గురువారం 13 ఆగస్టు 2020
Devotional - Aug 01, 2020 , 00:05:44

శ్రీకృష్ణుడు జగద్గురువు ఎందుకయ్యాడు?

శ్రీకృష్ణుడు జగద్గురువు ఎందుకయ్యాడు?

  • కార్పణ్య దోషోప హతస్వభావః
  • పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢ చేతాః
  • యచ్ఛ్రేయస్యా న్నిశ్చితం బ్రూహి తన్మే
  • శిష్యస్తేహం శాధిమాం త్వాం ప్రసన్నం ॥

కురుక్షేత్ర యుద్ధ ప్రారంభంలోనే తన నిస్పృహను వ్యక్తం చేస్తూ యుద్ధం చేయనన్నాడు అర్జునుడు. అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు కర్తవ్యబోధ చేయడమే లోకానికి విశిష్ట మార్గంగా ‘భగవద్గీత’ను ప్రసాదించాడు. ఈ సందర్భంలో అర్జునునికి వచ్చిన సందేహానికి, ఆయనలోని శరణాగత తత్వానికి పై శ్లోకం ఒక ఉదాహరణ. శ్రీకృష్ణ పరమాత్ముణ్ణే అర్జునుడు తన గురువుగా భావించాడు. ‘స్వామీ! నాలో ఒక విధమైన పిరికితనం చోటు చేసుకొన్నది. దీంతో ఏది ధర్మమో, ఏది కాదో తెలియకుండా ఉన్నది. సరైన నిర్ణయం తీసుకోలేకపోతున్నాను. అందుకే, ఈ సందిగ్ధ స్థితిలో నాకు ఏది శ్రేయస్కరమో, నేను ఆచరించ వలసిన ధర్మమేదో నీవే నిర్ణయించి చెప్పవలసింది. నేను నీ శిష్యుణ్ణి. నీ శరణాగతుడను’ అని అర్జునుడు ప్రార్థించాడు.

భారతీయ సనాతన ధర్మంలో మాతాపితరుల తర్వాతి స్థానం గురువుదే. ఇది ఉపనిషన్మార్గం. అందుకే, ‘ఆచార్య దేవోభవ’ అన్నారు మన ఋషులు. మన భౌతిక జీవితంలో కనిపించే ప్రత్యక్ష దైవస్వరూపుల్లో ఆచార్యుడొకరు. ఏ ధర్మమైనా తాను ఆచరించిన దానినే తన శిష్యులకు చెప్పి ఆచరింపజేసేవాడు నిజమైన ఆచార్యుడు. అతడే ఉత్తమ గురువుగా మార్గదర్శనం చేస్తాడు. శ్రీకృష్ణ పరమాత్ముడు జగద్గురువు. లోకాన్ని ధర్మమార్గాన నడిపించేవాడు. ధర్మాచరణలో తాను నడుస్తూ, తనను శరణు వేడిన వారినీ నడపించగలిగే ధర్మమూర్తి. అందుకే, అర్జునుడుకూడా ఆయననే శరణు వేడాడు.

మానవులకు ధర్మాచరణలో కొన్ని సంశయాలు, పిరికితనం అప్పుడప్పుడూ కలుగుతుంటాయి. అప్పుడు దారి చూపేవాడు ఆ శ్రీమన్నారాయణుడే. గురువుగా ఆయన మనకు చేయూతనివ్వాలి. అప్పుడే ఆ ధర్మకార్యం సత్ఫలితాలను ఇస్తుంది. మనలో ఆత్మజ్ఞానాన్ని, సత్కర్మాచరణ బుద్ధిని, మరింతగా జాగృతం చేసి ముందుకు నడిపించే వాడే సద్గురువు. ఆ గురు కటాక్షమే మన సమ్మూఢ చేతస్సును తొలగించి మార్గాన్ని సుగమం చేస్తుంది. అటువంటి గురువును మనం తెలుసుకొని వారినే ఆశ్రయించాలి. తననే శరణు వేడాలి. ఈ విషయాన్ని బాగా గుర్తెరిగిన వాడు కనుకనే, అర్జునుడు ‘తాను శ్రీకృష్ణునికి శిష్యుడననీ, ఆ స్వామినే శరణు వేడుతున్నానని’ స్పష్టంగా చెప్పాడు. తనకు కర్తవ్యం బోధించి, మందుకు నడిపించమనీ కోరాడు. స్వామినే గురువుగా భావించి తనలోని నిస్పృహను, లోపాలను నివేదించుకొన్నాడు. శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునునిపట్ల కరుణ చూపి మార్గ నిర్దేశనం చేశాడు. అదే ‘భగవద్గీత’గా వేదవ్యాస మహర్షి మనకు అందించాడు.

శ్రీకృష్ణ పరమాత్ముడు చూపిన భగవద్గీతా మార్గం కేవలం అర్జునునికి మాత్రమే పరిమితం కాలేదు. అది విశ్వమానవాళికి గొప్ప దిక్సూచిగా నిలిచింది. యావత్‌ ప్రపంచాన్నీ సన్మార్గం వైపు నడిపిస్తున్నది. ఇటువంటి మహత్తర ప్రయోజనాన్ని కలిగించే పని చేసినవాడే ఉత్తమ గురువు. అందుకే, భారతీయ ధర్మం గురువును త్రిమూర్త్యాత్మక స్వరూపంగా భావించి సేవించింది. 

అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయా

చక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః॥

అని కీర్తించడంలోని పరమార్థం ఇదే. మానవాళిలోని అజ్ఞానమనే చీకటిని జ్ఞానమనే వెలుగుతోనే తొలగించుకోవాలి.


logo