు, మూడు యోజనాల వెడల్పు కలిగిన మహానగరం. రాచమార్గాలు సువిశాలం. ప్రతి ఇల్లూ లక్ష్మీనివాసం. ప్రతి పౌరుడూ ఆనంద స్వరూపుడు’ అంటూ శ్రీమద్రామాయణం బాలకాండలో వాల్మీకి మహర్షి అలనాటి అయోధ్య వైభవాన్ని కండ్లకు కట్టారు.  

శత్రు దుర్భేద్యం..

శత్రువులు అయోధ్య వైపు కన్నెత్తి చూడటానికి కూడా సాహసించేవారు కాదు. నగరానికి నలువైపులా దృఢమైన తలుపులూ,  దారు బంధాలూ. కోట బురుజులూ ధ్వజాలూ మహోన్నతంగా ఉండేవి. వాటికి వందలాది శతఘ్నులు! వడ్డాణంలా.. నగరం చుట్టూ ఉన్నతమైన ప్రాకారం. అదనంగా, అగాథమైన అగడ్త. గుర్రాలూ, ఏనుగులూ, గోవులూ, ఒంటెలూ, గాడిదలూ మొదలైన వాటితో నిండిపోయి ఉండేది. అయోధ్య బయట కూడా.. రెండు యోజనాల వరకూ పహరా వ్యవస్థ మహా పటిష్టం.

మచ్చలేని పాలన

ప్రభువు సర్వోన్నతుడు. శక్తిమంతుడు. సచివులు పాలనకు పట్టుగొమ్మలు. రాజనీతి లోతుపాతులు తెలిసినవారు. యుద్ధ వ్యూహాలలో ఆరితేరినవారు. సూక్ష్మగ్రాహులు. వ్యవహారశుద్ధి కలిగినవారు. నిజాయతీపరులు. ప్రభువుల ఆలోచనకు అనుగుణంగా నడుచుకొనేవారు. వసిష్ఠుడు, వామదేవుడు.. ధార్మిక విషయాలలో రాచకుటుంబానికి సలహాలూ సూచనలూ అందించేవారు. గూఢచారి వ్యవస్థ బలంగా ఉండేది. చీమ చిటుక్కుమన్నా తెలిసేది. న్యాయ వ్యవస్థ బలమైంది. సొంత బిడ్డలు అయినా సరే, తప్పు చేస్తే దండన తప్పదు. శిక్షాస్మృతి కఠినంగా అమలు అయ్యేది. అపరాధ తీవ్రతను బట్టి శిక్షలు విధించేవారు. 

రతనాల రాశులు

అయోధ్యకు అనుబంధంగా నలువైపులా శాఖా నగరాలు ఉండేవి. ఇవి, ఆధునిక టౌన్‌షిప్‌ల లాంటివి. అక్కడక్కడా ఉద్యానవనాలు కనువిందు చేసేవి. మామిడి తోపులు అనేకం. వరి సమృద్ధిగా పండేది. నగరంలోని నీళ్లు చెరుకురసంలా మహా తీపి. అంగడివీధి నిత్యం కిటకిటలాడుతూ ఉండేది. అక్కడ దొరకని వస్తువు లేదు. యంత్రాలూ, ఆయుధాలూ విక్రయానికి సిద్ధంగా ఉండేవి. నవరత్నాలూ, వజ్ర వైఢూర్యాలూ రాశులుగా పోసి అమ్మేవారు. క్రీడాప్రియులకు విలాస గృహాలు స్వాగతం పలికేవి. అయోధ్య అందగత్తెల చిరునామా. గోసంపద, అశ్వసంపద, ధనధాన్యాలు లేని కుటుంబం ఒక్కటంటే ఒక్కటి కూడా లేదు. కర్ణభూషణాలు ధరించనివాడు, శిరోభూషణాలు అలంకరించుకోనివాడు, పుష్పమాలలు వేసుకోనివాడు, అభ్యంగన స్నానం చేయనివాడు.. అస్సలు కనిపించడు.  

ఏడంతస్తుల మేడలు

నగరంలో మహాశిల్పులకూ, వాస్తు నిపుణులకూ కొదువ లేదు. అందుకేనేమో, ప్రతి నిర్మాణంలో కళాత్మకత ఉట్టిపడేది. ప్రతి వీధీ బారులు తీరిన.. ఏడంతస్తుల భవనాలతో ప్రకాశించేది. ఎటు చూసినా నివాస సముదాయాలే. నిరుపయోగమైన స్థలం దుర్భిణి వేసి వెదికినా కనిపించదు. దుందుభి మృదంగ వీణా పణవాది మంగళ వాద్యాల ధ్వనులు నిత్యం వినిపించేవి. కప్పం కట్టడానికి బారులుతీరిన సామంతులతో, క్రయవిక్రయాలకు వచ్చిన వ్యాపారులతో వీధులు కిటకిటలాడేవి. భూమిమీద అయోధ్యను మించిన పట్ణణం లేనేలేదు! 

వీరభూమి

అయోధ్య వీరుల జన్మభూమి. మహారథుల నిజనివాసం. నగర పౌరులు బాణ ప్రయోగంలో నేర్పరులు. వారికి ముష్ఠి, గదాయుద్ధాలు కొట్టిన పిండి. క్రూరమృగాలను ఒంటిచేత్తో మట్టుబెట్టగల శక్తిమంతులు. అదే సమయంలో ధర్మవర్తనులు కూడా. ఆ పట్టణం వేదవేదాంగ నిష్ణాతులకు నిలయం. ప్రజలు మహా బుద్ధిశాలురు. రుషి స్వభావులు. అసత్యవాదులకూ, నాస్తికులకూ, అసూయపరులకూ, అసమర్థులకూ అక్కడ చోటులేదు. ప్రతి ఒక్కరిలోనూ నరనరానా రాజభక్తి.    

సార్వభౌముడు..

అయోధ్యాపతి దశరథుడు వేదవేత్త. శూరులనూ, పండితులనూ గౌరవించేవాడు. వారిని దానధర్మాలతో సంతృప్తి పరచేవాడు. దూరదృష్టి కలవాడు. పరాక్రమవంతుడు. ప్రజలకు ఆయనంటే ప్రాణం, దైవంతో సమానం. ఇక్షాకువంశ పాలకులలో అతిరథుడు. ఎన్నో యాగాలు చేసినవాడు. ధర్మాసక్తుడు. రాజర్షి. త్రిలోక ప్రసిద్ధుడు. మిత్రు సంపద కలవాడు. ఇంద్రియాలను జయించినవాడు. సిరిసంపదలలో కుబేరుడికి సరిసాటి. అలనాడు మనుచక్రవర్తి రాజ్యం చేసినట్టే, ప్రజలను కంటికి రెప్పలా కాపాడేవాడు. చంద్రుడు నక్షత్రాలను పాలించినట్టు, దశరథుడు అయోధ్యను ఏలుకొనేవాడు.

శ్రీరామ రాజ్యం

రాజా కాలస్య కారణం..కాలానికి కారకుడు రాజు. ప్రభువు స్వభావాన్ని బట్టే కాలపురుషుడి నడవడికా ఉంటుంది. ఏలిక ధర్మవర్తనుడు అయితే.. కాలపురుషుడు సకాలంలో వర్షాలు కురిపిస్తాడు, సమృద్ధిగా పంటలను ఇస్తాడు. అదే ప్రభువు దారితప్పి దుశ్చర్యలకు పాల్పడితే.. కరువుకాటకాలతో పరీక్షలు పెడతాడు. ఈతిబాధల్ని సృష్టిస్తాడు. వ్యాధులు ప్రబలేలా చేస్తాడు. ధర్మమూర్తి అయిన రామచంద్రుడి పాలనలో అయోధ్య ఆనందనిలయమే! ఎవరికీ ఏ కష్టమూ లేదు. కన్నవారికి పుత్రశోకం అంటే ఏమిటో కూడా తెలియదు.

‘న పుత్రమరణం కించిత్‌ ద్రక్ష్యంతి పురుషాః క్వచిత్‌'

.. పుత్రమరణమనేది ఒక్కటి కూడా ఎన్నడూ కానరాలేదు. కాబట్టే, వాల్మీకి మహర్షి రాముడిని ‘ధర్మస్య పరిరక్షితా’ (ధర్మాన్ని కాపాడేవాడు), ‘రక్షితా స్వస్య ధర్మస్య’ (స్వధర్మానికి కట్టుబడేవాడు), ‘స్వజనస్య చ రక్షితా’ (తనవాళ్లను కాపాడుకొనేవాడు), ‘సర్వ సమః’ (అందరినీ సమదృష్టితో చూసేవాడు), ప్రజానాం చ హితే రతః (సంక్షేమ కార్యక్రమాల్లో నిమగ్నమైనవాడు) - అని కొనియాడాడు. 

యావత్‌ స్థాస్యంతి గిరయః సరితశ్చ మహీతలే తావద్రామాయణకథా లోకేషు ప్రచరిష్యతి

.. భూమి మీద పర్వతాలు ఉన్నంత కాలం, నదులు ప్రవహించినంత కాలం.. రామకథ కూడా ఉంటుంది. శ్రీరాముడిని తలుచుకొన్న ప్రతిసారీ, అయోధ్య వైభవాన్నీ గుర్తుచేసుకొంటాం.


logo