బుధవారం 12 ఆగస్టు 2020
Devotional - Aug 02, 2020 , 23:32:44

అనురాగ బంధానికి అద్భుత రక్ష!

అనురాగ బంధానికి అద్భుత రక్ష!

శ్రావణ పౌర్ణమినే ‘రాఖీపౌర్ణమి’గా జరుపుకొంటాం. ఇవాళ అక్కాచెల్లెండ్లు తమ సోదరులకు ప్రేమానురాగాలకు గుర్తుగా రక్షాబంధనాన్ని కట్టడం ఆనవాయితీ.

భారతీయ జీవన విధానంలో ఒక విశేషం ఉంది. మనమాచరించే ప్రతి కర్మా, పాటించే ఆచారం భౌతిక, ఆధ్యాత్మిక ప్రయోజనాలు నెరవేర్చే విధంగా ఉంటాయి. వైదికంగా ‘నభోమాసం‘గా పిలిచే శ్రావణమాసంలో శ్రవణా నక్షత్రంతో కూడిన పౌర్ణమి ‘శ్రావణ పౌర్ణమి’. దీనికి ఒక ప్రత్యేకత ఉన్నది. ఇది శివకేశవులకూ వారి భార్యలు పార్వతీ, శ్రీలక్ష్మికీ, అలాగే ఇంద్రాణికీ ప్రీతిపాత్రమైందిగా భావిస్తారు. అందుకే, చాతుర్మాస్య దీక్షలో ఉన్నవారు, ఉపాసకులు ఈ నెలను ప్రశస్తమైందిగా భావిస్తారు. మంగళప్రదమైన మాసం కావడం వల్ల సౌభాగ్యాన్ని కోరుకుంటూ స్త్రీలు మంగళవారాలు, శుక్రవారాలు ప్రత్యేక నోములు నోచుకోవడం, వాయినాలు ఇచ్చుకోవడం ఆచారంగానూ వస్తున్నది. 

నిజానికి శ్రావణం శ్రవణా నక్షత్రానికి సంబంధించింది. ‘శ్రవణం’ అంటే వినడం. ‘సంస్కార పూర్వం గ్రహణం స్వాదుపాకరణం శ్రుతే’ అన్న అమరసింహుని సూక్తి ప్రకారం, గురువుద్వారా వేదాన్ని వినేందుకు అర్హతగా ఉపనయనమైన వటువుకు శ్రావణ పౌర్ణమి నాడు ఉపాకర్మ నిర్వహించి గురుకులానికి పంపేవారు. అలాగే, గురుకులంలో వేదాన్ని అభ్యసిస్తున్న బ్రహ్మచారులు తాము అధ్యయనం చేస్తున్న వేదాన్ని శ్రావణ పౌర్ణమినాడు ధారణ చేయడం సంప్రదాయంగా పాటించేవారు. దీనినే ద్విజులు ‘జంధ్యాల పౌర్ణమి’గా పాటిస్తున్నారు. జీర్ణమైన యజ్ఞోపవీతాన్ని విసర్జించి, కొత్త దానిని ధరించడం ఇవాళ వారికి ఆనవాయితీ. గాయత్రీ మాతకు ప్రతీకగా భావించే యజ్ఞోపవీత ధారణ అంటే ధర్మదీక్షకూ ప్రతీకగా మంత్ర పూర్వకంగా పునీతమైన దారాన్ని ధరించడంగా భావించాలి.

పూర్వం వరగర్వితుడైన హయగ్రీవుడనే రాక్షసుని సంహరించేందుకు విష్ణుమూర్తి శ్రావణ పౌర్ణమినాడే హయగ్రీవావతారం దాల్చినట్లుగా పౌరాణిక కథ ప్రచారంలో ఉన్నది. శ్రీ విద్యను, లలితా సహస్రనామాలను ప్రకటించినవాడు హయగ్రీవుడే. అందుకే, శ్రావణ పౌర్ణమిని ‘హయగ్రీవ జయంతి’గానూ జరుపుకుంటాం. శ్రావణ పౌర్ణమినే ‘రాఖీ పౌర్ణమి’గా అక్కాచెల్లెండ్లు వారి ప్రేమానురాగాలకు గుర్తుగా సోదరులకు రక్షాబంధనాన్ని కడతారు.

‘యేన బద్ధో బలీ రాజా దానవేంద్రో మహాబలః

తేనత్వామభి బధ్నామి రక్షే మాచల మాచల’! 

అంటూ అన్నాతమ్ముళ్లకు స్త్రీలు రక్షను కడతారు. రామాయణ కాలంలో కౌసల్య తన కుమారుడైన శ్రీరామునికి, శకుంతల తన కుమారుడైన భరతునికి రక్షాబంధనాలు కట్టినట్లుగా వేదవిజ్ఞానులు చెప్తారు. ఒకప్పుడు బలి కోరిక మేరకు విష్ణువు పాతాళంలో ఉండిపోతాడు. అప్పుడు లక్ష్మీ దేవి బలికి రక్షను కట్టి ‘భర్తను కానుకగా పొందిందన్న కథనమూ ఉంది. ఈ భావనకు ప్రతీకగా సోదరులకు సోదరీమణులు రక్షాబంధనాన్ని కట్టడం ఆనవాయితీ అయింది. 

పరస్పరాధారిత సమాజంలో ఒకరికొకరు రక్షణ నిచ్చుకునేందుకు, దేశ రక్షణలో జాతి సంస్కృతీ పరిరక్షణలో తమను తాము అర్పించుకునేందుకు అంకితమైన రోజుగా ‘శ్రావణ పౌర్ణమి’ని గుర్తించడం అనాదిగా వస్తున్నది. పలు ఆధ్యాత్మిక, సామాజిక సంప్రదాయాలతో కూడిన ఈ పౌర్ణమిని తమిళులు ‘పూనల్‌" అని, మహారాష్ట్ర వారు ‘నార్లీ‘ అని పేర్లతో పిలుస్తూ ఉత్సవాలు జరుపుకొంటారు. ఇలా, ఎన్నో కోణాలలో ఈ శ్రావణ మాసాన్ని ఉత్తమ ఫలదాయినిగా భావిస్తుంటారు.


logo