మంగళవారం 04 ఆగస్టు 2020
Devotional - Jul 27, 2020 , 23:21:37

పితృదేవోభవ!

పితృదేవోభవ!

‘పుత్రోత్సాహము తండ్రికి

పుత్రుడు జన్మించినపుడు పుట్టదు, జనులా

పుత్రుని కనుగొని పొగడగ

పుత్రోత్సాహము నాడు పొందుర సుమతీ..’

అని సుమతీ శతకకారుడు పలికిన ఈ పద్యం తెలియని తెలుగు వాడుండడు. కుటుంబంలో తండ్రి బాధ్యత కొండంత. నాన్న చెమట వాసన.. త్యాగపు పరిమళం. గుండెనిండా దుఃఖపు నిల్వలు నింపుకున్నా ముఖం మీద చిరునవ్వు చెదరకుండా చూసుకుంటాడు. ఏ కష్టం వచ్చినా కన్నీళ్లు పెట్టకుండా మగాడని అనిపించుకుంటాడు. మొగుడిగా.. మంచి మొగుడని అనిపించుకోవాలని తాపత్రయం. మంచి తండ్రి అనిపించుకోవాలనీ ఆశ. ‘పుత్రా దిచ్ఛేత్‌ పరాజయమ్‌' ఆకాంక్షిస్తాడు. ఏ తండ్రి అయినా తనకంటే తన కొడుకు గొప్పవాడు కావాలని అనుకొంటాడు. అవసరమైతే, తన కొడుకే తనను ఓడించినా ఆనందపడతాడు. శిష్యుడి చేతిలో గురువు, కొడుకు చేతిలో తండ్రి ఓడిపోయినా ఆనందించే వాళ్లే. కొడుక్కు సకల సదుపాయాలను సమకూర్చడంలో బ్రహ్మలాంటి వాడు తండ్రి. రక్షణ, పోషణ కల్పించడంలో శ్రీ మహావిష్ణువు. 

మందలించి మంచి దారికి మళ్లించడంలో పరమశివుడే. జన్మకు తల్లిదండ్రులు ఇద్దరూ కారకులే. జీవితంలో ఇద్దరూ ముఖ్యమే. అయినా, నిత్య వ్యవహారంలో తండ్రి స్థానం పిసరంత ఎక్కువే. పితృవాక్య పాలన అనగానే గుర్తుకు వచ్చేవాడు శ్రీరాముడు. తండ్రి మాటను జవదాటని మరో వ్యక్తి పరశురాముడు. తండ్రి కాంక్షను పసిగట్టి, తండ్రికి సంతృప్తినీ, సంతోషాన్నీ కలిగించిన గాంగేయుడు భీష్ముడిగా సుప్రసిద్ధుడు. వీరశైవ వ్రతాచారం ప్రకారం కన్న తండ్రి అభీష్టాన్ని నెరవేర్చిన సిరియాళుడు వేనోళ్ల కీర్తింపబడ్డాడు. సుపుత్రులు వున్నట్లే గుణనిధి, నిగమశర్మ లాంటి కుపుత్రులు కూడా వుంటారీ లోకంలో. ‘కుపుత్రుడు’ అంటే కంటిలో కాయ లాంటివాడు. 

నరాలపై కురుపు, కడుపులో బిల్ల. తలలోని కంతి. ఇటీవలి కాలంలో కట్టుదిట్టమైన కుటుంబ వ్యవస్థ గోడలు బీటలు వారి పోతున్నాయి. మానవ సంబంధాలు మృగ్యమై ‘మనీ’ బంధాలు పెచ్చరిల్లుతున్నాయి. కని, పెంచిన వారిపట్ల కనికరం తరిగిపోతున్నది. ఏడేండ్ల వాడయ్యే వరకు కుమారుణి రాజుగా లాలించే తండ్రి, ఆ పైన పదేండ్ల దాక సేవకునిలా కొడుకును చూసుకొనే తండ్రి, ఆ తర్వాత మిత్రునిలా కొడుకుతో వ్యవహరించే తండ్రి, నాగరిక కుటుంబంలోని తండ్రి, గీతలు పడ్డ చెల్లని నాణెంలా మూగవేదనను అనుభవిస్తున్నాడీనాడు. తండ్రిని ఆరాధించక పోయినా ఫర్వాలేదు, అసహ్యించుకోకుండా వుంటే చాలు. నాన్నకు గుడి కట్టించక పోయినా ఫర్వాలేదు. కాని, గుడిమెట్ల కాడ ఉండకుండా చూసుకుంటే చాలు. నాన్న మాటల్ని మన్నించక పోయినా ఫర్వాలేదు. తన మనసు నొప్పించకుంటే చాలు. తన కన్నా తను కన్న కొడుకు గొప్పవాడు కావాలని ఆకాంక్షిస్తూ, అష్టకష్టాలు అనుభవించి కొడుకును పెంచిన తండ్రిని ప్రేమించడం, గౌరవించడం సంస్కార లక్షణం. బాధ్యత కూడా. జన్మ నిచ్చి, ఎలా జీవించాలో తెల్పి, జీవితం విలువ తెలిసేలా చేసే తండ్రి ప్రత్యక్ష దైవమే!!


logo