గురువారం 06 ఆగస్టు 2020
Devotional - Jul 30, 2020 , 00:44:28

హృదయమే మన దేవాలయం!

హృదయమే మన దేవాలయం!

కాలం సర్పిల సరళరేఖ. సర్పిలంలో సర్పిలంగా దినాలుగా, వారాలుగా, పక్షాలుగా, నెలలుగా, సంవత్సరాలుగా, యుగాలుగా మున్ముందుకు, వెనుతిరుగక శూలరేఖగా సాగుతూనే ఉంటుంది. కాలం పరిణామకారి. ఫలదాయి కూడా. మిగతా జీవరాశిలా మనిషికూడా కాలబద్ధుడై పరిణమించవలసినవాడే. దేహం, మనసు, ప్రకృతి, సమాజం వంటి వాటితో మనిషి జీవన అస్తిత్వం నెలకొని ఉన్నది. ఈ లక్షణం అనేక అన్యజీవులలోనూ కనబడేదే.  

మనిషికి మాత్రం కొన్ని ప్రత్యేకతలు వున్నాయి. భావనలో అనంతంగా అటు గతంలోకీ, ఇటు భవిష్యత్తులోకీ మానవుడు దర్శించగలడు. తన స్మృతి విస్తృతితో, అహంభావ భారంతోనూ ప్రయాణించగలడు. శబ్ద సంకేతాలతో ఎదురుగా లేని ప్రపంచాన్ని సృష్టించుకోగలడు కూడా. అనుభవంలో వున్న జీవితాన్ని ఊహలో అవధులు లేనంతగా విజృంభింపజేసుకోనూ గలడు. అయితే, అన్నిటికీ ఆధారభూతమైంది స్మృతి (memory). ఇదొక్కటి తుడిచి పెట్టుకుపోతే చింతనం, ప్రజ్ఞ, ఉద్వేగాలు, వైఖరులు, సృజన, మూల్యాంకనంతో సహా సకలం శూన్యమైపోతుంది. అందుకే, ‘స్మృతి సంపదనూ, స్పష్టతనూ వృద్ధి చేసుకోమని’ అంటున్నది మన సంప్రదాయం. అదీ మననం ద్వారానే సుమా. ఈ ప్రత్యేకతలే త్యాగవీరుల ద్వారా ఎంతటి పురోగతికి కారణం అవుతాయో, స్వార్థ కుటిలతలతో అంతటి అధోగతికీ దారితీస్తాయి. 

మనిషి ప్రాథమికంగా సహజాత జీవికంటే ఎక్కువగా అభ్యాసజీవి. దీనివల్ల వ్యక్తి స్వభావం, సమాజ సంస్కృతి ఈ అభ్యాస వాతావరణ సంపన్నతపైనే ఆధారపడి ఉంటాయి. వేగంగా మారుతున్న సాంకేతిక పరిస్థితులవల్ల మనిషి ఉద్యోగ, నాగరికతాది అవసరాల దృష్ట్యా నిత్య అభ్యాస, సంవర్ధన శీలిగా (కుదురు లేక) కూడా ఉండవలసిన అవసరం రాన్రాను పెరుగుతున్నది. అంటే, ‘నిత్య పరిణామ సాధకుడి’గా మారడం మనిషికి అనివార్యమవుతున్నది. అయితే, ఏ సాధన అయినా ‘కాలం సర్పిల సరళరేఖా మార్గం’లోనే సాగి తీరవలసిందే. 

ముఖ్యంగా సాధనా పరంగా దైహిక, మానసిక, సామాజిక, ఆర్థిక, ఆధ్యాత్మిక అనే ఐదు ముఖాలుగా మనిషి ప్రయాణం సాగవలసి ఉంటుంది. అవి పరస్పర విదూరం కాకపోయినా, పరస్పరాశ్రితాలే అయినా, దేని ప్రత్యేక లక్షణం దానిది. సాధన ఈ ఐదు అంశాల నిష్పత్తి వ్యక్తి వయసునుబట్టి, పాత్రనుబట్టి, సమర్థతనుబట్టి, లక్ష్యాన్నిబట్టి మారుతుంటుంది. విద్యార్థిగా దైహిక, మానసిక వికాసాలపై దృష్టిని కేంద్రీకరిస్తే, గృహస్థుగా సామాజిక, ఆర్థిక విషయాలపై దృష్టిని సారిస్తాడు. ఆర్షమార్గగామికి విశ్రాంత జీవిగా ఆధ్యాత్మికతనే హృదయ క్షేత్రంగా మలచుకోవలసి ఉంటుంది. అయితే, సనాతన ధార్మిక జీవనం ఆధ్యాత్మిక సూత్రాన్ని గోరుముద్దలతో ప్రారంభించి, పరమపద సిద్ధివరకు క్రమంగా విస్తరింపజేస్తుంది. 

సమాజంలో ఏ ఉద్యోగ సంబంధ పాత్ర నిర్వహించినా వ్యక్తి విజ్ఞానుభూతుల పరిణామక్రమంలో కృతజ్ఞత, వినయం, సేవ, దానం, ధ్యానం ఇత్యాదుల ద్వారా జీవన్ముక్తికీ, విదేహముక్తికీ కావలసిన వివేక, వైరాగ్య, సమర్పణామయ విశాల దృక్‌ సంపన్నతను పండిస్తుంది. అయితే, ఈ క్రమశిక్షణకు కావలసిన వాతావరణం వర్తమాన వ్యాపార, విలాస సంస్కృతిలో తీవ్ర ప్రతికూలతలకు బలి అవుతుండటం ప్రస్తుత విషాదం. ఇందుకు విరుగుడు శక్తిగా ముందుగా ఉద్గమించవలసింది, ఉద్యమించవలసింది సమన్వయాత్మక శాస్త్ర దృక్పరిణతి కలిగిన విద్యాబలతేజో విరాజమూర్తులే. వారి వీరత్వమూ, త్యాగమూ, ముక్తకంఠమూ అచంచల సంబుద్ధాక్షర పదముద్రల మార్గదర్శనం మాత్రమే భవిష్యత్తుకు రక్ష.


logo