గురువారం 13 ఆగస్టు 2020
Devotional - Aug 01, 2020 , 00:38:40

అనేక విశిష్టతలతో అయోధ్య ఆలయ నిర్మాణం

అనేక విశిష్టతలతో అయోధ్య ఆలయ నిర్మాణం

  • మారిన ఆలయ డిజైన్‌.. పెరిగిన విస్తీర్ణం 
  • 161 అడుగుల ఎత్తు.. నాగర వాస్తుశైలి 
  • ఐదు మండపాలు.. వేటికవే ప్రత్యేకం 
  • ఆగస్టు 5న ప్రధాని మోదీ భూమిపూజ 
  • కొత్త సొబగులతో వెలిగిపోతున్న అయోధ్య  

లక్నో, జూలై 31: దశాబ్దాలుగా ఎడతెగని వివాదాల తర్వాత సాకారమవుతున్న అయోధ్యరాముని ఆలయం అన్నిరకాలుగా ఓ దివ్యాలయంగా ఉండబోతున్నది. ప్రతి అంగుళంలోనూ అద్భుత జీవకళతో భక్తులను భక్తి పారవశ్యంతో ఓలలాడించనున్నది. 161 అడుగుల ఎత్తు శిఖరంతో ఐదు మండపాలతో మూడు అంతస్తుల సువిశాల ఆలయం మరో మూడున్నరేండ్లలో నిర్మాణం కానున్నది. నాగర వాస్తు శైలిలో ఆలయాన్ని నిర్మించనున్నారు.

మారిన ఆలయ రూపు

శ్రీరాముడి జన్మస్థానంలో నిర్మించే ఆలయం అన్నిరకాలుగానూ ప్రత్యేకంగా ఉండాలన్న తలంపుతో 1990 దశకంలో ప్రముఖ స్తపతి చంద్రకాంత్‌భాయ్‌ సోమ్‌పురా ఓ ఆలయ నమూనాను రూపొందించారు. 141 అడుగుల శిఖరంతో, మూడు మండపాలతో, 212 స్తంభాలతో, రెండు అంతస్తుల ఎత్తుతో ఆలయం ఉండాలని నిర్ణయించారు. ఆ నమూనాను ప్రస్తుతం విస్తరించినట్టు చంద్రకాంత్‌భాయ్‌ కుమారుడు ఆశిష్‌ సోమ్‌పురా తెలిపారు. కొత్త డిజైన్‌ ప్రకారం ఆలయంలో 360 స్తంభాలు (పిల్లర్లు) ఉంటాయి. ఆలయంలోని మండపాలను భక్తుల దర్శనాలకోసం వాడుతారని ఆశిష్‌ సోమ్‌పురా చెప్పారు. ఆలయ శిలలను రాజస్థాన్‌లోని బన్షి పర్వతాలనుంచి తెస్తున్నారు. ప్రధాన ఆలయం చుట్టూ మరో నాలుగు చిన్న ఆలయాలు ఉంటాయి. గత 30 ఏండ్లుగా దేశం నలుమూలల నుంచి సేకరించిన రెండు లక్షల ఇటుకలను ఆలయ పీఠం కోసం వాడుతారు. 

లక్ష 11వేల లడ్డూలు 

భూమి పూజ కార్యక్రమానికి వచ్చే భక్తులకోసం  నగరంలోని దేవ్హ్రా హన్స్‌ బాబా సంస్థాన్‌ ఏకంగా లక్షా 11వేల లడ్డూలను సిద్ధం చేస్తున్నది. మణిరామ్‌దాస్‌ చావ్‌నీ వద్ద ఈ లడ్డూల తయారీ ఇప్పటికే మొదలైంది. ఈ లడ్డూలను శ్రీరాముడికి నైవేద్యంగా సమర్పించి ఆ తర్వాత భక్తులకు పంచిపెట్టనున్నామని తయారీదారులు తెలిపారు. 

అంగరంగవైభవంగా 

ఆగస్టు 5న రామాలయ నిర్మాణానికి ప్రధాని మోదీ భూమి పూజ చేయనున్నారు. ఈ నేపథ్యంలో అయోధ్యను యూపీ ప్రభుత్వం అంగరంగవైభవంగా తీర్చిదిద్దుతున్నది. సరయూ నది శుద్ధీకరణ పనులు కొనసాగుతున్నాయి. ఇందుకోసం యూపీ రూ.350 కోట్లు ఖర్చుచేస్తున్నది. ప్రధాన వీధుల వెంట ఇండ్లపై రామాయణ ఇతివృత్తాన్ని చిత్రకారులు అద్భుతంగా చిత్రిస్తున్నారు. 

గొప్ప ఆలయాలు నిర్మించిన చరిత్ర వారిది 

రామాలయ ప్రధాన శిల్పి చంద్రకాంత్‌భాయ్‌ సోమ్‌పుర వంశస్థులకు దేశంలోని ప్రఖ్యాత ఆలయాలు నిర్మించిన చరిత్ర ఉంది. అక్షరధామ్‌ ఆలయాన్ని కూడా చంద్రకాంతే డిజైన్‌ చేశారు. ఆయన తాత ప్రభాకర్‌జీ సోమ్‌పుర సోమ్‌నాథ్‌ ఆలయాన్ని డిజైన్‌ చేశారు. వీరి వంశస్థులు దేశవిదేశాల్లో 200కు పైగా ఆలయాలను డిజైన్‌ చేశారు. 


logo