శుక్రవారం 07 ఆగస్టు 2020
Devotional - Jul 30, 2020 , 23:35:05

దైవ దర్శనం ఎప్పుడు, ఎలా!

దైవ దర్శనం ఎప్పుడు, ఎలా!

‘అంగుష్ఠ మాత్రః పురుషః

మధ్య ఆత్మని తిష్ఠతి

ఈశానో భూతభవ్యస్య

న తతో విజుగుప్సతే..’ 

- కఠోపనిషత్తు (4.12)

నచికేతుడు తన ఆచార్యుణ్ణి ‘పరమాత్మ ఎక్కడ లభిస్తాడు?’ అని ప్రశ్నించాడు. దానికి ఆచార్యుడు ఇచ్చిన సమాధానం గమనింపదగింది. ‘శరీరం మధ్యలో ‘అంగుష్ఠమంత’ అంటే ‘బొటనవేలంత’ పరిమాణం గల స్థానంలో పరమాత్మ లభిస్తాడు. అతడు ప్రపంచ పదార్థాలకు స్వామి. అతణ్ణి తెలుసుకొంటే ఏ దుఃఖమూ ఉండదు’ అన్నది ఆచార్యుని సమాధానం. మన హృదయంలోని దహరాకాశమే బొటనవేలంత స్థానం. దానిలోనే పరమాత్మ దర్శనమిస్తాడు. దీన్నిబట్టి పరమాత్మను మనం సాక్షాత్కారం చేసుకోవాలంటే హృదయస్థానమే అనువైందని అర్థమవుతున్నది.

‘యోగుల హృదయాల్లో ప్రకాశించేవాడు పరమాత్మ’ అని భగవద్గీత చెప్తున్న విషయమూ దీనికి సరిపోయింది. ‘ఇంతకూ పరమాత్మ కేవలం మన హృదయంలోనే ఉంటాడా’ అంటే కాదు. అతడు సర్వాంతర్యామి. ‘మూడు కాలాల్లో వున్న సమస్త పదార్థాలకు స్వామి’ అని సమాధానం వస్తుంది. పరమాత్మ అంతటా నిండి ఉన్నాడు. అతడు లేని చోటు లేదు. సృష్టికంటే ముందున్న వాడే ప్రళయం తర్వాతకూడా ఉన్నాడు. సర్వకాల సర్వావస్థలలోనూ శాశ్వతుడై ఉన్నాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే, అణువుకంటే కూడా చాలా సూక్ష్మమైనవాడు. ఆకాశాది మహత్పదార్థాలకంటే గొప్పవాడైన పరమాత్మ ప్రాణుల హృదయస్థానంలో దాగి ఉన్నట్లు కఠోపనిషత్తు పేర్కొన్నది.

పరమాత్మ ప్రతి జీవాత్మతోను ఉన్నాడు. ఎప్పుడు జీవుడు శరీరంలోకి ప్రవేశిస్తాడో అప్పుడే పరమాత్మ కూడా ప్రవేశిస్తాడు. అంతటా పరమాత్మ ఉన్నా అతణ్ణి మనం సాక్షాత్కరింప జేసుకోవడం మాత్రం చాలా కష్టం. ఎందుకంటే,  మనం అంతటా లేము కదా. అందుకే, ఉపనిషత్కారుడు ‘పరమాత్మను హృదయంలోనే దర్శించుకోవాలని’ నచికేతునికి ఉపదేశించాడు. ప్రాణానికి ప్రాణమైన పరమాత్మ అంతటా ఉన్నప్పుడు, హృదయంలో ఉండకుండా ఎట్లా ఉండగలడు? పరమాత్మ స్థానం అనంతం. అటువంటివాణ్ణి అందుకోవాలంటే మనకు మన హృదయమే శరణ్యం. హృదయంలోని అతిసూక్ష్మమైన ప్రదేశమే దహరాకాశం. ఈ దహరాకాశంలోనే పరమాత్మ ఉంటాడు. సూక్ష్మ పదార్థాలలోకెల్లా సూక్షుడైన పరమాత్మను యోగులు తమ సూక్ష్మ బుద్ధితోనే దర్శించుకొంటారు. పరమాత్మను ఉపాసించడం బ్రహ్మనిష్ఠులకే సాధ్యం. మనం బ్రహ్మనిష్ఠులం కావాలంటే, మొదట మన హృదయ నిష్ఠుడైన పరమాత్మను తెలుసుకోవాలి. 

పరమాత్మ సాక్షాత్కారం అందరికీ లభించదు. ‘ఋజువర్తనం, బ్రహ్మచర్యం, శమదయాదులు వుంటేగాని అది సాధ్యపడదు. దురాచారాలనుండి ముక్తుడు కాకపోతే, ఇంద్రియ విషయాలనుంచి బుద్ధిని మరల్చకపోతే, చిత్తం ఏకాగ్రం కాకపోతే, తనను తాను పరమాత్మకు అర్పించుకోకపోతే, పరమాత్మ దర్శనం కాదని’ కఠోపనిషత్తు కఠినంగానే చెప్తున్నది. మన శాస్ర్తాలు ఏది చేయాలో, ఏది చేయరాదో తెలిపాయి. వీటినే ‘విధి నిషేధాల’ని అంటారు. ఇవి తెలుసుకొంటేనే సదాచారులం కాగలుగుతాం. శబ్దాదులలో మమకారం విడిచిపెడితే మనసు స్వాధీనమై బుద్ధి పరమాత్మవైపు మళ్లుతుంది. అప్పుడు పరమాత్మ యథార్థ స్వరూపం బోధపడుతుంది. ఇదంతా మన హృదయ కమలంలోనే జరగాలి.

ఇంద్రియాలకు, ఆత్మకు నడుమ మనసు పని చేస్తుంది. ధ్యానశీలుడైన యోగి తన మనసును ఇంద్రియాలవంక పోనీయడు. మనసు అనే పగ్గాలతో ఇంద్రియాలనే గుర్రాలను వశంలో ఉంచుకొంటాడు. బుద్ధిని సారథిగా చేసుకొని హృదయనిష్ఠుడైన పరమాత్మను దర్శించే పనిలో నిమగ్నమవుతాడు. ఎప్పుడైతే, పరమాత్మ స్వరూపం బోధపడుతుందో అప్పుడతనికి అనిర్వచనీయమైన ఆనందం ప్రాప్తిస్తుంది. శ్రీరామచంద్రుడు తన గురువైన వశిష్ఠ మహర్షిని సందర్శించి, ‘మోక్షానందం ఎక్కడ లభిస్తుందని’ ప్రశ్నించాడు. దానికి సమాధానంగా మహర్షి.. ‘మోక్షానందం ఆకాశంలోనో, పాతాళంలోనో లేదు. భూమిమీద కూడా లేదు. నిర్మలమైన హృదయంలోనే దానికి స్థానం’ అని చెప్పాడు.

-ఆచార్య మసన చెన్నప్ప, 98856 54381


logo