గురువారం 06 ఆగస్టు 2020
Devotional - Aug 02, 2020 , 23:32:44

స్ఫురణ శక్తి కోసం..శ్రీ హయగ్రీవాయ నమః

 స్ఫురణ శక్తి కోసం..శ్రీ హయగ్రీవాయ నమః

జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిమ్‌

ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవ ముపాస్మహే॥

విద్య అంటే తెలుసుకోదగిన జ్ఞానం. ఈ జ్ఞాన సంపదతోనే మనిషి మనీషిగా, మహనీయునిగా మారుతాడు. విద్యను అభ్యసించేవారంతా విద్యార్థులే. పాఠశాల, కళాశాలలకు వెళ్ళేవారేకాదు, ఏ విషయంలోనైనా నూతనాంశాలను తెలుసుకొని తమ జీవితాన్ని మరింతగా ఆనందమయం చేసుకోదలచుకున్న వారెవరైనా విద్యార్థులే. వారందరికీ తమలోని చైతన్యం ద్వారా అప్పటికప్పుడు కొన్ని భావాలు వ్యక్తమవుతాయి. దానినే ‘స్ఫురణ’ అంటారు. అటువంటి ‘స్ఫురణ శక్తి’ పెంపొందాలంటే విద్యార్థులంతా కనీసం ప్రతి రోజూ ఒక గంటసేపు ‘శ్రీ హయగ్రీవాయ నమ:’ జపం చేయాల్సి ఉంటుంది. 

శ్రావణ పూర్ణిమ నాడే ‘హయగ్రీవ జయంతి’. ఈరోజు ఈ జపం మరింత శ్రేయోదాయకమవుతుంది. శ్రీలక్ష్మీ హయగ్రీవస్వామి విష్ణువు అంశ. మహావిష్ణువు అవతారాలలో ఇదొకటి. గుఱ్ఱం తలతో కనిపించే దైవమిది. విద్యలకు అధిదైవం. లౌకికం, పారమార్థికం అని విద్య రెండు రకాలు. పారమార్థిక లేదా ఆధ్యాత్మిక విద్యాగంధం కోసం మనం శివ స్వరూపమైన ‘దక్షిణామూర్తి’ని ఉపాసిస్తాం. అయితే, లౌకిక విద్యలు మాత్రమే మనకు ఈ లోకంలో జీవికకు ఉపకరిస్తాయి. ఒక పరీక్షలో ఉన్నత స్థాయి రావాలన్నా, ఓ ఇంటర్వ్యూలో వెంటనే సమాధానం స్ఫురించాలన్నా, పాఠ్య పుస్తకంలో అవసరమైన భాగం అంతా ఒక ఫొటోగ్రఫిక్‌ మెమొరీ లాగా గుర్తుండాలన్నా ‘హయగ్రీవారాధన’ అద్భుత చిట్కా. పాఠ్య విషయాలు తొందరగా మనసులోకి చేరక, అర్థం కాక ఇబ్బంది పెడుతుంటే, వెంటనే 21 సార్లు హయగ్రీవ నామాన్ని హృదయపూర్వకంగా జపించాలి. ఫలితంగా ఏకాగ్రత సిద్ధించి అర్థవంతమవుతుంది. ఇది పరిశోధకులు వంటివారికి సైతం ఉపకరిస్తుంది.

తల్లిదండ్రులు తమ పిల్లలలో చిన్న వయసునుండే దగ్గర ఉండి, తాముకూడా వాళ్ళతో గట్టిగా ఉచ్చరిస్తూ, కనీసం 108 సార్లు ‘శ్రీ హయగ్రీవాయ నమ:’ అని మంత్రజపం అలవాటు చేయించాలి. దీనివల్ల వారిలో చైతన్యశక్తికి, విద్యా వివేకానికి లోటు ఉండదు. పరీక్షలు రాసే ముందు, ఇంటర్‌వ్యూలకు వెళ్ళే ముందు కూడా ఇదెంతో విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. సత్యదర్శనం, సద్యః స్ఫురణల సాధకులు కూడా హయగ్రీవస్వామిని నిరంతరం ఉపాసించడం ద్వారా ముక్తి పథాన్నీ చేరుకోగలరు.logo