శనివారం 15 ఆగస్టు 2020
Devotional - Jul 29, 2020 , 00:02:53

తపో జీవనమే గీతా మార్గం!

తపో జీవనమే గీతా మార్గం!

విశ్వసృష్టి జరగడానికి ముందే వినిపించిన శబ్దం తపస్సు. నారాయణుని నాభి కమలంలో బ్రహ్మదేవుని ఆవిర్భావం జరిగిన తర్వాత తన ఆవిర్భావానికి కారణాన్ని, ప్రయోజనాన్ని అర్థం చేసుకోలేకపోయాడు బ్రహ్మ. ఆయనకు ‘తప! తప!!’ అని రెండుసార్లు వినిపించింది. ‘తాను చేయవలసింది తపస్సు’ అని అర్థం చేసుకొని, తపస్సుకు ఉపక్రమించాడు. దానిలో సిద్ధిని పొందిన తరువాత తన జన్మ కారణాన్ని, ప్రయోజనాన్ని తెలుసుకొన్నాడు. అప్పుడు పరమాద్భుతంగా సృష్టికార్యాన్ని నిర్వహించాడు. దీనినిబట్టి, విశ్వసృష్టికి ముందే ‘తపస్సు’ పుట్టిందన్నది స్పష్టం.

విశ్వంలోని జీవులందరికీ, ముఖ్యంగా మానవులకు చక్కని మార్గదర్శకం తపస్సు. బ్రహ్మదేవుడు సైతం అలాగే, తన కార్యంలో కృతకృత్యుడయ్యాడు. అసలు, ‘తపస్సు’ అంటే ఏమిటి? స్వచ్ఛందంగా శరీరాన్ని తపింపజేయడమే తపస్సు. సాధారణంగా ఎవరూ శరీరాన్ని తపింపజేయడానికి సాహసించరు. దానిని సుఖపెట్టాలనే ఎవరైనా అనుకొంటారు. ఉదాహరణకు శరీరానికి షడ్రసోపేతమైన భోజనం పెట్టడం భోగమైతే, శరీరాన్ని ఉపవాసం ఉంచడం తపస్సు అవుతుంది. మూడు పూటలా విందు భోజనాలే పెడితే దేహం రోగగ్రస్థమవుతుంది. కాగా, వారానికి కనీసం ఒకసారైనా శరీరానికి ఉపవాసం చేయిస్తే అది ఆరోగ్యంగా ఉంటుంది. అందుకే, తపస్సుతో పరమ సుఖమే కలుగుతుంది.

మానవులు తప్పకుండా చేయవలసిన తపస్సులను గురించి భగవద్గీత పేర్కొన్నది. ఎవరైతే వాటిని తెలుసుకొని పాటిస్తారో వారికి పరమ సుఖభాగ్యాలు కలుగుతాయన్నది గీతాశాస్త్ర ప్రబోధం. శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో మానవులందరికీ మూడు రకాల తపస్సులు చెప్పాడు. అవి: శారీరక, వాచిక, మానసిక తపస్సులు. శారీరక తపస్సులో భగవంతుడిని, బ్రాహ్మణులను, గురువును, తల్లిదండ్రుల వంటి పెద్దలను పూజించడం నుంచి శుచిత్వం, సరళత్వం, బ్రహ్మచర్యం, అహింస, అంతర్భాహ్య శుచిత్వం, ఋజువర్తనం, మాంసభక్షణం లేకపోవడం.. వంటివి ఉన్నాయి.  

సత్యమైనవి, ప్రియమైనవి, లాభకరమైనవి, ఇతరులకు కలతను కలిగించని మాటలు పలుకడం, ప్రతి రోజూ గీతా భాగవత రామాయణాది శాస్ర్తాలను చదువడం వాచిక తపస్సులోకి వస్తాయి. ‘మాట మంచిదైతే ఊరు మంచిదనే’ సామెత చెప్పేది దీని కోసమే. తప్పులు పట్టక పోవడం, ఎవరినీ నిందించక పోవడం, చాడీలు చెప్పక పోవడం, మాటలతో ఎవరి మనసూ నొప్పించక పోవడం.. ఇవన్నీ ఇందులోనివే. ఒక నెలరోజులపాటు దీనిని పాటిస్తే తత్‌ ప్రభావం స్పష్టంగా తెలుస్తుంది. ఈ సమయంలో గీతా పారాయణం వంటివీ చేయండి. అద్భుత ఫలితాలు మన స్వంతమవుతాయి. 

‘మానసిక తపస్సు’ అంటే ‘సంతృప్తి’ని కలిగి ఉండటం. సరళత్వం, మౌనం, ఆత్మనిగ్రహం, స్వీయ అస్తిత్వాన్ని శుద్ధి పరచుకోవడం.. వంటివి దీనిలోకి వస్తాయి. ఉదాహరణకు భోజనం పూర్తి కాగానే తృప్తి చెందడం మానసిక తపస్సు. ఆ చక్కని భోజనాన్ని వండి వడ్డించిన వారిని మెచ్చుకోవడం వాచిక తపస్సు. ప్రపంచంలో అనేకమంది ఒక్కపూట భోజనానికే నోచుకోలేక పోతున్న ఈ కాలంలో రెండు పూటల భోజనాన్ని కరుణతో అందిస్తున్న భగవంతునికి కూడా మనసారా కృతజ్ఞతా పూర్వక నమస్కారం (ప్రార్థన) చేయడం శారీరక తపస్సు. ఇలా జీవితంలోని ప్రతి కార్యాన్ని మనం ఈ మూడు రకాల తపస్సులతో జోడించాలని మన సనాతన ధర్మం చెబుతున్నది. ఆధునిక కాలానికి ‘తపో జీవనం’ అంటే మరేమిటో కాదు, పైన చెప్పిన గీతోపదేశ మార్గంలో నడవటమే. ఇదే మానవాళికి గీతోపదేశం అందిస్తున్న అద్భుత స్ఫూర్తి.logo